close

తాజా వార్తలు

అందరూ ఉండి..అనాథగా మారి!

ఓ తండ్రి మృత్యుపోరాటం

● బస్టాప్‌లో వదిలేసిన బిడ్డలు

పది రోజులుగా దీనావస్థలో వృద్ధుడు

అయినవారి కోసం దీనంగా చూస్తున్న రామనరసింహం

ఎండకు ఎండి.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఓ వృద్ధుడి మృత్యు పోరాటం.. పున్నామ నరకం నుంచి విముక్తి కల్పించాల్సిన వారు బతికుండానే చూపిస్తున్న ప్రత్యక్ష నరకమిది.. ముదిమి మీద పడి.. కాటికి కాళ్లు చాపిన తరుణంలో కన్నబిడ్డలకే భారమైపోయాడు.. కన్నీటిని దిగమింగుతూ.. జీవచ్ఛవంలా ఓ తండ్రి రోడ్డుపక్కన రోజులీడుస్తున్నాడు

తిరువూరు, న్యూస్‌టుడే: శేషజీవితం సంతోషంగా గడపాల్సిన తరుణంలో గత పది రోజులుగా బస్టాప్‌లో మంచంపై కదల్లేని స్థితిలో పడి ఉన్నారు ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు చెందిన వేముల రామనరసింహం (70). నాలుగు దశాబ్దాల క్రితం బతుకుదెరువు నిమిత్తం ఖమ్మం జిల్లా అయ్యవారిగూడేనికి వలస వెళ్లారు. కూతురికి వివాహం చేయగా ప్రస్తుతం తిరువూరు మండలం లక్ష్మీపురంలో ఉంటున్నారు. కొడుకు ఖమ్మం జిల్లా రామాపురంలో నివసిస్తున్నారు. భార్య కొంత కాలం క్రితం కాలం చేయడంతో అయినవారికి భారం కారాదని రామనరసింహం అయ్యవారిగూడెంలోనే ఒంటరి జీవనం గడిపారు. ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో కన్నవారు, బంధువుల ఇళ్లకు తిరుగుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఆరోగ్యం సహకరించక పూర్తిగా మంచం పట్టిన నేపథ్యంలో కూతురింటికి రాగా పది రోజుల క్రితం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బస్టాప్‌లో వదిలేశారు. మూత్ర విసర్జనకు ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో వేసిన ట్యూబ్‌ ద్వారా పాకెట్‌ నిండిపోవడం, లేవ లేని స్థితిలో కాలకృత్యాలు మంచంలోనే చేసుకోవడంతో దుర్వాసన వస్తోంది. చివరకు దాహమేసినా గుక్కెడు నీళ్లిచ్చేవారు లేక అవస్థలు పడుతున్నారు. నిత్యం కురుస్తున్న వర్షాలకు తోడు చలి తీవ్రత పెరగడంతో వాసన వస్తున్న దుప్పటినే కప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పక్కన బిందెలో నీళ్లు పెట్టినా.. అవి తాగేందుకు పనికి రాకుండా ఉన్నాయి. ఎవరో తెచ్చి పెట్టిన అల్పాహారం బాక్సులు పక్కనే ఉన్నా లేచి తినలేని పరిస్థితిలో క్షుద్బాధతో అలమటిస్తున్నారు. దోమలు కుట్టడంతో అనారోగ్యం మరింత పీడిస్తోంది. కూత వేటు దూరంలోనే కూతురు ఉంటున్నా, రహదారి పక్కన అపరిశుభ్ర వాతావరణంలో దుర్భర జీవితం గడుపుతున్నారు. సమాచారం అందుకున్న ‘న్యూస్‌టుడే’ వృద్ధుడ్ని పలకరించగా.. తన పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన తనకు జీవిత చరమాంకంలో ఎదురైన దుస్థితి పగవాడికి కూడా రాకూడదంటూ వేడుకున్నారు. కొడుకు ఎక్కడో ఉన్నాడని, కూతురు ఇదే ఊరిలో ఉంటున్నారని బదులిచ్చారు. వారిని తలచుకుంటూ కళ్లలో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుచుకుంటూ తనను అక్కున చేర్చుకోమంటూ బిడ్డలను ఆర్థిస్తున్నారు. వృద్ధుడి వివరాలు సేకరిస్తున్న సమయంలో అటుగా వెళుతున్న సెక్టార్‌-2 ఎస్సై అవినాశ్‌కు పరిస్థితి వివరించగా ఆయన తక్షణం స్పందించారు. కుమార్తె, అల్లుడి ఇంటికి వెళ్లి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తక్షణం బస్టాప్‌లో ఉన్న తండ్రిని ఇంటికి తీసుకురావాలని, లేని పక్షంలో సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సున్నితంగా మందలించారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన సోదరుడు పట్టించుకోవడం లేదని కూతురు బదులిచ్చారు. కుటుంబ సభ్యులు చర్చించుకుని తగు నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినా కూతురి నుంచి స్పందన కొరవడింది. అనంతరం తహసీల్దార్‌ ఎస్‌.నరసింహారావుకు ‘న్యూస్‌టుడే’ సమాచారం అందించగా ఆలనాపాలనా చూసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తే వృద్ధాశ్రమానికి తరలిస్తామని తెలిపారు.


రామనరసింహం కూతురు, అల్లుడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న సెక్టార్‌-2 ఎస్సై అవినాశ్‌


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.