close

తాజా వార్తలు

నకిలీ నెయ్యి !

నెల్లూరు కేంద్రంగా విక్రయాలు 

నరసరావుపేటలో తయారీ యూనిట్‌

గుట్టురట్టు చేసిన ఆహార తనిఖీ అధికారులు

 చర్యలకు రంగం సిద్ధం

 
జేసీ వెట్రిసెల్వికి ఆధారాలు చూపుతున్న జిల్లా ఆహారతనిఖీ అధికారి.

(జేసీ టేబుల్‌పై నకిలీ నెయ్యి ప్యాకెట్‌)

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తయారీ, ఉత్పత్తి రంగాల్లో వ్యాపారం చేయాలంటే ముందుగా ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్‌ (అనుమతి) తప్పనిసరి. అయితే గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ వ్యాపారి ఎలాంటి అనుమతులు లేకుండా కొద్దికాలం క్రితం ‘సుధా ఘీ’ పేరుతో ఆవు నెయ్యి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వ్యాపారాన్ని గుంటూరు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక చేశారు. అన్ని జిల్లాల నుంచి డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటుచేసుకున్నారు. రూ.లక్షల్లో అడ్వాన్సులు తీసుకుని, ఆయా డిస్ట్రిబ్యూటర్లకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. అనతికాలంలోనే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా నెయ్యిని బ్రాండ్‌ పేరుతో 500 ఎంఎల్‌(455 గ్రాములు) ప్యాకెట్లలో మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. ఈ ప్యాకెట్‌పై అరకిలో ఎంఆర్‌పీ ధర రూ. 270లు ముద్రించి డిస్ట్రిబ్యూటర్లకు రూ.70లకు విక్రయిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు రూ.120 నుంచి 150లకు హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరు మాత్రం ఎమ్మార్పీ ధర ఎంత ఉంటే అంత మొత్తం జనం నుంచి వసూలు చేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. మోసం ఎంతోకాలం దాగదన్నట్లు.. నెయ్యి విక్రయానికి నెల్లూరు నగరం సరస్వతినగర్‌కు చెందిన ప్రొవిజన్స్‌ వ్యాపారి సుబ్బారావు నెయ్యి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలో వ్యాపార కేంద్రమైన స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి, పెద్ద బజారు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులతోపాటు కావలి, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర పట్టణ, మండల కేంద్రాల్లో వ్యాపారులకు సరఫరా చేసేవారు. ఇలా కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా చెలామణిలో ఉంది.

మోసం బయటపడింది నెల్లూరులోనే..

నెల్లూరు నగరానికి చెందిన ఓ భక్తుడు రోజూ నగరంలోని ఓ ఆలయంలో దేవుడికి ఆవు నెయ్యితో పూజ చేస్తారు. ఈనెల 17న ఆయన ఎప్పటిలాగే పూజ చేసేందుకు దుకాణానికి వెళితే తగినంత నెయ్యి లేకపోవడంతో స్టోన్‌హౌస్‌పేటలోని ఓ హోల్‌సేల్‌ దుకాణం వద్దకు వెళ్లి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలని అడిగారు. వ్యాపారి ‘సుధా ఘీ’ (ఆవు నెయ్యి) ప్యాకెట్‌ను రూ. 120కి ఆయనకు ఇచ్చారు. సాధారణంగా అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి రూ. 200 నుంచి 350 వరకు మార్కెట్‌లో దొరుకుతుంది. అంత తక్కువ ధరకు లభించడంతో ఆయన కొంత సందేహంతోనే తీసుకొని ఆలయానికి వెళ్లి పూజకు ఉపక్రమించారు. చివరికి నెయ్యి నాణ్యతగా లేకపోవడం గుర్తించారు. అనుమానం వచ్చి జిల్లా ఆహార తనిఖీ అధికారి శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అధికారి తన బృందంతో దుకాణాన్ని తనిఖీ చేశారు. అందులో కొన్ని నెయ్యి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని ఆరాతీస్తే ఎన్టీఆర్‌నగర్‌లోని సరస్వతినగర్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ సుబ్బారావు అనే ప్రొవిజన్స్‌ నిర్వాహకుడి పేరు బయటకు వచ్చింది. వెంటనే ప్రొవిజన్స్‌ దుకాణానికి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడా పెద్ద ఎత్తున నెయ్యి ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్‌ను విచారిస్తే గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ‘సుధా ఘీ’ ప్లాంట్‌ నిర్వాహకుడి పేరు చెప్పారు. అదే రోజు నెయ్యి శ్యాంపిల్‌ సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. చివరికి నకిలీ అని తేలింది. నెల్లూరు అధికారి గుంటూరులోని జిల్లా ఆహార తనిఖీ అధికారులకు సమాచారం అందించారు. 18వ తేదీన అక్కడి అధికారులు ఆ ప్లాంట్‌ను ఆకస్మిక తనిఖీచేసి సీజ్‌ చేశారు. ఇక నెల్లూరు నగరంలో పట్టుబడ్డ డిస్ట్రిబ్యూటర్‌ సుబ్బారావుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు జిల్లా ఆహార తనిఖీ అధికారి శ్రీనివాస్‌ సర్వం సిద్ధం చేశారు. ఆయా వివరాలను జేసీ వెట్రిసెల్వికి వివరించారు. దీంతో ఆమె కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు.

పక్కా సమాచారం ఇస్తే తక్షణ చర్యలు - బి. శ్రీనివాస్‌, జిల్లా ఆహార తనిఖీ అధికారి

జిల్లాలో బ్రాండెడ్‌ నెయ్యిని కేవలం విజయ, దొడ్ల, తిరుమల, ఆక్సిజన్‌ డెయిరీలు మాత్రమే తయారుచేసి విక్రయిస్తున్నాయి. వీటికే జిల్లాలో గుర్తింపు ఉంది. నరసరావుపేటలోని సుధా ఘీ ప్లాంట్‌కు అసలు అనుమతే లేదు. ఆ నెయ్యిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు ఓ భక్తుడు ఇచ్చిన సమాచారం మేరకు తాము తనిఖీలు నిర్వహించాం. ప్రొవిజన్స్‌ దుకాణ నిర్వాహకుడు సుబ్బారావు వద్ద బయటపడ్డ నెయ్యి ప్యాకెట్లను సీజ్‌చేశాం. జిల్లాలో ఎక్కడైనా ఈ తరహా నకిలీ ఆహార ఉత్పత్తులు ఉంటే 9989688699 నంబరుకు సమాచారం ఇస్తే తక్షణ చర్యలు చేపడతాం. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూటర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నాం.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.