close

తాజా వార్తలు

తిరిగి.. తిరిగి.. తిరిగి.. 46

ఐదు కిలోమీటర్లు అవుతోంది... అంత దూరం

 దశాబ్దాల నాటి పూర్ణపాడు లాబేసు వంతెనతోనే పరిష్కారం

విద్యార్థులు, గ్రామస్థులకు పడవపై తప్పని ప్రమాదకర ప్రయాణం

 

ఇదే ప్రాంతంలో 1996 ఆగస్టు 30న నదిలో పడవ ప్రమాదం జరిగి 33 మంది మృతిచెందారు. తర్వాత జరిగిన ఘటనల్లో చాలామందే మృత్యువాతపడ్డారు.

కొమరాడ మండలంలో మొత్తం పంచాయతీలు 22 

నది అవతలి వైపు ఉన్న గ్రామాలు 33

కురుపాం, చినమేరంగి, పార్వతీపురం మీదుగా రావాలంటే : 46 కిలోమీటర్లు

పూర్ణపాడు లాబేసు మీదుగా కొమరాడకు రావాలంటే దూరం కేవలం : 5 కిలోమీటర్లు

ముక్కు ఎక్కడ ఉందా అంటే... వెనుక చేయి తిప్పుతూ చూపించినట్లు ఉంది వీరి పరిస్థితి.. సాధారణంగా ప్రజలకు ఏ పనికావాలన్నా మండల కేంద్రంతోనే ముడిపడి ఉంటుంది.. చివరికి పిల్లలు ఉన్నత చదువులకైనా అక్కడికి వెళ్లాల్సిందే... ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరాడకు చేరుకోవాలంటే 33 గ్రామాల ప్రజలు 46 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.. నాగావళి నది అవతలి ఉన్న ప్రజలు వరదలు వచ్చినప్పుడు మండల కేంద్రంతో సంబంధాలే తెంచుకోవాల్సిన దుస్థితి.. ఇక విద్యార్థులైతే చదువులే మానేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్మిస్తున్న పూర్ణపాడు లాబేసు వంతెన పనులు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది..

 

2006లోనే నిర్మాణానికి శ్రీకారం..

●2006లో పూర్ణపాడు - లాబేసు నది మధ్యలో వంతెన నిర్మాణానికి అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు.

●అప్పట్లో రూ.6.6 కోట్లు నాబార్డు నిధులను కేటాయించారు. తర్వాత 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. నాబార్డు, ఏజెన్సీ అభివృద్ధి ప్రణాళిక నిధుల నుంచి రూ.9.92 కోట్లు కేటాయించారు.

●2017 జులైతో పనులు పూర్తిచేయాల్సి ఉండగా వరదలు, గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ముందుకు సాగలేదు.

●అప్పట్లో మంత్రులు గుత్తేదారులపై ఒత్తిడి తీసుకురావడంతో 2018 వరకు గడువు కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టారు. లాబేసు, పూర్ణపాడు వద్ద ఒడ్డ పై కాంక్రీట్‌ పనులు చేపడుతున్నారు.

కొమరాడ మండల పరిధిలో 31 పంచాయతీల్లో 22 పంచాయతీలు మండల కేంద్రానికి ఒక వైపు ఉన్నాయి. తొమ్మిది.. నాగావళి నదికి అవతలి వైపు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఆ మూడు నెలలు శ్రీలంక దీపంలో ఉన్నట్లు ఇక్కడి ప్రజలు భావిస్తారు. కళాశాలకు, పాఠశాలకు విద్యార్థులు వెళ్లలేని దుస్థితి. చదువు సక్రమంగా సాగక మధ్యలో చదువులు వదిలేసిన విద్యార్థులు ఉన్నారు. నదిలో నీరు తగ్గితేనే నడక బాటలో ప్రయాణిస్తుంటారు. లేదంటే కొట్టు-కొమరాడ, పూర్ణపాడు-లాబేసు మధ్యలో మరబోట్లలో ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. మండల కేంద్రానికి చేరాలంటే పడవలో అయితే ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే వరదలు వస్తే కురుపాం, పార్వతీపురం మీదుగా 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొమరాడ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నదిలో నాలుగు బోర్లు..

