close

తాజా వార్తలు

జల రక్షణ జన సంరక్షణ
 పాఠశాలల్లో చైతన్య కార్యక్రమాలు

 ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో కలెక్టర్‌ డాక్టర్‌ భరత్‌

 రెండేళ్లపాటు ఉద్యమంలా కార్యక్రమాలు

 ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలి

 

న్యూస్‌టుడే, చిత్తూరు (జిల్లా సచివాలయం): ‘జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి.. రానున్న రెండు మూడేళ్లలో జిల్లా జలకళ సంతరించుకునేలా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం’ అని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా పేర్కొన్నారు.. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుతోపాటు పొలాల్లో పంట కుంటలు నిర్మిస్తాం.. ప్రత్యేకించి అవగాహన కార్యక్రమాలు.. ర్యాలీలు.. సదస్సులు నిర్వహిస్తామని.. అదే సమయంలో వన సంరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండుమూడేళ్ల పాటు ఉద్యమ తరహాలో జలవనరుల అభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేస్తామని.. ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చి వారందరినీ ఈ బృహత్కార్యంలో భాగస్వాములను చేస్తామని.. ఇలా అన్ని విధాలా ఓ నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు స్పష్టం చేశారు. జలసంరక్షణకు చేపట్టనున్న కార్యక్రమాలు.. ప్రత్యేక ప్రణాళికపై ఆయన ‘న్యూస్‌టుడే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

వర్షపు నీటి సంరక్షణ..

జలవనరులను పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. నేడు నీటి సంరక్షణే తొలి ప్రాధమ్యం. ఏదో కష్టం వచ్చిందని కాదు.. ఇప్పుడు అప్రమత్తంగా ఉంటేనే భావితరాలు పదికాలాల పాటు వర్ధిల్లుతాయి. అందుకే దీన్నొక ఉద్యమంలా చేపట్టాలని తలచాం. మొదట ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర భవనాలపై నుంచి జాలువారే వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ఏర్పాట్లు చేయనున్నాం. ఇవే పనులు గతంలోనూ చేశారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో వీటిపై దృష్టిపెట్టాం. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేందుకు ప్రత్యేకంగా ఇంకుడుగుంతలను తవ్వించనున్నార. భవనాలపై నుంచి పడే వర్షపు నీటిని ఓ చోటకు తీసుకొచ్చి బోర్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని ఇంకేలా చేస్తాం. ఇందుకు కొన్ని నమూనాలు సిద్ధం చేస్తున్నాం. గ్రామీణ నీటిసరఫరా.. గృహనిర్మాణ తదితర శాఖల సమన్వయంతో వీటిని చేపట్టనున్నాం.

పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు..

జల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫున పనులు నిర్వహిస్తూనే ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు. వారి ద్వారానే ఈ ఉద్యమం మరింత విస్తృతమవుతుంది. ఇందుకు మొదటగా జిల్లాలో 600 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశాం. ఈ పాఠశాలల్లో ఉపాధి హామీ, వ్యవసాయ, ఇతర శాఖల సమన్వయంతో విద్యార్థులకు నీటి సంరక్షణ, దాని ఆవశ్యకత తదితర అంశాలపై చైతన్యవంతులను చేస్తాం. ర్యాలీలు, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. గ్రామాల్లో సైతం పలు ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనున్నాం. నీటి వృథాను అరికట్టడం.. వర్షపు నీటిని సంరక్షించేలా ఇంకుడు గుంతల తవ్వకం తదితర కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తాం. అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించే సంస్థ.. సంఘాల సహకారాన్నీ తీసుకుంటాం.

కేంద్రం సహకారంతో..

కేంద్ర ప్రభుత్వం జల్‌శక్తి అభియాన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 258 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లో జలవనరులను యుద్ధప్రాతిపదికన పెంపొందించడం ద్వారా దుర్భిక్ష పరిస్థితులను నివారించాలనేదే లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు జిల్లాకు ఒక కేంద్ర స్థాయి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ఆ అధికారి ఆధ్వర్యంలోని సభ్యుల బృందం.. జిల్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యాచరణ రూపొందించింది. రానున్న రెండుమూడేళ్లలో ఆ ప్రణాళిక అమలు చేస్తాం. దానికి తగ్గట్టు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం.

మరిన్ని నిధులతో..

ఇప్పటికే నీటి వనరులను పెంపొందించేందుకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధుల్లో 50-60 శాతం వెచ్చిస్తునాం. ఇకపై ఆయా ప్రాంతాల్లో మరికొన్ని నిధులు అదనంగా వెచ్చిస్తాం. ఉపాధి హామీ, జలవనరుల శాఖ గ్రామీణ నీటి సరఫరా విభాగం, అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా మరిన్ని నిధులను ఇందుకు కేటాయించనున్నాం. ప్రధానంగా జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 15 మండలాల పరిధిలోని నాలుగు వేల గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందేకు చర్యలు చేపడతాం.

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.