close

ప్రధానాంశాలు

ఏం మాయ చేస్తారో! 

ఈనాడు - హైదరాబాద్‌

సూపర్‌ స్టార్ల ఊసే ఉండదు 
ప్రచారార్భాటాలు అసలే ఉండవు 
నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌.. పదునైన బౌలర్లు..సమర్థుడైన కోచ్‌లే బలం 
ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపించగల సమష్టితత్వం ఆ జట్టు సొంతం 
ఐపీఎల్‌లో 140 పరుగుల స్కోరును సైతం కాపాడుకోగలదు. అంత దమ్మున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌! 2016లో ఛాంపియన్‌గా అవతరించి..  నిరుడు రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ ఈసారి కూడాఫేవరెట్టే. ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఈ జట్టు ఐపీఎల్‌-12కు సై అంటోంది. 

పీఎల్‌-12 టైటిల్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గట్టి పోటీదారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2013లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌గా మారినప్పటి నుంచి ఈ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ సూపర్‌ స్టార్‌ సంస్కృతికి దూరంగా ఉంటూ.. ఉన్న వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకుంటూ అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతోంది. అదిరే ప్రదర్శనతో గత మూడేళ్లలో రెండు సార్లు ఫైనల్‌ చేరుకున్న ఘనత సన్‌రైజర్స్‌ సొంతం. విధ్వంసక బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అందుబాటులో లేకున్నా.. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో నిరుటి సన్‌రైజర్స్‌ ప్రదర్శన ప్రశంసలందుకుంది. సమష్టి ఆటతో ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ లేకపోయినా.. అగ్రశ్రేణి బౌలింగ్‌ విభాగంతో సన్‌రైజర్స్‌ దుర్భేధ్యంగా కనిపిస్తుంది. వార్నర్‌ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలం రైట్టింపైనట్లే. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు తరలివెళ్లినా సన్‌రైజర్స్‌పై ఆ ప్రభావం తక్కువే ఉండొచ్చు! జట్టులోని మొత్తం 23 మంది తుది జట్టులో చోటుకు అర్హులే ఉండటం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత. ప్రతి స్థానానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉండటం మరో విశేషం. దిల్లీకి ధావన్‌ను వదులుకున్నా.. బదులుగా ఆ జట్టు నుంచి విజయ్‌ శంకర్‌, షాబాజ్‌ నదీమ్‌, అభిషేక్‌శర్మల రూపంలో నాణ్యమైన ఆటగాళ్లనే సన్‌రైజర్స్‌ తెచ్చుకుంది. బెయిర్‌స్టో, గప్తిల్‌లను ఎంచుకోవడం ద్వారా ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడే పరిస్థితి లేకుండా చేసుకుంది.

జట్టే బలం

నరులు సమపాళ్లలో ఉండటం సన్‌రైజర్స్‌ అసలు బలం. వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లతో టాప్‌ ఆర్డర్‌ను దుర్భేధ్యంగా మార్చుకోవచ్చు. మహ్మద్‌ నబి, షకిబల్‌ హసన్‌, విజయ్‌ శంకర్‌లతో ఆల్‌రౌండర్ల బృందంతో బరిలో దిగొచ్చు. భువనేశ్వర్‌, స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లతో కూడిన పేస్‌ విభాగాన్నీ నమ్ముకోవచ్చు. పరిస్థితులు.. ప్రత్యర్థి ప్రకారం ఎలాంటి తుది జట్టునైనా బరిలో దించే వెసులుబాటున్న ఏకైక టీమ్‌ సన్‌రైజర్స్‌. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కర్ణాటకను విజేతగా నిలిపిన కెప్టెన్‌ మనీష్‌ పాండే.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఫామ్‌ సన్‌రైజర్స్‌కు ఈసారి కలిసొచ్చే అంశాలు. ఎప్పట్లాగే తిరుగులేని బౌలింగ్‌ విభాగం సన్‌రైజర్స్‌ సొంతం. పేసర్లు భువనేశ్వర్‌, కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మ, స్టాన్‌లేక్‌, నటరాజన్‌.. స్పిన్నర్లు రషీద్‌ఖాన్‌, షకిబ్‌, నబి, షాబాజ్‌ నదీమ్‌, అభిషేక్‌శర్మలతో బౌలింగ్‌ విభాగం సమతూకంగా ఉంది.

