
తాజా వార్తలు
● డెంగీతో యువకుడి మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యుల
కంభం, న్యూస్‌టుడే: ఆ యువకుని వయసు 27 సంవత్సరాలు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి ఏడాదిన్నర కిందట మరణించారు. కారుణ్య నియామకం కింద బుధవారం స్త్రీశిశు సంక్షేమ శాఖలో... కొలువుదీరాల్సిన ఆ యువకుడు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాద సంఘటన కంభం మండలంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు... జంగంగుంట్లకు చెందిన మారెడ్డి సాయి హరీష్‌రెడ్డి(27) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. స్థానికంగా వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్ధరించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు మృతి చెందారు. గురువారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
నియామక పత్రం అందుకోవాల్సి ఉండగా...
ఉపాధ్యాయుడైన తండ్రి మృతితో మారెడ్డి సాయి హరీష్‌రెడ్డి కారుణ్య నియామకం కింద స్త్రీశిశు సంక్షేమ శాఖ జూనియర్ సహాయకుడిగా ఎంపికయ్యారు. బుధవారం నియామక పత్రాలు అందుకోవాల్సి ఉంది. డెంగీతో అదే రోజు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగిగా నియామక పత్రం అందుకోవాల్సిన రోజే... అతని మరణ ధ్రువీకరణ పత్రం అందుకుంటానని కలలోనూ ఊహించలేదని తల్లి ఉషారాణి కన్నీరుమున్నీరయ్యారు.