close

తాజా వార్తలు

మెగా సిటీ పోలీసింగ్‌!

ప్రాజెక్టు ప్రతిపాదనలకు అధికారుల కసరత్తు

కేంద్ర హోంశాఖ నిధుల కోసం ప్రయత్నం

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాల్లోని పోలీసు వ్యవస్థల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్రం ‘మెగాసిటీ పోలీసింగ్‌ ప్రాజెక్టు’ పేరిట ఒక పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా విశాఖ నగరాన్ని కూడా ఆ ప్రాజెక్టు పరిధిలో చేర్చడానికి ఉన్న అవకాశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

ఈనాడు, విశాఖపట్నం: తంలో ఈ ప్రాజెక్టును ముంబయి, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో అమలు చేశారు. ఆ ప్రాజెక్టు కింద కేంద్రం ఆయా నగరాలకు రూ.10కోట్ల నుంచి అత్యధికంగా రూ.90కోట్ల వరకు నిధులను కేటాయించింది. ఫలితంగా ఆయా నగరాల్లోని పోలీసు వ్యవస్థలను అధునాతన సౌకర్యాలు, ఉపకరణాలతో తీర్చిదిద్దారు. సంవత్సరానికి రూ.90కోట్ల వరకు నిధులు కేటాయిస్తే భారీఎత్తున ఆధునికీకరణ పనులు చేసుకునే వెసులుబాటు నగర పోలీసు ఉన్నతాధికారులకు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన విశాఖ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా కూడా రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా విశాఖ గుర్తింపు పొందింది. నగర జనాభా కూడా 22 లక్షలకు చేరడంతో నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నగరానికి అతిపెద్ద సవాలుగా మారింది. అత్యాధునిక పరిజ్ఞానాలను ఉపయోగించి నిఘా, నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చుగానీ అవసరమైన నిధుల్లేక నగర పోలీసు కమిషనరేట్‌ కునారిల్లుతోంది. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో మాట్లాడారు. విశాఖ నగరాన్ని మెగాసిటీ పోలీసింగ్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేయాలని సూచించారు.

సీపీ చేసిన ప్రధాన ప్రతిపాదనలివే....

మెగా సిటీ పోలీసింగ్‌ ప్రాజెక్టుకు విశాఖ నగరాన్ని ఎంపిక చేసి రూ.90కోట్ల వరకు నగర పోలీసు వ్యవస్థకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలి. ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ ప్రాజెక్టు ఫలితంగా ఏపీలోని ప్రధానమైన విశాఖ నగరంలో అత్యాధునిక వ్యవస్థలతో కూడిన మోడల్‌ వ్యవస్థలు ఏర్పడతాయి. వాటిని చూసి క్రమంగా మిగిలిన జిల్లాల్లోని పోలీసు వ్యవస్థల్ని కూడా ఆధునికీకరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

●*ఇండియన్‌ రిజర్వ్‌ పోలీసు బెటాలియన్‌ను కూడా కూడా విశాఖలో ఏర్పాటు చేయాలి. ఈ బెటాలియన్‌ ఏర్పాటుకు కేంద్రం మొదటి సంవత్సరం రూ.51 కోట్ల నిధులు ఇస్తుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వమే ఆ బెటాలియన్‌ను నిర్వహించాలి. ఫలితంగా ఈ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం మూడేళ్లపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం లభిస్తే బెటాలియన్లు పెరిగి రాష్ట్రాల్లో పోలీసు భద్రత కూడా పెరుగుతుంది.

●*తీర భద్రత విభాగానికి చెందిన బోట్లు మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేదు. ఫలితంగా తీరగస్తీ ఒకింత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలి.

●*విశాఖ రైల్వేస్టేషన్లో నిఘా కెమెరాలు తగిన సంఖ్యలో లేవు. వాటి సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నేరస్తుల రాకపోకలు ఎక్కువగా రైల్వేస్టేషన్ల కేంద్రంగానే జరుగుతున్న నేపథ్యంలో అధునాతన ఘా కెమెరాలను విశాఖ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలి.

అవసరాల మేరకు ఆధునికత బాట పట్టాలి

పెరుగుతున్న అవసరాలకు దీటుగా నగరంలోని పోలీసు వ్యవస్థల్ని ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన సందర్భంగా కేంద్రం గతంలో ఆరు నగరాల్లో అమలుచేసిన మెగాసిటీ ప్రాజెక్టు పథకాన్ని వివరించి విశాఖలో ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు పంపమన్నారు. మళ్లీ ఆ పథకాన్ని అమలుచేసి విశాఖ నగరాన్ని ఎంపిక చేస్తే నగర పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లే. - ఆర్‌.కె.మీనా, సీపీ, విశాఖపట్నం


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.