ఫామ్‌.. గాయాలు

బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌ బలం, బలహీనత.. వార్నర్‌. నిరుడు అతడి గైర్హాజరీలో సన్‌రైజర్స్‌ ఫైనల్‌ వరకు వెళ్లుండొచ్చు. కానీ వార్నర్‌ ఉన్నంతసేపు బ్యాటింగ్‌ అతడి చుట్టే తిరగడం ఖాయం. ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్న వార్నర్‌ మునుపటి ఫామ్‌ అందుకుంటాడా లేదా అన్నది ప్రశ్న. విలియమ్సన్‌, షకిబ్‌, అభిషేక్‌శర్మలు గాయాల నుంచి కోలుకుని వస్తున్నారు! మనీష్‌ పాండే ప్రతిభావంతుడే అయినా ఐపీఎల్‌లో స్థాయికి తగ్గట్లు ఎప్పుడూ ఆడలేదు! యూసుఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడా, సాహాలు ఫామ్‌లో లేరు. బెయిర్‌స్టోకు ఇదే తొలి ఐపీఎల్‌ కాగా గప్తిల్‌ ప్రదర్శనపై గ్యారంటీ లేదు! ప్రపంచ కప్‌ నేపథ్యంలో అదనపు భారం పడకుండా భువనేశ్వర్‌ ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్నది ఇప్పుడే చెప్పలేం!

వార్నర్‌.. వార్నర్‌

నిరుడు బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధానికి గురైన డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌తో పునరాగమనం చేస్తున్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విధించిన నిషేధం ఈనెల 29న ముగియనుంది! సీఏ నిషేధంతో సంబంధం లేకుండా ఈనెల 24న ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ బరిలో దిగుతున్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై తీవ్ర దుమారం రేగడంతో గత ఏడాది వార్నర్‌ను ఐపీఎల్‌కు దూరంగా ఉంచారని.. అది నిషేధం కిందకి రాదన్నది సన్‌రైజర్స్‌ వర్గాల మాట. ఏదేమైనా మళ్లీ వార్నర్‌ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఆటకు దూరంగా ఉండటం.. ఫామ్‌పై స్పష్టత లేకపోవడంతో వార్నర్‌కు కెప్టెన్సీ అదనపు భారం కాకూండా విలియమ్సన్‌నే సారథిగా కొనసాగించడం అతడికి మేలు చేసే నిర్ణయమే. పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టిసారించడానికి వార్నర్‌కూ అవకాశం లభించినట్లవుతుంది. వార్నర్‌ మునుపటి ఫామ్‌ అందుకుంటే మాత్రం మిగతా జట్లకు కష్టమే.

అంతా మూడీ చేతుల్లో..

న్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కర్త, కర్మ, క్రియ.. కోచ్‌ టామ్‌ మూడీనే. ఆటగాళ్ల ఎంపిక దగ్గర్నుంచి.. వ్యూహాల్ని ఆచరణలో పెట్టి, ఫలితాల్ని రాబట్టడం వరకు అంతా మూడీ హోంవర్కే. జట్టులోని 11 మంది ఆటగాళ్లలో ఎవరి నుంచి ఎంత శాతం ప్రదర్శన రాబట్టొచ్చో లెక్కలు వేసుకుని.. అనుకున్నట్లే పక్కాగా ఫలితాన్ని రాబట్టడం అతడి ప్రత్యేకత. మార్గనిర్దేశకుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌, బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ల సంపూర్ణ సహకారం మూడీకి అదనపు బలం. బహుశా ఐపీఎల్‌లో మరే ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవ్వనంత స్వేచ్ఛ మూడీ బృందానికి దక్కడం ఆ జట్టు విజయానికి మరో కారణం.
దేశీయ ఆటగా: భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, మనీష్‌ పాండే, బాసిల్‌ థంపి, రిక్కీ భుయ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, షాబాజ్‌ నదీమ్‌, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌, శ్రీవత్స గోస్వామి, నటరాజన్‌, సాహా, సందీప్‌శర్మ, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మ 
విదేశీయులు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, షకిబల్‌  హసన్‌, రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ నబి, మార్టిన్‌ గప్తిల్‌, బెయిర్‌స్టో 
కీలక ఆటగాళ్లు: వార్నర్‌, విలియమ్సన్‌, మనీష్‌ పాండే, శంకర్‌, భువనేశ్వర్‌, రషీద్‌ఖాన్‌ 

గత ప్రదర్శన 
2013 : నాలుగో స్థానం 
2014 : లీగ్‌ దశ (ఆరో స్థానం) 
2015 : లీగ్‌ దశ (ఆరో స్థానం) 
2016 : విజేత 
2017 : నాలుగో స్థానం 
2018 : రన్నరప్‌


Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net