close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇస్కాన్‌లో నేటి నుంచి ఉత్సవాలు

 
మాట్లాడుతున్న రేవతి రమణదాస్‌

తిరుపతి(తాతయ్యగుంట), న్యూస్‌టుడే: తిరుపతిలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌)లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నట్లు మందిరం అధ్యక్షుడు రేవతి రమణ దాస్‌ పేర్కొన్నారు. స్థానిక ఇస్కాన్‌ మందిరంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం 7 గంటలకు మందిరంలో ఆదివాసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాం. ఇందులో కంకణధారణ, ప్రత్యేక పూజ, సంకల్పం, స్వామివారికి తీసుకొచ్చిన వస్తువులు, పూజ సామగ్రి నివేదన చేశారు. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. 23న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని వేకువజామున 4.30 గంటలకు మహా మంగళహారతి, విశేషాలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు హరినామ సంకీర్తనల నడుమ శ్రీ రాధాగోవిందుల దర్శనానికి అనుమతి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మందిరానికి ఎదురుగా ఉన్న మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. శనివారం వేకువజామున 4.15 గంటలకు మహా మంగళహారతి, శ్రీ రాధాగోవిందులకు నరసింహ హారతి, తులసీ మహారాణి పూజ, అంతరాలయ అభిషేకం, విశేషాలంకరణ జరుగుతుంది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 12గంటల వరకు భక్తులు దర్శనభాగ్యం చేసుకోవచ్ఛు సాయంత్రం 4గంటలకు మైదానంలో ఉట్లోత్సవం, మందిర అధ్యక్షులుచే కృష్ణకథ(జన్మాష్టమి) ప్రవచనం ఉంటుంది. సాయంత్రం 7గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. రాత్రి 10 నుంచి 12గంటల వరకు ఎంతో విశిష్టమైన శంఖాభిషేకం, ప్రసాద వితరణ జరుగుతుంది. 25న ఇస్కాన్‌ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి జయంతిని పురస్కరించుకుని వేకువజామున 4.30 గంటలకు మహా మంగళ హారతి, 7.30గంటలకు శ్రీ రాధాగోవిందుల, ప్రభుపాదుల వారికి విశేషాలంకరణ జరుగుతుంది. మధ్యాహ్నం శంఖాభిషేకం, మందిర అధ్యక్షులు చేత ప్రభుపాదుల వారి ప్రవచనం ఉంటుంది. అనంతరం స్వామివారికి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.

ఏర్పాట్లు పూర్తి

శ్రీరాధాగోవిందుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వృద్ధులు, వీఐపీలు/ తితిదే ఉద్యోగులు, సర్వదర్శనం తదితర ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వచ్చే లక్షలాది మంది భక్తులకు త్వరితగతిన దర్శనం పూర్తిచేసేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మందిరానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, తాగునీరు, వైద్యశిబిరం తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు. మూడు రోజుల పాటు శ్రీ రాధాగోవిందులతో పాటు అష్టసఖులకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన ఫలాలు, పుష్పాలతో అలంకరించనున్నారు. కార్యక్రమంలో మందిర ఉపాధ్యక్షుడు రూపేశ్వర చైతన్య దాస్‌, లక్ష్మీపతి గౌరదాస్‌, పీఆర్‌వో లీలాపారాయణదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కాణిపాకం ఆలయంలో వేడుకలు

కాణిపాకం, న్యూస్‌టుడే: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో శుక్రవారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వి.దేముళ్లు తెలిపారు. ఏటా కృష్ణాష్టమి సందర్భంగా గోశాలలో గోపూజ, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుతున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈవో కోరారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన