close

ప్రధానాంశాలు

కప్పు వేటకు మహాసేన 

ఈనాడు క్రీడావిభాగం

11 ప్రయత్నాలు.. మూడుసార్లు ఛాంపియన్‌.. ఒకసారి రన్నరప్‌.. ఐపీఎల్‌లో ఎక్కువ విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్‌ ఒకటి! స్టార్‌ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన కుర్రాళ్లు, తిరుగులేని కోచింగ్‌ బృందం.. ముంబయికి ఏ విషయంలోనూ లోటు లేదు. అయితే ఐపీఎల్‌ మొదలైన ఆరేళ్లకు కాని ఆ జట్టు తొలి టైటిల్‌ కొట్టలేకపోయింది. 2013లో తొలి టైటిల్‌ సాధించిన ముంబయి.. ఆ తర్వాత మరో రెండుసార్లు (2015, 2017) ట్రోఫీతో మెరిసింది. కానీ గతేడాది మళ్లీ కథ మొదటికొచ్చింది. స్టార్లు ఎందరున్నా.. సమష్టిగా పోరాడటంలో విఫలమైన ముంబయి ప్లేఆఫ్‌ దశకు చేరకుండానే వెనుదిరిగింది. రోహిత్‌శర్మ సారథ్యంలో మరోసారి బరిలో దిగుతున్న ముంబయి.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

నాయకుడే బలం

నాయకుడు రోహిత్‌శర్మే ముంబయికి పెద్ద బలం. అటు బ్యాటింగ్‌లో ఇటు కెప్టెన్సీలో రోహిత్‌ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ముఖ్యంగా కుర్రాళ్లను అతను ఉపయోగించుకునే విధానం, కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి. ఈసారీ ముంబయి రోహిత్‌పై పెద్ద ఆశలే పెట్టుకుంది. ప్రపంచకప్‌ ముందు రాణించడం అతనికీ కీలకం. దేశీ ఆటగాళ్లు అంచనాలకు మించి ఆడుతుండడం ముంబయికి బాగా కలిసొస్తుంది. సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, మయాంక్‌ మార్కండె లాంటి కుర్రాళ్లు ముంబయి విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఏడాది ఒక కొత్త దేశీ కుర్రాడిని వెలుగులోకి తీసుకు రావడం ముంబయి ప్రత్యేకత. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, బుమ్రా, మార్కండే ఇలా వెలుగులోకి వచ్చినవాళ్లే. విదేశీ ఆటగాళ్లు కీరన్‌ పొలార్డ్‌, క్వింటాన్‌ డికాక్‌, ఇవెన్‌ లూయిస్‌, బెన్‌ కటింగ్‌ లాంటి వాళ్లు ముంబయి బలాన్ని పెంచుతున్నారు. 

అన్నదమ్ములు ఆడితే..

త కొన్ని సీజన్లలో ముంబయి విజయాల్లో అన్నదమ్ములు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య పాత్ర ఎంతో కీలకం. గత సీజన్లో హార్దిక్‌ (18 వికెట్లు, 260 పరుగులు), కృనాల్‌ (12 వికెట్లు, 228 పరుగులు) ఆల్‌రౌండ్‌ పాత్ర పోషించారు. మరోసారి వీళ్లిద్దరూ చెలరేగడం జట్టుకు ఎంతో అవసరం. కృనాల్‌ అంతర్జాతీయ అనుభవం కూడా సంపాదించడం ముంబయికి మరో ప్లస్‌ పాయింట్‌. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్యకు ప్రపంచకప్‌ ముందు ఫామ్‌, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి ఇంతకుమించిన వేదిక దొరకబోదు.

బలహీనత అదే

ముంబయి జట్టుకు వనరులకు ఎప్పుడూ కొదువ లేదు. కానీ కలిసికట్టుగా ఆడకపోవడమే ఆ జట్టు ప్రధాన బలహీనత. ఒకరిద్దరిపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల గెలిచే మ్యాచ్‌లనూ ఆ జట్టు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. ఈసారి యువరాజ్‌ సింగ్‌ రూపంలో పెద్ద స్టార్‌ ముంబయి జట్టుతో చేరాడు. ఐతే ప్రస్తుతం అతని ఫామ్‌ చూస్తుంటే అతడు అన్ని మ్యాచ్‌లు ఆడేది కష్టమే అనిపిస్తోంది. పొలార్డ్‌దీ దాదాపుగా అదే పరిస్థితి. మునుపటి జోరు లేదతనిలో! అంబటి రాయుడిని వదులుకోవడంతో ఆ జట్టు మిడిలార్డర్‌ బలహీనంగా మారింది. బౌలింగ్‌లో శ్రీలంక స్టార్‌ లసిత్‌ మలింగ స్థిరంగా రాణించలేకపోతున్నాడు. ముంబయి ప్రధానంగా బుమ్రా, మెక్లెనగన్‌ల మీదే ఆధారపడుతోంది. మరి ఈసారి వాళ్లిద్దరూ ఎలా రాణిస్తారో చూడాలి. ప్రపంచకప్‌ దృష్ట్యా బుమ్రా అన్ని మ్యాచ్‌ల్లో ఆడేది అనుమానమే. స్పిన్‌ విభాగంలో లెగ్‌స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండె, ఆఫ్‌ స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య ఎలా ఆడతారనేది కీలకం.

ముంబయి ఇండియన్స్‌

కెప్టెన్‌: రోహిత్‌శర్మ; కోచ్‌: మహేల జయవర్దనే 
స్వదేశీ ఆటగాళ్లు: రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, కృనాల్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌, యువరాజ్‌సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మయాంక్‌ మార్కండె, రాహుల్‌ చాహర్‌, అనుకుల్‌ రాయ్‌, సిద్దేశ్‌ లాడ్‌, ఆదిత్య తారె, బరిందర్‌ శరణ్‌, పంకజ్‌ జయస్‌వాల్‌, రసిక్‌ దార్‌, అన్మోల్‌ప్రీత్‌సింగ్‌ 
విదేశీ ఆటగాళ్లు: మలింగ, బెరెన్‌డార్ఫ్‌, కీరన్‌ పొలార్డ్‌, బెన్‌ కటింగ్‌, మెక్లెనగన్‌, డికాక్‌, ఆడమ్‌ మిల్నె, ఎవిన్‌ లూయిస్‌ 
కీలక ఆటగాళ్లు: రోహిత్‌శర్మ, హార్దిక్‌, పొలార్డ్‌, డికాక్‌, బుమ్రా


Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net