close

ప్రధానాంశాలు

ప్రియమైన కోహ్లీ-ఆర్‌సీబీ ఎందుకిలా?

అందరూ అందరే.. అరివీర భయంకరులే. ఆడితే ప్రత్యర్థికి చుక్కలే. బంతులు వేసేందుకు వణుకే. 11 సీజన్లు. మూడు సార్లు ఫైనల్‌ చేరుకున్న ఘనత. వనరులకు లోటు లేదు. డబ్బులకు కొదవ లేదు. గొంతెమ్మ కోర్కె కోరినా ఇచ్చే ఫ్రాంచైజీ. అయినా ఒక్కసారి.. ఒక్కటంటే ఒక్కసారీ ట్రోఫీ గెలిచే భాగ్యానికి నోచుకోలేదు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. అంగట్లో అన్నీ ఉన్నా తరహా..! టోర్నీ సాంతం అద్భుత ప్రయాణం చేస్తుంది. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుంది. ఎందుకిలా? అభిమానుల మనసుల్లో వేధిస్తున్న సందేహం.. ఎందుకిలా?ఎందుకంటే 99 ఎప్పటికీ 100 కాదు.

స్టార్లే.. స్టార్లు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏ సీజనైనా తీసుకోండి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో స్టార్లకు కొదవలేదు. ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ, బంతిని 360 డిగ్రీల్లో బాదగల ఏబీ డివిలియర్స్‌ ఆ జట్టులో శాశ్వత సభ్యులు. మొన్నటి వరకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ ఉండేవాడు. షేన్‌ వాట్సన్‌, కేఎల్‌ రాహుల్‌ మెరుపుల్నీ చూసిందా జట్టు. ఇన్ని సీజన్లలో ఒక్కసారీ కప్‌ గెలవకున్నా ప్రతిసారీ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. స్టార్లకు తగ్గట్టే పరుగుల వరద పారిస్తుంది. భారీ సిక్సర్లు, సొగసైన బౌండరీలు, శతక సంబరాలతో ముందుకు సాగుతుంది. కానీ గెలుపు మెట్టుపై బోల్తా పడుతుంది. 2016 సీజన్‌లో ఫైనల్‌ చేరిన ఆ జట్టు కప్‌ గెలుస్తుందనే అనుకున్నారు. విరాట్‌ రెడ్‌హాట్‌ ఫామ్‌లో ఉన్నాడప్పుడు. నాలుగు శతకాలతో చెలరేగాడు. కానీ సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి పాలవ్వక తప్పలేదు. 2017 సీజన్‌లో కోహ్లీ గాయంతో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. వరుసగా ఓటములే. కోహ్లీ వచ్చిన తర్వాతా ఓటములే వెక్కిరించాయి. తాజా సీజన్లోనూ వరుసగా మూడు అపజయాలు. విన్నింగ్‌ మూమెంటమ్‌ కనిపించడం లేదు. మళ్లీ అభిమానుల్లో ఓ సందేహం. ఎందుకిలా?

పసలేని బౌలింగ్‌

క్రికెట్‌ అంటే కేవలం బ్యాట్స్‌మెన్‌ క్రీడ కాదు. అద్భుతమైన బౌలర్లు అవసరం. చురుకైన ఫీల్డింగ్‌ చేసేవారు కావాలి. బెంగళూరు ఎంపిక చేసే ఏ తుది జట్టునైనా తీసుకోండి. స్టార్‌ బౌలర్‌ కనిపించడు. ఒకవేళ ఒక్కరో ఇద్దరో కనిపించినా అదేంటో అద్భుత ప్రదర్శన ఉండదు. యుజువేంద్ర చాహల్‌ ఒక్కడే కాస్తంత నిలకడగా రాణిస్తున్నాడు. అతడికి కోహ్లీ అండదండలు బాగానే ఉన్నాయి మరి. కోట్ల రూపాయాలను బ్యాట్స్‌మెన్‌పై వెచ్చించే ఆ ప్రాంఛైజీ, వ్యూహకర్తలు బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు. టీమిండియా మ్యాచ్‌లప్పుడు మాత్రం విరాట్‌ బౌలింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అంగీకరిస్తాడు. ఈ భిన్న వైఖరి అర్థం కాదు. ప్రస్తుత సీజన్‌లోనూ బౌలింగ్‌ విభాగంలో ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మొయిన్‌ అలీ, కౌల్టర్‌నైల్‌, టిమ్‌ సౌథీ, వాషింగ్టన్‌ సుందర్‌, స్టొయినిస్‌, పవన్‌ నేగి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంచుకుంటున్న వారిలో ఎవరూ రాణించడం లేదు. ఒక జట్టు విజయం సాధించాలంటే ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేయడం కీలకం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇదే వ్యూహంతో పనిచేస్తుంది. ఏ ప్రాంఛైజీ వద్ద లేని అద్భుతమైన బౌలింగ్‌ వనరులు వారి వద్ద ఉన్నాయి. కానీ బెంగళూరు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ట్రోఫీ అందించని బ్యాట్స్‌మెన్‌ వ్యూహంతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.

వాళ్లు చూసుకుంటారులే!

