close

ప్రధానాంశాలు

అమ్మో.. ఆఖరి ఓవర్‌

అప్పటికే బ్యాట్స్‌మెన్‌ ఊపుమీదున్నారు. అంతకు ముందు ఓవర్‌లోనే ప్రమాద ఘంటికలు మోగించారు. ఉత్కంఠ ఊపేస్తోంది. ప్రేక్షకులు ఉద్వేగంతో చూస్తున్నారు. ఓ వైపు ఒత్తిడి చంపేస్తోంది. వాతావరణం విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలని చెబుతోంది. అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయడం ఎంత కష్టం.. ఎంత కష్టం! మరి అదే ఆఖరి ఓవర్‌ అయితే! అమ్మో..! అనుకోవాల్సిందే. ఐపీఎల్‌ చరిత్రలో శిక్షకు గురైన కొన్ని ఆఖరి ఓవర్ల గురించి తెలుసుకుందామా!!

దిండాపై ‘హార్దిక్‌ ఎటాక్‌’

అది 2017 సీజన్‌. క్రీజులో ముంబయి యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. చివరి ఓవర్‌ వేసింది రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ అశోక్‌ దిండా. ఒకరేమో హార్డ్‌ హిట్టర్‌. మరొకరేమో అలవోకగా పరుగులిచ్చే పేసర్‌. ఇక ఫలితం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. తనలోని విధ్వంసకారుడిని నిద్రలేపిన జూనియర్‌ పాండ్య ఈ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు సాధించాడు. మొదటి మూడు బంతులనీ అలవోకగా సిక్సర్లు బాదేశాడు. తర్వాతి బంతికి ఓ బౌండరీ వచ్చింది. మళ్లీ నాలుగో బంతికి భారీ సిక్సర్‌. తర్వాతి బంతి వైడ్‌ పడ్డా వికెట్‌ లభించింది. చివరి బంతికి బై రావడంతో ఐపీఎల్‌ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన ఆఖరి ఓవర్‌గా నిలిచింది.

‘అమ్మో’ అయ్యర్‌

ప్రస్తుత దిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మంచి బ్యాటర్‌. ఒకప్పుడు రంజీల్లో పరుగుల వరద పారించిన అతడు ప్రస్తుతం నిలకడగా రాణించడం లేదు. తన స్థాయికి తగ్గట్టు ఆడలం లేదు. ఐపీఎల్‌ 2018 సీజన్‌లో కోల్‌కతా బౌలర్‌ శివమ్‌ మావి వేసిన ఆఖరి ఓవర్‌లో ఊచకోత కోశాడు. తొలి రెండు బంతుల్ని అమాంతం స్టాండ్స్‌లోకి పంపించాడు. మూడో బంతికి అవతలి ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అయ్యాడు. నాలుగో బంతికి భారీ సిక్సర్‌. ఐదో బంతి వైడ్‌. చివరి రెండు బంతుల్లో 4, 6 లభించాయి. మొత్తం 29 పరుగులు వచ్చాయి.

‘పొలార్డ్‌+పాండ్య’

హార్దిక్‌ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో మనందరికీ తెలుసు. అగ్నికి వాయువు తోడైనట్టు అతడికి పొలార్డ్‌ జత కలిశాడు. ఇది 12వ సీజన్‌లోనే జరిగింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో చివరి ఓవర్‌ను వీరిద్దరూ ఆడారు. ముందు, 1, 0+వైడ్‌, 1, నోబ్‌+6 లభించాయి. ఆ తర్వాత 3, 6, 4, 6 దంచేశారు. మొత్తానికి బ్రావో ఓవర్‌లో 29 పరుగులు రాబట్టింది ఈ జోడీ.

ధోనీ ‘ది ఫినిషర్‌’

రాజస్థాన్‌ రాయల్స్‌పై జడ్డూ సహకారంతో ఎంఎస్‌ ధోనీ చెలరేగాడు. ఇదీ 2019లనే. పాపం ప్రశాంతంగా ఉండే ధోనీ వల్ల జయదేవ్‌ ఉనద్కత్‌కు శిక్ష పడింది. తొలి బంతికి సింగిల్‌ వచ్చింది. రెండో బంతికి భారీ సిక్సర్‌. మూడో బంతికి వైడ్‌+0. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు. ఏం చేయాలో తెలియని జయదేవ్‌ మళ్లీ వైడ్‌ వేశాడు. చివరి బంతిని మహీ అమాంతం స్టాండ్స్‌లో పెట్టాడు. ఈ ఓవర్‌లో 28 పరుగులు వచ్చాయి.

క్రీజులో ‘హిట్‌ మ్యాన్‌’

2013 సీజన్‌ సంగతిది. క్రీజులో ఉన్నది ముంబయి వీరుడు రోహిత్‌ శర్మ. అతడి హిట్టింగ్‌ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆఖరి ఓవర్‌ వేసింది కింగ్స్‌ ఎలెవన్‌ బౌలర్‌ డేవిడ్‌ హస్సీ. హిట్‌ మ్యాన్‌ చాలా సులభంగా పరుగులు రాబట్టాడు. తొలి మూడు బంతులకు 6, 0, 6 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ వైడ్‌ పడింది. ఇక చివరి మూడు బంతుల్ని 6, 4, 4గా మలిచాడు. వచ్చిన పరుగులు 27.

‘వింటేజ్‌’ యువీ

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో అనేక జట్లు మారాడు. 2014లో అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడాడు. చివరి ఓవర్‌ వేసింది దిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్‌ ఆర్‌.శుక్లా. ఈ ఓవర్‌లో యువీ తుపాను సృష్టించాడు. ఎస్‌ రాణా సహకారంతో 1, 0+వైడ్‌, 6, 6, 6, 0+వైడ్‌, 6, 0 పరుగులు రాబట్టాడు. మొత్తం 27 పరుగుల వచ్చాయి.

త్రిపాఠితో సంజు దెబ్బ

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజు శాంసన్‌ 2018లో అద్భుతంగా ఆడాడు. అందరూ అతడికి టీమిండియాలో చోటు ఖాయం అనుకున్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి, సంజు కలిసి ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. వీరిద్దరూ కలిసి 2, 6, 4, 1+నోబ్‌, 6, 6, 1 సాధించారు. ఇవండీ ఆఖరి ఓవర్ల ముచ్చట్టు. మరి ఉత్కంఠగా సాగుతున్న 12వ సీజన్‌లో హార్దిక్‌ 30 పరుగుల రికార్డును ఎవరైనా తిరగరాస్తారేమో చూడాలి.

ఈనాడు.నెట్‌ ప్రత్యేకంమరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net