close

తాజా వార్తలు

ఇసుకాసురులు,గుట్కాసురులనువదలొద్దు

● అనుమానాస్పద మరణాలపై ప్రత్యేక దృష్టి

● జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వీక్షణ సమావేశం

పొదిలి సీఐ శ్రీరామ్‌తో వీక్షణ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో నమోదవుతున్న అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆదేశించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి... ఆ మరణాల వెనకున్న గుట్టును బహిర్గతం చేయాలని సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం ఆయన తొలిసారి ప్రయోగాత్మకంగా అన్ని పోలీసు స్టేషన్లు, సర్కిల్‌, సబ్‌ డివిజన్‌ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దానిపై తరచూ వీక్షణ సమావేశాల ద్వారా ఉన్నతాధికారులు సమీక్షలు చేపడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, ప్రత్యేకించి జిల్లా కేంద్రం ఒంగోలు, చీరాల పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గుట్కా, ఇసుక అక్రమ రవాణా, జూదంపై నిరంతర తనిఖీలు కొనసాగించాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఈ అంశంపై మంచి కృషి జరుగుతోందని, దాన్ని మరింతగా కొనసాగించాలని కాంక్షించారు. దర్శి సబ్‌ డివిజన్‌ నుంచి ప్రారంభించి పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ వీక్షణ సమావేశం ద్వారా ముఖాముఖి మాట్లాడారు. డెస్క్‌టాప్‌ ద్వారా జిల్లాలోని అధికారులతోనూ, అప్పటికప్పుడు ఏర్పాటు చేయించి... గుంటూరు రేంజి ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో మాట్లాడారు. అదనపు ఎస్పీ మహేంద్రపాత్రుడు చరవాణి ద్వారా వీక్షణ సమావేశానికి అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్భంగా ఐజీ ఎస్పీ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో పోలీసింగ్‌ను కొత్త పుంతలు తొక్కించాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ వి.శ్రీరాంబాబు, ఎస్‌బీ - 2 ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కేవలం రూ.2,500 ఖర్చుతోనే..

వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను జిల్లా కేంద్రానికి అనుసంధానించడం క్లిష్టమైన పని. దీనికి కంప్యూటర్లు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ. 1.50 లక్షల నుంచి రూ. రెండు లక్షల వరకూ ఖర్చవుతుంది. మేం అంతటి ఖర్చుకు వెళ్లలేదు. ఇప్పటికే అన్ని స్టేషన్లకు సీసీటీఎన్‌ఎస్‌, ఈ కాప్స్‌ కింద కేటాయించిన కంప్యూటర్లు ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యము ఉంది. వీక్షణ సమావేశం అనుసంధానానికి సంబంధించిన లైసెన్సు కొనుగోలు చేశాం. వెబ్‌ కెమెరా, స్పీకర్లు ఏర్పాటు చేశాం. దీనికిగాను ఒక్కొక్క స్టేషన్‌కు మేం పెట్టిన ఖర్చు రూ. రెండు వేల నుంచి రూ. 2,500 మాత్రమే. జిల్లాలోని అన్ని స్టేషన్లూ ఈ వీక్షణ సమావేశానికి అందుబాటులోకి వచ్చాయి. దీని వెనుక మా ఐటీ కోర్‌టీమ్‌ చేసిన కృషి అమోఘం, ప్రశంసనీయం.. రాష్ట్రంలో కేవలం కొన్ని కమిషనరేట్ల పరిధిలో మాత్రమే వీక్షణ సమావేశ అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసింది మనం మాత్రమే.. ఈ తరహా సమావేశాల ద్వారా నేరుగా అధికారులతో ముఖాముఖి మాట్లాడి సమాచార మార్పిడి చేసుకోవచ్ఛు తద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్ఛు చరవాణులను సైతం దీనికి అనుసంధానించడం ద్వారా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు... అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తూ జిల్లా కేంద్రం నుంచి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. - ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌\


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.