నదిలో నాలుగు బోర్లు తవ్వకాలు చేయాల్సి ఉంది. బోర్లు తవ్వే సమయంలో ఒక వ్యక్తి నది అడుగు భాగంలోకి ఆక్సిజన్‌ సాయంతో దిగి కాంక్రీట్‌ వేయాల్సి ఉంటుంది. అయితే ఇది వ్యయంతోను, కార్మికులకు రిస్క్‌తో కూడిన పనికావడంతో గుత్తేదారులు పనులు చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2016లో వచ్చిన వరదలకు తవ్విన బోరు సిమెంట్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. దీంతో అదనపు భారం పడింది. బోర్లు తవ్వకాలు పూర్తయి శ్లాబు వేస్తే దాదాపు 80 శాతం పనులు పూర్తయినట్లే .అయితే 2018 నుంచి గుత్తేదారులు సరిగ్గా పనులు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.

నావలో భయం, భయంగా

కొట్టు-కొమరాడ, పూర్ణపాడు-లాబేసు మధ్యలో 2008లో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ సంస్థ నుంచి రూ.12 లక్షల వ్యయంతో రెండు మరబోట్లను ఏర్పాటు చేశారు. పడవ నడిపేవారికి శిక్షణ కూడా అందించారు. ఈ బోట్లు నిలకడగా ఉండే నీటిలో ప్రయాణించగలవు. దీంతో నాగావళిలో ప్రవహించే నీటిలో నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బోటుకు ఏర్పాటు చేసిన మోటారు నిర్వహణ కూడా ఐటీడీఏ సాయం అందించకపోవడంతో అవి కాలం చెల్లుతున్నాయి. గ్రామస్థులు తలో రూపాయి వేసుకుని మోటారును మరమ్మతులు చేసుకునే పరిస్థితి నెలకొంది. అప్పటి పీవో లక్ష్మీశ బోట్లు నిర్వహణకు కొంత నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన బదిలీపై వెళ్లడంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. వరదల సమయంలో పడవలు నిలిపివేస్తారు. నీరు తగ్గిన తర్వాత బోటును నడుపుతారు. నీరు పూర్తిస్థాయిలో తగ్గితే నడక ప్రయాణం తప్పదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయం బాధిత గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. నావలోనైనా, నదిలో నడిచి వెళ్లినా భయం భయంగా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.

ఉప ముఖ్యమంత్రి చొరవ...

ఇటీవల పూర్ణపాడు-లాబేసు వంతెన పనులను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సందర్శించారు. నిర్మాణ పనులు పూర్తి చేయడానికి అడ్డంకులపై పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ సిబ్బందితో చర్చించారు. గుత్తేదారులు పనుల చేయడంలో జాప్యం, నిధుల మంజూరులో ఆలస్యం వంటి విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి నిధుల కేటాయింపు విషయంలో వెనుకడుగు వేయవద్దని సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తే ఏజెన్సీ అభివృద్ధి ప్రణాళికల నిధుల నుంచి విడుదల చేసేలా చర్చిస్తామన్నారు. ఈ ప్రాంత వాసులకు వంతెన కలను సాకారం చేయాలని చెప్పారు.

రూ.4 కోట్లతో ప్రతిపాదనలు

పూర్ణపాడు వంతెనకు గతంలో రూ.9.92 కోట్ల నిధులు కేటాయించారు. మరో రూ.4 కోట్ల అవసరం అవుతుందని ప్రతిపాదనలను ప్రభుత్వానికి, ఉప ముఖ్య మంత్రికి పంపించాం. నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నదిలో నాలుగు బోర్లకు రెండు తవ్వకాలు పూర్తి అయ్యాయి. మిగిలినవి పూర్తికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు చేసిన పనులకు గుత్తేదారులకు రూ.6 కోట్ల వరకు బిల్లులు చెల్లించాం. పాత గుత్తేదారుడే పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తాం. - రమణమోహన్‌, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (పంచాయతీరాజ్‌ శాఖ)

 


నదిలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు (పాత చిత్రం)

 

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.