close

ప్రధానాంశాలు

ఐపీఎల్‌ 12: అంపైర్ల తప్పిదాలు × ఆటగాళ్ల ఆవేశాలు

దిల్లీ: అంపైర్‌ ఒకసారి నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్‌. ఆ నిర్ణయంపై ఆటగాళ్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేందుకు వీల్లేదు. అలా చేస్తే శిక్షార్హులే. కానీ మైదానంలోని ఒక అంపైర్‌ తీసుకున్న నిర్ణయాన్ని లెగ్‌ అంపైర్‌ వ్యతిరేకిస్తే! మూడో అంపైర్‌కు నివేదించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే..! అది సబబేనా? ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ ఆరంభం నుంచి అంపైర్లు, ఆటగాళ్ల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా క్రికెట్‌ అపర మేధావి, నిబంధనలన్నీ ఆపోసన పట్టిన ‘మిస్టర్‌ కూల్‌’ ఆగ్రహంతో మైదానంలోనికి దూసుకురావడం కలకలం సృష్టిస్తోంది. 

ధోనీ కెరీర్‌లో ‘మచ్చ’

రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్లు సుందరం రవి, ఉల్లాస్‌ గాంధీ చేసిన పొరపాట్లు ఐపీఎల్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలపై మరోసారి సందేహం కలిగిస్తున్నాయి. చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లను వేలెత్తి ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహీ వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు. అప్పుడప్పుడూ ఆటపై, ఆటగాళ్ల ఎంపికపై విమర్శలొచ్చినా వ్యక్తిత్వం, ప్రవర్తన పరంగా మంచిపేరే ఉంది. అలాంటి మహేంద్రుడు గతి తప్పడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతడి కెరీర్లో అనవసరంగా ఓ మచ్చ వేసుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.

భరించక తప్పదు

‘అంపైర్లపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు స్టార్‌ ఆటగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఒత్తిడిని తట్టుకొనే బాధ్యత అంపైర్లదే. వారికి ఏమనిపిస్తుందో అదే చేస్తారు. అయితే అది అంపైర్ల మూర్తిమత్వాన్ని బట్టి ఉంటుంది’ అని భారత అంతర్జాతీయ అంపైర్‌ కె.హరిహరన్‌ అన్నారు. ప్రస్తుతం ధోనీ చేసిందానికి విధించిన శిక్ష చాలా తక్కువని అందరూ భావిస్తున్నారు. మ్యాచ్‌ ఫీజులో విధించిన 50 శాతం కోతను ఫ్రాంచైజీనే భరిస్తుంది. లెవల్‌-2 తప్పిదం ప్రకారం గరిష్ఠ శిక్ష రెండు మ్యాచ్‌ల నిషేధం విధించొచ్చు. దాన్నీ పునఃపరిశీలించాలని ఆటగాడు అప్పీల్‌ చేసుకోవచ్చు.

దేశవాళీ అంపైర్లపై స్టార్ల ఆధిపత్యం

అంపైర్లతో ధోనీ వాగ్వాదం ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రెండోది. అంతకు ముందు ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్‌ రవి.. ముంబయి పేసర్‌ మలింగ వేసిన నో బాల్‌ను గుర్తించలేదు. ‘మేం క్లబ్‌ క్రికెట్‌ ఆడటం లేదు. అంపైర్లు తెలివిగా ఉండాలి’ అని బెంగళూరు సారథి కోహ్లీ ఘాటుగా విమర్శించాడు. ముంబయి సారథి రోహిత్‌ శర్మ సైతం అంపైర్ల తప్పిదాలపై సునిశిత విమర్శలు చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్లను బహిరంగంగా విమర్శించిన కోహ్లీని కనీసం మందలించిన దాఖలాలు కనిపించలేదు. భారత క్రికెట్‌లో దేశవాళీ అంపైర్లపై స్టార్‌ ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించడం సాధారణమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

నియంత్రణ ముఖ్యం

‘అంపైర్‌ ఎవరైనా తన నిర్ణయానికి కట్టుబడే ధైర్యం ఉండాలి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫుల్‌టాస్‌ నో బాల్‌ గుర్తించాల్సిన బాధ్యత లెగ్‌ అంపైర్‌ బ్రూస్‌ ఆక్సన్‌ఫోర్డ్స్‌ది. అంపైర్‌ గాంధీ నో బాల్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతడు పొరబడ్డాడు. ఇక వ్యాఖ్యాతలు, నిపుణుల ప్రకారం చూసుకుంటే.. బ్యాట్స్‌మన్‌ ఔటైతే తప్ప అంపైర్‌ నో బాల్‌ గురించి మూడో అంపైర్‌కు నివేదించరాదు. ప్రస్తుత సంఘటనలో నో బాల్‌ను మూడో అంపైర్‌కు నివేదించకూడదు. చివరగా మహేంద్ర సింగ్‌ ధోనీ మైదానంలోకి అసలు ప్రవేశించకూడదు. ఆ సమయంలో అతడికి అది బహిష్కృత ప్రదేశం. ధోనీ చేసిన తప్పుకు 50 శాతం జరిమానా చాలా తక్కువ శిక్ష. ఏదేమైనప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకొనే వారిని మంచి అంపైర్‌ అంటారు. కానీ మ్యాచ్‌ నిర్వహణ నైపుణ్యాలున్న వారినే గొప్ప అంపైర్లుగా భావిస్తారు. నిర్ణయాలు ప్రకటించడంతో పోలిస్తే ఇది భిన్నం. మ్యాచ్‌ను నియంత్రించడం ముఖ్యం’ అని హరిహరణ్‌ అన్నారు.

మానవ మాత్రులే!

ఆటగాళ్ల మాదిరిగానే అంపైర్లూ మానవమాత్రులేనని బీసీసీఐలోని కొందరు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 17 మంది అంపైర్లు మాత్రమే ఐపీఎల్‌ విధులు నిర్వహిస్తున్నారని బీసీసీఐ తెలిపింది. అందులో 11 మంది భారతీయులు కాగా ఆరుగురు విదేశీయులు. మరో ఆరుగురు భారతీయులు నాలుగో అంపైర్‌గా ఉన్నారు. ‘ఐపీఎల్‌ షెడ్యూలు తీరికలేకుండా ఉంటుంది. తమ తర్వాతి మ్యాచ్‌లో విధులు నిర్వహించేందుకు అంపైర్లు సైతం విపరీతంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాంతో వారూ అలసిపోతుంటారు’ అని బోర్డు తెలిపింది.మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net