close

తాజా వార్తలు

అజ్ఞాతంలో రెడ్డెప్ప.. అనుచరులపై దెబ్బ

రెడ్డెప్ప అనుచరుడు కిరణ్‌ను విచారించిన పోలీసులు

స్టేషన్‌ నుంచి ఇంటికెళ్లిన వెంటనే ఆత్మహత్యాయత్నం

స్టేషన్‌లో వేధించారని కిరణ్‌ భార్య ఆరోపణ

ఎంపీటీసీ మాజీ సభ్యుడిపైనా పోలీసుల దృష్టి


విషద్రావణం తాగి రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్‌

రాయచోటి, చిన్నమండెం -న్యూస్‌టుడే : చిన్నమండెంలో మండలంలో భూకేటాయింపునకు మంత్రి వనిత సంతకం ఫోర్జరీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు కీలకంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రాష్ట్ర మంత్రి వనిత స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేయడం.. మరోవైపు నిందితుడైన రెడ్డెప్ప ఆ సంతకం అసలుదేనని చెప్పడంతో ఆ వ్యవహారంలో నిజాలు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రెవెన్యూ అధికారులు, మంత్రి ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుడైన రెడ్డెప్ప ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజులుగా ఆయన జాడలేక ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు అన్వేషణ ముమ్మరం చేశారు. ఈ కోవలోనే రెడ్డెప్పకు అనుచరుడుగా ఉంటున్న దేవళంపేటకు చెందిన కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌లో ఉంచుకుని తమదైన శైలిలో విచారణ సాగించారు. చివరకు ఇంటికి వెళ్లగానే కిరణ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అది మరో చర్చనీయాంశం అయింది.

ఫోర్జరీ తేల్చేందుకు మల్లగుల్లాలు : చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలోని దేవళంపేటకు చెందిన రెడ్డెప్ప ఆ గ్రామంలో తెదేపాకు బలమైన నాయకుడుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లోనూ ఇతని కుటుంబీకులు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేశారు. గ్రామానికి సమీపంలోనే ఉన్న సర్వే నెంబరు 1648/3లో 1.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు ఆ స్థలం తనకే కేటాయించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తానేటి వనిత సిఫార్సుతో లేఖను తెచ్చి రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఇదే స్థలాన్ని వైకాపాకు చెందిన కొందరు గ్రామ సచివాలయానికి కేటాయించాలని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో లేఖ విషయం వెల్లడైంది. మంత్రి తాను సిఫార్సు చేయలేదని, సంతకం ఫోర్జరీ చేశారని హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ వ్యవహారంపై ఆగమేఘాలపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రెడ్డెప్ప కోసం గాలింపు చేపట్టినా ఆయన పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బంధువులు, అనుచరులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం : రెడ్డెప్పకు సన్నిహితుడుగా ఉంటున్న దేవళంపేటకు చెందిన కిరణ్‌(25)ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి కూడా స్టేషన్‌లోనే ఉంచుకుని రెడ్డెప్ప ఆచూకీపై ఆరా తీశారు. కిరణ్‌కు సంబంధం లేదని అతనిని వదిలేయాలని చెప్పేందుకు స్టేషన్‌కు వెళ్లి వేడుకొన్న బంధువుల వినతిని తోసిపుచ్చారు. శనివారం మధ్యాహ్నం కిరణ్‌ను స్టేషన్‌ నుంచి పోలీసులే తీసుకెళ్లి స్వగ్రామంలో వదిలేశారు. అక్కడ అతను మనస్తాపానికి గురై ఇంటిలోని విషద్రావణం తాగేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. వదిలేసి తిరుగు ప్రయాణంలో ఉన్న పోలీసులు కిరణ్‌ ఇంటికి చేరుకుని వెంటనే రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కిరణ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో 24 గంటలు గడిచే వరకు పూర్తి స్థాయిలో చెప్పలేమని వైద్యులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న కిరణ్‌ భార్య కృష్ణవేణి, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు వేధించడంతోనే మనస్తాపానికి గురై తన భర్త ఈ చర్యకు పాల్పడ్డారని కృష్ణవేణి విలేకర్లతో పేర్కొన్నారు. కిరణ్‌ను విచారణ కోసం స్టేషన్‌కు తీసుకొచ్చామని, వేధించలేదని చిన్నమండెం ఎస్సై హేమాద్రి పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సభ్యుడు : ఫోర్జరీ సంతకం వ్యవహారంలో రెడ్డెప్పతో సంబంధాలున్న గాలివీడు మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడ్డెప్పతో ఉన్న సంబంధాలు, అతని వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రెడ్డెప్ప, కిరణ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుల చరవాణిలలో సాగిన సంభాషణలపైన ఆరా తీశారు. రెడ్డెప్ప, కిరణ్‌లు ఓ డ్రిప్‌ కంపెనీలో ఏజెంట్లుగా పని చేసే వారని తేలింది. డ్రిప్‌ పరికరాల కొనుగోళ్లు, రైతుల నుంచి వసూలు చేసిన నగదు వ్యవహారాలపైనా ఆరా తీస్తున్నారు. రెడ్డెప్ప పరారు కావడం వెనుక ఉన్న కారణాలను విచారిస్తున్నారు. రెడ్డెప్ప మాత్రం తన వద్ద మంత్రి ఇచ్చిన లేఖ ఉందని ఫోర్జరీకి పాల్పడలేదని అనుచవర్గాల చెంత వెల్లడించినట్లు తెలుస్తోంది.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.