close

తాజా వార్తలు

ఆందోళనతో దద్దరిల్లిన మదనపల్లె

● చిన్నారిని హత్య చేసిన నిందితున్ని బహిరంగంగా ఉరితీయాలి

● తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నిరసనలు

● స్తంభించిన వాహనాల రాకపోకలు

నిందితున్ని ఉరి తీయాలని ఉపపాలనాధికారి కీర్తికి విన్నవిస్తున్న చిన్నారి బంధువులు, విద్యార్థులు..

మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే : చిన్నారి వర్షిత (6)ను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు మహమ్మద్‌రఫి అలియాస్‌ రఫి, అలియాస్‌ గిడ్డును బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ బాలిక కుటుంబసభ్యులు, పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సుమారు నాలుగు గంటలపాటు మదనపల్లె పట్టణంలో ఆందోళన నిర్వహించారు. దీంతో మదనపల్లె - కదిరి మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. నీరుగట్టువారిపల్లె నుంచి మృతురాలి గ్రామస్థులైన బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులు పెద్దఎత్తున ర్యాలీగా వచ్చారు. వీరికి మద్దతుగా మదనపల్లె జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎఫ్‌, వీహెచ్‌పీఎస్‌, భజరంగ్‌దళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు మదనపల్లె ఉపపాలనాధికారి కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి బైఠాయించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి బిసెంట్‌ కూడలి వద్ద బైఠాయించారు. మృతిచెందిన చిన్నారికి మామలైన శశివర్ధన్‌రెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, చిన్నాన్న వెంకటశివారెడ్డి కూడలి సమీపంలో ఉన్న విద్యుత్‌స్తంభం ఎక్కి నిరసన తెలిపారు. ఆందోళనకారులు సబ్‌జైలు వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ర్యాలీగా ఉపపాలనాధికారి కార్యాలయానికి వెళ్లారు నిందితున్ని నడి రోడ్డుపై ఉరి తీయాలంటూ రఫి దిష్టిబొమ్మకు ఉరివేసి నిరసన తెలిపారు. ఉపపాలనాధికారి బయటకు వచ్చి నిందితున్ని ఉరి తీస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐలు తమీమ్‌అహ్మద్‌, రాజేంద్రనాథ్‌యాదవ్‌లు ఉపపాలనాధికారి చేకూరి కీర్తికి సమస్య వివరించడంతో కుటుంబసభ్యులను, కొంతమంది విద్యార్థి సంఘం నాయకులను పిలిచి మాట్లాడారు. నిందితున్ని జైలుకు పంపామని, న్యాయమూర్తులు విచారణ చేస్తారని, వారు కఠిన శిక్ష విధిస్తారని అన్నారు. నిందితునికి ఉరి తీయాలన్న అంశం తమ పరిధిలో లేదని ఆందోళన విరమించాలని కోరారు. ఉపపాలనాధికారి కార్యాలయం నుంచి బయటికి రాకుండా తమకు హామీ ఇవ్వలేదని ఆందోళన చేస్తున్న వారు కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి ఉపపాలపాధికారితో మాట్లాడి వచ్చిన వారు, సీఐలు నిందితుడికి శిక్ష పడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో చిన్నారి తల్లిదండ్రులు సిద్ధారెడ్డి, ఉషారాణి, విద్యార్థి సంఘాల నాయకులు రాజారెడ్డి, కేశవ, నరసింహారెడ్డి, ఉత్తన్న, లక్ష్మీపతితో గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మకు ఉరి వేసి ఆందోళన చేస్తున్న గ్రామస్థులు


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.