close

ప్రధానాంశాలు

ఈసారైనా పంజా విసిరేనా! 

ఐపీఎల్‌లో దురదృష్టకర జట్లలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఒకటి.. జట్టులో స్టార్లు ఉన్నా.. ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఉన్నా.. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్‌ కొట్టలేకపోయింది పంజాబ్‌. 2014లో పైనల్‌ చేరడం, తొలి ఐపీఎల్‌ సీజన్లో సెమీఫైనల్‌ వరకు వెళ్లడం మాత్రమే ఇప్పటిదాకా పంజాబ్‌ ఘనతలు. ఇవి మినహాయించి అన్ని సీజన్లలో కనీసం లీగ్‌ దశ దాటలేకపోయింది కింగ్స్‌. 
పీఎల్‌ 2019లోనైనా తన కలను నెరవేర్చుకునేందుకు పంజాబ్‌ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. వేలంలో 13 మందిని కొనుక్కున్న ఈ జట్టు.. ఈసారి టైటిల్‌ కొట్టాలనే దృఢ సంకల్పంతో బరిలో దిగుతోంది. ఈ జట్టులో ప్రధానంగా క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌పైనే అందరి దృష్టి ఉంది. గత సీజన్‌ వేలంలో గేల్‌ను ఆఖరి నిమిషంలో దక్కించుకుంది పంజాబ్‌.. ప్రస్తుతం అతను భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి రానుంది. అంతేకాక గత సీజన్లో అద్భుతంగా ఆడిన రాహుల్‌ నుంచి మళ్లీ అదే స్థాయి ప్రదర్శనను ఆశిస్తోంది కింగ్స్‌.

అందరి కళ్లూ అతనిపైనే

క్రిస్‌ గేల్‌.. టీ20లకు చిరునామా ఈ కరీబియన్‌ యోధుడు. ఐపీఎల్‌లో గతంలో ఒక వెలుగు వెలిగిన గేల్‌.. ఆ తర్వాత వయసు మీద పడి ఫామ్‌ కోల్పోయి ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అన్న స్థితికి వచ్చేశాడు. ఆడినా ఆడకపోయినా గత రికార్డులను దృష్టిలో ఉంచుకుని అతణ్ని చాలారోజులు జట్టులో ఉంచుకుంది బెంగళూరు జట్టు. ఈ నేపథ్యంలో గతేడాది వేలంలో గేల్‌ను వద్దనుకుంది ఆర్‌సీబీ. అయితే అతణ్ని కొనడానికి మిగిలిన జట్లేమీ ఎగబడలేదు. పేరు లేని ఆటగాళ్లను కూడా కొనుక్కున్న ఫ్రాంఛైజీలు క్రిస్‌ను మాత్రం విస్మరించాయి. అతను ఐపీఎల్‌ ఆడడం ఇక కష్టం అనుకుంటున్న సమయంలో చివరి నిమిషంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గేల్‌ను జట్టులోకి తీసుకుంది. గతేడాది ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు క్రిస్‌. ఇటీవల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన గేల్‌.. ఈసారి పంజాబ్‌లో ఎన్నో ఆశలు రేపుతున్నాడు. గతంలో ఒంటిచేత్తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టిన ఈ విండీస్‌ స్టార్‌.. ఈసారి తమ తరఫున రాణించాలని పంజాబ్‌ కోరుకుంటోంది.

బ్యాటింగే బలం

పంజాబ్‌ ప్రధాన బలం బ్యాటింగే. గేల్‌, రాహుల్‌, మిల్లర్‌ లాంటి స్టార్లతో జట్టు కళకళలాడుతోంది. గత సీజన్‌లో ఆడినట్లే వీళ్లు ఆడితే అభిమానులకు పండగే. మన్‌దీప్‌సింగ్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, మిల్లర్‌లతో మిడిలార్డర్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ పంజాబ్‌ను తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు అఫ్గాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ ముజీబ్‌ రెహ్మాన్‌, యువ సంచలనం వరుణ్‌ చక్రవర్తి ఎలా రాణిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
స్థిరత్వం లేక..: అన్ని వనరులు ఉన్నా స్థిరత్వం లేకపోవడమే పంజాబ్‌ను దెబ్బ తీస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గేల్‌, రాహుల్‌ తప్ప మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ స్థిరంగా రాణించడంలో విఫలం అవుతుంది. పేస్‌ విభాగంలో షమి మాత్రమే అనుభవజ్ఞుడు. ఆండ్రూ టై లాంటి విదేశీ బౌలర్లు అతనికి ఎంతవరకు తోడస్తారనేది కీలకం. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ చేరడం పేస్‌ విభాగం మెరుగైంది.

కెప్టెన్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌  
కోచ్‌: బ్రాడ్‌ హాడ్జ్‌ 
విదేశీ ఆటగాళ్లు: ఆండ్రూ టై, క్రిస్‌ గేల్‌, సామ్‌ కరన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, విల్జోయిన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మోజెస్‌ హెన్రిక్స్‌ 
స్వదేశీ ఆటగాళ్లు: మహ్మద్‌ షమి, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మన్‌దీప్‌సింగ్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, మురుగన్‌ అశ్విన్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌, ప్రభ్‌ సిమ్రాన్‌సింగ్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, అగ్నివేశ్‌, హర్‌ప్రీత్‌, దర్శన్‌ 
కీలక ఆటగాళ్లు: గేల్‌, మిల్లర్‌, రాహుల్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, అశ్విన్‌, షమిTags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net