close

తాజా వార్తలు

కక్షిదారుల క్షేమమే లోక్‌ అదాలత్‌ ధ్యేయం

● జిల్లా వ్యాప్తంగా 1268 కేసుల పరిష్కారం

 

జాతీయ లోక్‌ అదాలత్‌లో ప్రసంగిస్తున్న జిల్లా జడ్జి పి.వి.జ్యోతిర్మయి

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దేశ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించిందని ఆ సంస్థ జిల్లా ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ జ్యోతిర్మయి తెలిపారు. శనివారం ఆమె ఒంగోలులో నిర్వహించిన అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలోని చట్టబద్ధమైన సంస్థలను కాపాడుకోవాలన్నారు. ప్రజలు శాంతియుతంగా మెలిగి మంచిని పెంచడానికి కృషి చేయాలని, క్షమాగుణాన్ని అలవరుచుకోవాలని ఉద్బోధించారు. పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనని, అప్పుడు వారికి సత్వర న్యాయం అందుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఒకటో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.రమేష్‌ మాట్లాడుతూ... రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే సత్వర న్యాయం పొందడంతో పాటు కక్షిదారులు కోర్టుకు చెల్లించిన ఫీజు వాపసు వస్తుందన్నారు. జేసీ షన్మోహన్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌తో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. మార్కాపురంలో నిర్వహించిన మాడ్యూల్‌ లోక్‌ అదాలత్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. అదనపు జిల్లా జడ్జిలు సీహెచ్‌ రాజగోపాలరావు, ఎస్‌.ఎం.డి. ఫజులుల్లా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శోభాకుమారి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.భాస్కరరావు ప్రసంగించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ ఛైర్మన్‌ ఎస్‌.వి. నరసింహరాజు, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.జయలక్ష్మి, జూనియర్‌ జడ్జిలు వి.పల్లవి, బి.వాణిశ్రీ, ఎన్‌.శారద, బి.కనకలక్ష్మి, జిల్లా ప్రభుత్వ న్యాయవాది ఎం.అజయ్‌బాబు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.శివరామకృష్ణ ప్రసాద్‌, ప్రాసిక్యూషన్స్‌ ఉప సంచాలకులు సి.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ ఎన్‌.వి.ప్రసాద్‌, ద్వితీయశ్రేణి న్యాయమూర్తి కోటు వెంకటరావు, న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అన్ని న్యాయస్థానాల్లో....

జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో కేసుల పరిష్కారం కోసం బెంచ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 1268 కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో క్రిమినల్‌ కేసులు 893, సివిల్‌ 220, పీఎల్‌సీ కేసులు 155 ఉన్నాయి. బీమా కంపెనీల మోటారు ప్రమాద పరిహారం కేసులతో సహా వివిధ వివాదాల్లో రూ. 5.50 కోట్ల మేర కక్షిదారులకు లబ్ధి చేకూరింది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో పరిష్కరించుకున్న కేసుల కక్షిదారులకు.. ఆ సంస్థ అప్పటికప్పుడే జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి ద్వారా చెక్కుల రూపంలో పరిహారం అందించారు.

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.