close

తాజా వార్తలు

విద్యుత్తు తీగే యమపాశం

నగరపాలకసంస్థ మేనేజర్‌ మృతి

శోకసంద్రంలో కుటుంబసభ్యులు

కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు, సిబ్బంది

గిరిజ (పాతచిత్రం)

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నిజాయతీగా పనిచేసే అధికారిగా.. మంచితనానికి మారుపేరుగా.. అందరి మన్ననలు పొందిన నెల్లూరు నగరపాలకసంస్థ మేనేజర్‌ మాచవోలు గిరిజ(53) మృతి చెందారు. ఉస్మాన్‌ సాహెబ్‌పేట వాణిశ్రీ వీధిలోని ఆమె నివాసంలో బుధవారం విద్యుదాఘాతానికి గురయ్యారు. విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ ఛార్జింగ్‌లో నుంచి సెల్‌ఫోన్‌ను తీస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్తు తీగ ఆమె చేతిని తాకింది. ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆమె జీపు డ్రైవర్‌ బాషా ఇంటిలోకి వెళ్లి చూడగా చేతిలో విద్యుత్తు తీగలతో కింద పడిపోయి ఉన్నారు. హుటాహుటిన నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు భర్త మధుసూదన్‌, తండ్రి శ్రీనివాసులు ఉన్నారు. ఆమె మృతితో ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

●*నెల్లూరు మున్సిపాలిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరిన గిరిజ సీనియర్‌ అసిస్టెంట్‌గా, ఆర్‌వోగా సేవలు అందించారు. పదేళ్ల నుంచి నగరపాలకసంస్థ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బందిని ఆప్యాయంగా పలుకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకుని ఉద్యోగులు, సిబ్బంది ఆసుపత్రి వద్ద గుమికూడారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అమరావతి సచివాలయంలో ఇంజినీరింగ్‌ అధికారుల సమావేశానికి హాజరైన కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి గిరిజ మృతి సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నగరపాలకసంస్థ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించేవారని, ఆమె మృతి తీరని లోటన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.