close

తాజా వార్తలు

కోడెల మృతికి వేధింపులే కారణం

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా

అనకాపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం వేధింపుల కారణంగానే మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారని జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణలు ఆరోపించారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో సోమవారం రాత్రి పట్టణ తెదేపా ఆధ్వర్యంలో కోడెల మృతికి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ కోడెల ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా, స్పీకర్‌గా ఎంతో సమర్థంగా పనిచేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కక్షసాధింపుల వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పల్నాడు పులిగా బతికారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ కోడెల మృతి చెందారనే వార్త నమ్మలేకపోయామన్నారు. ఆయన క్రమశిక్షణ కలిగిన నేతని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన తమకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. తెదేపా నాయకులు డాక్టరు నారాయణరావు, శ్రీనివాసరావు, వెంకటరావు, శ్రీనివాసరావు, సురేంద్ర, రాము, జోగినాయుడు, రమణమూర్తి, రాము పాల్గొన్నారు.

అనకాపల్లితో కోడెలకు అనుబంధం

అనకాపల్లి, న్యూస్‌టుడే: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు అనకాపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడకు రెండు పర్యాయాలు వచ్చారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. తెదేపాలో ఇద్దరూ కలిసి మూడు దశాబ్దాలు పని చేశారు. స్థానిక ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో ఏడాదిపాటు నిర్వహించిన సూపర్‌స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరానికి కోడెల వైద్యారోగ్య శాఖ మంత్రిగా హాజరయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆసుపత్రి వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఎదురుగా ఉన్న స్థలాన్ని ఆసుపత్రికి కేటాయించాలని డిమాండు చేశారు.

‘భద్రుడు’ అని పిలిచే వారు

కోడెలతో మూడు దశాబ్దాల స్నేహం. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో మంత్రులుగా చేశాం. ఆయన సొంత జిల్లా గుంటూరుకు ఇన్‌ఛార్జి మంత్రిగా పనిచేశా. ప్రతిపక్షంలోనూ పార్టీ తరఫున అదే జిల్లాకు ఐదేళ్లపాటు ఇన్‌ఛార్జిగా కొనసాగా. ఆయన ఎప్పుడూ భద్రుడు అని పిలిచేవారు. చెన్నై, దిల్లీలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఇద్దరం కలిసే వెళ్లే వాళ్లం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకసారి ఆయన అరెస్టు అయ్యారు. అప్పుడు గుంటూరు జిల్లాలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొని కోడెలకు నైతిక మద్దతు ఇచ్ఛా

- దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి

కుటుంబ సభ్యులతో అరకులోయ రాక

అరకులోయ, అనంతగిరి, న్యూస్‌టుడే: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ ఏడాది మేలో కుటుంబ సభ్యులతో అరకులోయ అందాలను తిలకించేందుకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి.. ఓట్ల లెక్కింపునకు నెల రోజుల సమయం ఉండగా.. ఆ మధ్య కాలంలో మూడు రోజులపాటు అరకులోయ, అనంతగిరిలో గడిపారు. రాజకీయాలపై ఏమీ మాట్లాడనని.. ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు కుటుంబంతో వచ్చానని ఆయన చెప్పారు. బంధుమిత్రులతో కలిసి బస్సులో వచ్చిన కోడెల మూడు రోజులపాటు అనంతగిరిలోని హరిత్‌ హిల్స్‌లో బస చేశారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.