close

తాజా వార్తలు

తీరాన్ని జల్లెడ పట్టిన పోలీసులు

● ఆపరేషన్‌ సాగర్‌ కవచ్‌లో భాగంగా తనిఖీలు

● ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఆర్డీఎక్స్‌(నకిలీ) పట్టివేత

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అనుమానిత వ్యక్తుల నుంచి పేలుడు పదార్థాలు(నకిలీవి) స్వాధీనం

చేసుకున్న రెండో పట్టణ సీఐ రాజేష్‌

 

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆపరేషన్‌ సాగర్‌ కవచ్‌లో భాగంగా బుధవారం జిల్లా సముద్ర తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. వాడరేవు నుంచి తెట్టు వరకు కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీసులతో పాటు సివిల్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు డీఎస్పీలు, అయిదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, ఏఎస్సై/హెడ్‌ కానిస్టేబుళ్లు 47 మంది, 210 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోంగార్డులు ఈ ఆపరేషన్‌ సాగర్‌ కవచ్‌లో పాల్గొన్నారు. తీరం వెంట అసాంఘిక శక్తులు, తీవ్రవాదులను పట్టుకోవడంలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రం నుంచి దీన్ని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పర్యవేక్షించారు. జిల్లా తీర ప్రాంతంలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలోని ఆయా స్టేషన్ల సిబ్బందితోపాటు కొత్తపట్నం, రామాయపట్నం మెరైన్‌ స్టేషన్లకు చెందిన పోలీసు దళాలతో పికెట్లు, ల్యాండింగ్‌ పాయింట్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాటి వద్ద నిత్యం తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను సోదాలు చేశారు. ఆ క్రమంలో ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను రెండో పట్టణ సీఐ ఎం.రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సంచుల్లో పేలుడు పదార్థాల(నకిలీ)ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆపరేషన్‌లో భాగంగా తీసుకువస్తున్నవిగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జన సమర్థ ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశారు. ఆపరేషన్‌కు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న ఏఆర్‌ డీఎస్పీ ఎ.రాఘవేంద్రరావు, కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం డీఎస్పీలు వేణుకల్యాణ్‌, మనీష్‌ బృందం కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల చెక్‌పోస్టు, కె.పల్లెపాలెం, వజ్జిరెడ్డిపాలెం, పల్లెపాలెం, స్వర్ణాంధ్ర పట్టపుపాలెంలలోని ల్యాండింగ్‌ పాయింట్లను తనిఖీ చేశారు. మానిటరింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌బాబు పాయింట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు చేశారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గురువారం కూడా ఈ ఆపరేషన్‌ కొనసాగనుంది.


కొత్తపట్నం తీర ప్రాంతంలో పర్యటిస్తున్న ఏఆర్‌ డీఎస్పీ రాఘవేంద్రరావు, కేంద్ర

ఇంటెలిజెన్స్‌ అధికారుల బృందం


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.