ఏ జట్టైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మనసు పెట్టి అమలు చేయాలి. వంటవాళ్లు ఎక్కువైతే వంటకం చెడిపోతుందని పలుకుబడి. బెంగళూరుకూ ఇదే వర్తిస్తుందని విశ్లేషకుల మాట. అక్కడంతా స్టార్లే. ఒకరు కాకుంటే మరొకరు చూసుకుంటారులే అన్న ధీమా. విరాట్‌ అంకితభావాన్ని ఎవరూ తక్కువ చేయరు. సారథ్యం తర్వాత అతడి పరుగుల దాహం మరింత తీవ్రమైందే తప్పా తగ్గలేదు. మిస్టర్‌360 ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. గతంలో క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌ ఉండేవారు. అందరూ మ్యాచ్‌ విన్నర్లే! అయితే ఎవరో ఒకరు చూసుకుంటారులే అనే చిన్న భావంతో ఆ జట్టు కుప్పకూలుతోంది.

ఇక కోహ్లీపై అతిగా ఆధారపడడం బెంగళూరు కొంప ముంచుతోంది. మరో విషయం ఏంటంటే? ఎంత ఆడినా పేరంతా కోహ్లీ, డివిలియర్స్‌కే వస్తుంది తప్ప తమకు గుర్తింపు దక్కదని మిగతా ఆటగాళ్ల మనసుల్లో ఉండిపోతుందని కొందరి మాట! ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ ఇందుకు ఓ ఉదాహరణ. బెంగళూరుకు ఆడేటప్పుడు తాను కోహ్లీ, ఏబీడీ నీడలో ఉన్నానని ఇప్పుడు పంజాబ్‌లో తానే కింగ్‌నని అన్నాడు. తొలి ప్రాధాన్యం తనకే ఉంటుందని ఆనందం వ్యక్తం చేశాడు.

సారథ్య సవాలు

జట్టుకు నాయకత్వం వహించడమంటే మామూలు సంగతి కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సచిన్‌ తెందుల్కర్‌ సారథిగా విఫలమయ్యాడు. ఇతర జట్లలోనూ ఇలాంటి వారున్నారు. ఒక సారథిగా విరాట్‌ కోహ్లీ ఇంకా సఫలత సాధించలేదని అంతర్జాతీయ క్రికెట్‌ పండితులు అంటారు. అతడు మరింత పరిణతి సాధించాలని సూచిస్తున్నారు. జట్టు సభ్యుల్లో ఒక్కరూ అతడిని ప్రశ్నించరని అంటుంటారు. ఎవరో ఒకరు అతడితో మాట్లాడాలని గతంలో గంగూలీ సూచించారు. ఒక్కసారీ ట్రోఫీ గెలిపించకున్నా సారథిగా కొనసాగిస్తున్నందుకు బెంగళూరుకు విరాట్‌ కృతజ్ఞత చెప్పాలని మాజీ క్రికెట్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఈ మాటలు వివాదం సృష్టించాయి. కోహ్లీపై అభిమానంతో చాలా మంది గౌతీని విమర్శించారు. కానీ బ్యాట్స్‌మన్‌గా అతనెంత గొప్పవాడైనా సారథిగా విజయవంతం అయ్యాడని చెప్పేందుకు ట్రోఫీలే కదా సాక్ష్యాలు!

ఆధారం ఎక్కడ?

టీమిండియా సారథిగా కోహ్లీ ధోనీపై ఎక్కువ ఆధారపడతాడు. మహీ లేనప్పుడు నిర్ణయాల్లో తడబాటు కనిపిస్తూనే ఉంటుంది. బౌలర్లను ప్రయోగించడంలో, మార్పుచేర్పుల్లో చురుగ్గా వ్యవహరించడు. ఇక ప్రతి మ్యాచ్‌కూ ఆటగాళ్లను మారుస్తుంటాడు. కోచ్‌ కుంబ్లేతో వ్యవహరించిన విధానమూ సమీక్షకు నిలిచేదే. పరుగులు చేస్తూ ఆదర్శంగా నిలిచినా జట్టులో ప్రేరణ, స్ఫూర్తి, కసి రగిలించడం సారథిగా విరాట్‌ కర్తవ్యాలు. ఈ విషయంలో ధోనీ, గంగూలీతో పోలిస్తే అతడి వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ తాను నమ్మిన దాన్ని 100కు 200 శాతం కష్టపడి అమలు చేసే కోహ్లీ సారథిగా బెంగళూరును 100% నడిపించడంలో విఫలమవుతున్నాడు. అంటే అతడు నాయకుడిగా విజయవంతం కాడని చెప్పలేం! ఏదేమైనా 99% ఎప్పుడూ 100 కాదు. ఇప్పుడున్న ఆ ఒక్క శాతం లోటును పూడిస్తే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. జట్టు సగటు వయసు 35 ఏళ్లైనా, డాడీస్‌ ఆర్మీ అని విమర్శలు ఎదురైనా, మైదానంలో చురుగ్గా కదల్లేని ఫీల్డర్లున్నా ఆ 100 శాతం ప్రయత్నంతోనే చెన్నైని ధోనీ విజేతగా నిలిపాడని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రస్తుత సీజన్‌లో వరుసగా మూడు ఓటములు ఎదురైనా సరే ఇప్పటికీ విశ్వాసం, అంకితభావం, ట్రోఫీ గెలుస్తామన్న నమ్మకం, విజేతలమే అన్న భరోసా ఉంటే కోహ్లీసేనకు ట్రోఫీ అందని ద్రాక్షేమీ కాదు.మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net