close

తాజా వార్తలు

ప్రాణం తీసిన నిర్లక్ష్యం!

బాలింత మృతి

తీవ్ర రక్తస్రావమే కారణం

ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఘటన

మృతి చెందిన ఆఫ్రీన్‌ (పాతచిత్రం)

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ప్రైవేట్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతో వెళ్లిన ఓ నిరుపేద కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారులను తల్లిలేని అనాథలుగా మిగిల్చారు. ఈ ఘటన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. అనంత నగరం బళ్లారి బైపాస్‌ సమీపంలోని షిర్డీనగర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ ఆఫ్రీన్‌(22)కు పురిటినొప్పులు రావడంతో ఆమె బంధువులు ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదట్నుంచీ ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె సోమవారం ఉదయం 6.15 గంటలకు సుఖ ప్రసవం పొందింది. ఆడ బిడ్డకు జన్మించింది. ఉదయం 10 గంటలకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. దీంతో అదేరోజు రాత్రి 7 గంటల దాకా శస్త్రచికిత్స గదిలోనే ఉంచారు. రక్తస్రావం తగ్గలేదు. అనంతరం ‘బాలింతకు ప్రాణాపాయం ఉంది. మా వెంట రండంటూ’.. బంధువులతో కలిసి ఆస్పత్రి నిర్వాహకులే అంబులెన్స్‌లో మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రాణాలు వదిలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం మొదట చేర్పించిన ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆఫ్రీన్‌ మృతి చెందిందని మండిపడ్డారు. ఆసుపత్రి వద్దే బైఠాయించారు. దీంతో రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఆఫ్రీన్‌, ఇస్మాయిల్‌ జబీవుల్లా దంపతులకు ఏడాదిన్నర కుమారుడు, తాజాగా పుట్టిన ఆడశిశువు ఉన్నారు. జబీవుల్లా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలారు.

బాధితుల నిరసన

నర్సు కాన్పు చేసింది

నా భార్య గర్భం దాల్చినప్పటి నుంచి ఈ ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాం. కాన్పు నర్సు చేసింది. బిడ్డను బయటకు తీసే సమయంలో గట్టిగా లాగడంతోనే రక్తస్రావమైంది. ఉదయం 6 నుంచి 10 గంటల దాకా డాక్టర్‌ రాలేదు. రక్తం ఎక్కువ పోయింది. మళ్లీ ఆపరేషన్‌ చేసి గర్భసంచి తొలగించారు. రూ.500 కట్టలేదని చికిత్స అందించలేదు. అలాంటప్పుడు మరొక ఆస్పత్రిలో చేర్పించి రూ.50 వేలు ఎలా చెల్లిస్తారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి చెందింది.

- ఇస్మాయిల్‌ జబీవుల్లా, అఫ్రీన్‌ భర్త

రక్తస్రావంతో మృతి

ప్రసవానికి వచ్చిన ఆఫ్రీన్‌కు మెరుగైన చికిత్స అందించాం. దురదృష్టవశాత్తు రక్తస్రావం ఎక్కువైంది. దీన్నే పోస్టుహేమరైజ్‌ అంటాం. అందుకే మరోసారి గర్భసంచి శస్త్ర చికిత్స చేశాం. అయినా రక్తస్రావం ఆగలేదు. ఈలోపు గుండె పనితీరు సామర్థ్యం తగ్గింది. దీంతో మరో ఆస్పత్రికి తరలించాం. అక్కడ చికిత్స చేయించాం. అయినా ప్రాణాలు వదిలింది. నర్సు ప్రసవం చేసిందన్న ఆరోపణలో నిజం లేదు. డాక్టరే దగ్గరుండి చికిత్స చేశారు.

- ఆస్పత్రి నిర్వాహకుడు


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.