close

తాజా వార్తలు

అమ్మవార్ల మహిమ పేరుతో మోసం

7 తులాల బంగారం, రూ. 4.10 లక్షల తస్కరణ ●

నిందితుల అరెస్టు


నిందితులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ఓ మహిళ బలహీనత ఆసరాగా అమ్మవార్ల మహిమ పేరుతో 7 తులాల బంగారు ఆభరణాలు, రూ. 4.10 లక్షల నగదు కాజేసిన నిందితులను న్యూ పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ శ్రీనివాసరావు వివరాలు ఇలా వెల్లడించారు.

 

‘పెదగంట్యాడ సిద్దేశ్వరం టీజీఆర్‌నగర్‌లో రామచంద్ర టెస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ యజమాని దవులూరి చంద్రరావు కుటుంబం ఉంటోంది. వారి ఇంటి రెండో ఫ్లోర్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి పద్మ, ఆమె కుమారుడు వానపల్లి సీతారాం, కుమార్తె సీపాన కుమారి అద్దెకు దిగారు. వీరు నమ్మకంగా చంద్రరావు భార్య నిర్మలతో కలివిడిగా తిరిగేవారు. ఇంట్లో దోషాలున్నాయని, మంచి సిద్ధాంతి ఉంటే చెప్పమని పద్మను నిర్మల కోరింది. దీన్ని అవకాశంగా తీసుకుని తన కుమార్తె కుమారి దేవీ ఉపాసకురాలని, ప్రతి శుక్ర, శనివారాల్లో సంతోషిమాత, రాజమ్మ అమ్మవార్లు ఆమెపై పూనడంతో భవిష్యత్తు చెబుతుందని పద్మ నమ్మించింది.

 

భర్తకు ప్రాణ గండమని...

ఒక రోజు నిర్మలను పూజకు పిలిచి.. ఆమె భర్తకు ప్రాణ గండం ఉందని, ఇద్దరు అమ్మవార్లకు ఏడు తులాల బంగారం నిలుపుదోపిడీ ఇవ్వాలని పద్మ చెప్పింది. ఇది నమ్మేసిన నిర్మల ఏడు తులాల నల్లపూసల దండ, చెవిదిద్దులు, తాడు, వెండిపట్టీలు, కాలి మట్టెల్ని ముడుపు కట్టి కుమారి ఒడిలో వేసేసింది. పూజా క్రతువు జరుగుతోందని, ఇలా కొన్ని వారాలు చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయనడంతో నిర్మల మరో శుక్రవారం నాడు ఖరీదైన వెండి వస్తువులు ఇచ్చేసింది. అంతా బాగానే జరుగుతోందని, ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని వారు నిర్మలను నమ్మించేశారు. మరో శనివారం అమ్మవార్లకు చెరో రూ.లక్ష ముడుపు చెల్లించాలని రెండు స్టీల్‌ డబ్బాలను హుండీలుగా చూపించారు. కుమారి పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఏవేవో చెబుతుంటే బాధితురాలు రూ. 2 లక్షలను హుండీల్లో వేసింది. ఇలా దఫదఫాలుగా ఆమె వద్ద నుంచి డబ్బుల్ని లాగేశారు.

 

భర్త నిలదీయడంతో..

ఈ నెల 16న నిర్మల ముభావంగా ఉండటం చూసిన చంద్రరావు నిలదీస్తే జరిగిన ‘నిలువు దోపిడీ’ని వివరించడంతో ఆయన ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో పారిపోవడానికి సిద్ధపడుతున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారు దోచుకున్న బంగారు వస్తువులను మార్పించి, వచ్చిన డబ్బుతో ఎల్‌ఈడీ టీవీలు, గృహాలంకరణ వస్తువులు కొన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.