close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్షలో కలెక్టర్‌ ఆదేశం

సమావేశంలో పాల్గొన్న అధికారులు, కమిటీ సభ్యులు

నెల్లూరు, కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలు తదితరులకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సాంఘిక సంక్షేమ, పోలీసు, ఇతర అధికారులను ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అట్రాసిటీ కేసులపై జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కమిటీ సభ్యులు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసు అధికారులు వివక్షతో ఆయా కేసుల్లోని అగ్రవర్ణాలకు చెందిన వారి పేర్లను తొలగించడం జరిగిందని కలెక్టర్‌, ఎస్పీల దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకు అలా జరిగిందో సంబంధిత డీఎస్పీలను వివరణ అడిగారు. కొన్ని పోలీసుస్టేషన్లలో అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసినా.. వెంటనే కేసు నమోదు చేయడం లేదని, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని, వాస్తవ కేసుల్లో బాధితులకు అన్యాయం జరుగుతుందంటూ కమిటీ సభ్యులు విన్నవించారు. పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ కలెక్టర్‌ హెచ్చరించారు. మొత్తం 150 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత పోలీసు అధికారులు వివరించారు. అనంతరం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం 200 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం 150 కేసులకు తగ్గించామని, వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్యను 120కి తగ్గించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు.

 

మానవతాదృక్పథంతో పరిష్కరించాలి : అనంతరం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు ఉన్నాయని, దీనివల్ల దళితులు పలు విధాలుగా బాధలు పడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై పెట్టిన కేసులలో పలువురు జైళ్లలో ఉన్నారని, పేదరికం కారణగా వారు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారని అన్నారు. మానవతాదృక్పథంతో ఆ కేసులను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ కె. వెట్రిసెల్వి, జేసీ-2 కేఈ సాధన, టీజీపీ ప్రత్యేక కలెక్టర్‌ సదాభార్గవి, డీఆర్వో సి. చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో చిన్నికృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ జీవపుత్రకుమార్‌, అట్రాసిటీ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, నెల్లూరు, నెల్లూరు గ్రామీణం, గూడూరు, కావలి, ఆత్మకూరు డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు హాజరయ్యారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన