close

తాజా వార్తలు

హాసిని..మృదుభాషిణి

బోటు ప్రమాదంలో బాలిక మృతి

లభించని సుబ్రహ్మణం ఆచూకీ

తల్లిదండ్రులతో హాసిని

ఈనాడు, తిరుపతి: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో తిరుపతికి చెందిన దుర్గం హాసిని(12) మృతి చెందింది. ఆమె తండ్రి దుర్గం సుబ్రహ్మణ్యం ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. గల్లంతైన వారి కోసం అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘటన తెలిసిన తర్వాత దుర్గం సుబ్రహ్మణ్యం బంధువులు రాజమహేంద్రవరానికి వెళ్లారు. హాసిని చనిపోయిందని తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి గంగిశెట్టి అస్థికలు గోదావరిలో కలిపేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడి నుంచి పాపికొండలు చూసేందుకు వెళ్తున్న సమయంలోనే బోటు ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి సుబ్రహ్మణ్యం భార్య మధులత బయటపడగా, కుమార్తె హాసిని నీట మునిగి చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని ఆదివారం గోదావరి నుంచి వెలుపలికి తీసినట్లు అధికారులు చెబుతున్నారు. బాలికను గుర్తించేందుకు ఎవరు లేకపోవడంతో ఫ్రీజర్‌లో ఉంచారు. హాసిని చనిపోయినట్లు అధికారులు సోమవారం ధ్రువీకరించి..తిరుపతి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలిక తిరుపతిలోని స్ప్రింగ్‌డేల్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ప్రమాద ఘటన తెలిసిన తర్వాత తోటి విద్యార్థులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. చిన్నారి మృతి చెందినట్లు తెలియడంతో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు దిగ్భ్రాంతికి గురయ్యారు.తమతో స్నేహంగా ఉండేదని తోటి విద్యార్థులు చెబుతుండగా..చదువులో చురుగ్గా ఉండేదని.. మితంగా మాట్లాడుతూ.. మృదువుగా జీవనం సాగించేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలిక మృతదేహాన్ని సోమవారం రాత్రి కల్లా తిరుపతికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.

ముద్దులొలికే ఆ రూపం చెదిరిపోయిది.. నవ్వులు పూయించే ఆ మోము వాడిపోయింది.. మధుర మాటలు పలికే ఆ గొంతు మూగవోయింది.. సరస్వతి ఒడిలో సరిగమలు పలికించే ఆ వీణ గోదారిలో ఒదిగిపోయింది.. తరగతి గదిలోని ఆ రోల్‌ నంబరు ఆగిపోయింది.. కన్నతల్లి హృదయ దీపం ఆరిపోయింది.. నట్టింట్లో సందడి ముగిసిపోయింది.. స్నేహమాలలోని ఓ పువ్వు రాలిపోయింది.. మార్కుల పంట మాయమైంది.. ఆ గురువుల మృదు‘హాసిని’ తరలిపోయింది.. దుర్గం వారి గారాలపట్టిపై విధి పగబట్టింది.. ‘చిరు’శ్వాసను తీసేసింది.. భావి రాతను చెరిపేసింది..‘ కల’ల జీవితాన్ని తుంచేసింది.. అనురాగాలు పంచే ఆత్మీయుల్లో.. ఓనమాలు నేర్పించిన గురువుల్లో.. ఆనందాలు పంచే స్నేహితుల్లో..అంతులేని దుఃఖాన్ని.. అన్నింటికీ మించి..ఆ అమ్మ కళ్లకు కన్నీళ్లు కానుకగా ఇచ్చేసి.. తరలిరాని లోకాలకు తరలిపోయింది. - ఈనాడు-తిరుపతి


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.