close

తాజా వార్తలు

సంక్షోభంలో కొబ్బరినూనె పరిశ్రమ

రాయితీలను ప్రకటిస్తేనే మనుగడ

న్యూస్‌టుడే, అంబాజీపేట

మాచవరంలో మూతపడిన కొబ్బరి నూనె మిల్లు

 

అంబాజీపేట కొబ్బరి నూనె పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. పొరుగు రాష్ట్రాల పోటీ.. సంప్రదాయ పద్ధతుల్లో కొబ్బరి నూనె తయారీ.. విద్యుత్తు బిల్లుల భారం.. కూలీలు, కొత్తకొబ్బరి సమస్యలు.. ఇవన్నీ ఇందుకు కారణమే. ఒకప్పుడు రోజూ నడిచే మిల్లులు ఇప్పుడు వారానికి ఒకటి రెండు రోజులకు మించి తిరగడం గగనమవుతోంది. దీంతో పరిశ్రమల నిర్వాహకులు ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలను ఆన్వేషిస్తున్నారు. కోనసీమ కొబ్బరి నూనె మిల్లుల సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే...

ప్రోత్సాహం కరవు..

అంబాజీపేటలో గతంలో 30 కొబ్బరి నూనె మిల్లుల్లో నిత్యం నూనె తయారయ్యేది. తద్వారా ఎందరికో ఉపాధి లభించేది. ప్రస్తుతం అంబాజీపేటలో నాలుగు మిల్లులు మాత్రమే పని చేస్తున్నాయి. గతంలో ఇక్కడ్నుంచి ఇతర రాష్ట్రాలకు కొబ్బరి నూనె ఎగుమతయ్యేది. కొన్నాళ్లుగా పెద్ద మిల్లులకు ఆశించిన స్థాయిలో పని ఉండడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు స్థానిక మిల్లులకు రాయితీలు అంతగా లభించడం లేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరినూనె మిల్లులకు యూనిట్‌ విద్యుత్తు రూ.3.50లకు ఇస్తున్నారు. ఇక్కడ రూ.9. అక్కడ రుణాలు అందుతున్నాయి. మన వద్ద నూనెపై 5 శాతం, కోప్రా కేకుపై 5 శాతం పన్ను ఉంది. అదే ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి టాక్సులు లేవని అంబాజీపేటకు చెందిన మిల్లు నిర్వాహకుడు రవణం హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రాల పోటీ

తమిళనాడులో వెయ్యి కొబ్బరి కాయల నుంచి నూనె తయారుచేస్తే 135 కిలోలు వస్తోంది. కేరళలో 125 కిలోల నూనె దిగుబడి వస్తోంది. అదే మన వద్ద 65 కిలోలు మాత్రమే వస్తోంది. పైగా ఆయా రాష్ట్రాల్లోని కొబ్బరి నూనె నాణ్యతపరంగా బాగుంటుంది. ఇతర రాష్ట్రాలకు అక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో కోనసీమలోని అంబాజీపేట కొబ్బరి నూనెకు పెద్దగా డిమాండు ఉండడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఆధునాతన యంత్రాలతో నూనె తీస్తుంటే.. మనం సంప్రదాయ పద్ధతిలోనే తీస్తున్నాం. గతంలో అంబాజీపేట కేంద్రంగా నడిచే కొబ్బరి నూనె పరిశ్రమలు ఏపీ, తెలంగాణలతో దిల్లీ, కోల్‌కతాలకు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు.

అంబాజీపేట మార్కెట్‌ యార్డులో ఆరబోసిన కొత్త కొబ్బరి (దాచిన చిత్రం)

రాయితీలు అందించాలి

తమిళనాడు, కేరళ మాదిరిగా కొబ్బరినూనె మిల్లులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు అందించాలి. బ్యాంకు రుణాలందించి పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. మూతపడిన మిల్లులను తిరిగి తెరిపించేలా చొరవ తీసుకోవాలి.

- పాబోలు రాజేశ్వరరావు, కోనసీమ కొబ్బరినూనె వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, అంబాజీపేట

పరిశ్రమకు జీవం పోయాలి

అంబాజీపేట కొబ్బరి నూనె పరిశ్రమకు జీవం పోయాలి. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలి. ప్రత్యేకంగా...పరోక్షంగా ఎంతో మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. తెగుళ్లు, పురుగుల కారణంగా కాయల నాణ్యత దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో పరిశ్రమ నిర్వహణ ఆర్థికంగా భారమవుతోంది.

- గణపతి నాగసత్యనారాయణరావు(బాబులు), కోనసీమ కొబ్బరి నూనె మిల్లుల యజమానుల సంఘం అధ్యక్షుడు, అంబాజీపేట


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.