close

ప్రధానాంశాలు

కోల్పోయేందుకు కోహ్లీకి ఇంకేం మిగిలింది?

హైదరాబాద్‌: తిరుగులేని బ్యాటింగ్‌. అద్భుతమైన టెక్నిక్‌. సూపర్బ్‌ టైమింగ్‌. ఫీల్డింగ్‌లో మేటి. ఫిట్‌నెస్‌ వంకలేదు. ఇక ఎడమకాలు ముందుకేసి బ్యాటును లాఘవంగా బంతికి తగిలిస్తే కళ్లముందు సొగసైన కవర్‌డ్రైవ్‌ ఆవిష్కృతం అవుతుంది. ఇద్దరు ఫీల్డర్లు పరుగెడుతుంటారు. బంతి బౌండరీని చేరుతుంది. ఇవన్నీ చదువుతుంటే విరాట్‌ కోహ్లీ గుర్తొచ్చాడు కదూ! ఈ ఉపమానాలన్నీ అతడి గురించే. ప్రస్తుత తరంలో అత్యుత్తమ క్రికెటరైన ఈ ‘ఛేదన రారాజు’ వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైన అతడు పోగొట్టుకోవడానికి ఇకేమైనా ఉందా? అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిందా? కుంగిపోతున్నాడా?

కొరవడిన బృంద స్ఫూర్తి

విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇది అందరూ చెప్పే మాటే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును తప్ప మరో జట్టు ఎరగడు. ఆ జట్టు పగ్గాలు అందుకున్నాడన్న మాటేగానీ ఒక్కసారీ ట్రోఫీ ముద్దాడలేదు. పైగా 12వ సీజన్‌ సగం ముగిసినప్పటికీ ఒక్క విజయమూ వరించలేదు. వరుసగా 6 మ్యాచుల్లో 6 ఓటములు. 2008 ఆరంభ సీజన్‌ తర్వాత బెంగళూరుకు ఇలాంటి ఘోర పరిస్థితులు ఎదురవడం ఇదే తొలిసారి. బ్యాటింగ్‌ పరంగా అతడికి తిరుగులేదు. కానీ మిడిలార్డర్‌ సహకారం లేదు. బౌలర్లు డెత్‌లో తేలిపోతున్నారు. క్రికెట్‌ బృంద క్రీడ. అతడికి తన బృందం నుంచి సహకారం లభించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే అతడికి ఏమనిపిస్తుంది? కచ్చితంగా కుంగిపోతాడు కదా!

తొలగిస్తారన్న భయం!

ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు పైగా సారథ్యం వహించిన ఆటగాళ్లు ముగ్గురే. ఎంఎస్‌ ధోనీ (166) అందరి కన్నా ముందున్నాడు. గౌతమ్‌ గంభీర్‌ (129)ది రెండో స్థానం. కోహ్లీ మూడో వ్యక్తి. బెంగళూరును అతడు విజేతగా నిలిపే సంగతి పక్కన పెట్టండి! విరాట్‌ సారథ్యంలో జట్టు విజయాల శాతమూ తక్కువే. 50 కన్నా ఎక్కువ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన వారితో పోలిస్తే విజయాల శాతం 45.45% మాత్రమే. కింది నుంచి రెండో స్థానంలో ఉంటాడు. ఇక బెంగళూరుకు ఐదుగురు సారథ్యం వహించగా అనిల్‌ కుంబ్లే (57.69%), డేనియల్‌ వెటోరీ (54.54%) విరాట్‌ కన్నా ముందున్నారు. ట్రోఫీ అందించని ఏ ఒక్కరినీ ఇతర జట్లు కొనసాగించడం లేదు. మరి కోహ్లీని అలా తొలగిస్తారన్న భయం ఉందా!

అప్పుడు టీమిండియాకు ఎలా?

ఐపీఎల్‌ 2012లో డేనియల్‌ వెటోరీ బదులు కొన్ని మ్యాచ్‌లకు నేతృత్వం వహించిన విరాట్‌ 2013 నుంచి బెంగళూరుకు పూర్తిస్థాయి సారథిగా మారాడు. 2015, 2016 మినహాయిస్తే ఇంకెప్పుడూ ఆ జట్టు ప్లేఆఫ్‌ చేరలేదు. అలాగని కోహ్లీని తొలగించడం చాలా కష్టం. అతడిపై ఆధారపడే అనేక ఒప్పదాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల ఆదాయం బెంగళూరుకు లభిస్తోంది. చిన్నస్వామిలో అతడికి అద్భుత రికార్డులు ఉన్నాయి. అతనికి అతడే సారథ్యం నుంచి వైదొలగాలి తప్ప మరో అవకాశం లేదు. కానీ అలా చేయగలడా? నాయకుడిగా తప్పుకుంటే టీమిండియా సారథిగా పరిస్థితి ఏంటి? అందరూ ఏమంటారు? ఐపీఎల్‌ ట్రోఫీ అందించలేక తప్పుకున్న వ్యక్తికి భారత జట్టు బాధ్యతలేంటని ప్రశ్నిస్తారు. ఇవన్నీ విరాట్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

ఉక్కు మనిషికి కుంగుబాటా?

సారథ్యం సంగతి వదిలేస్తే వరుస ఓటములు అతడిని కుంగదీశాయని భావించొచ్చా? కాదని కచ్చితంగా చెప్పొచ్చు. క్రికెట్‌ విరాట్‌ నరనరానా జీర్ణించుకుంది. మనసా, వాచా, కర్మణా అతడికి అంతా క్రికెట్టే. అందుకే మైదానంలో ఎవరూ ఆస్వాదించనంతగా ఆటను ఆస్వాదిస్తాడు. అందులోనే ఆనందం వెతుక్కుంటాడు. బుమ్రా సిక్సర్‌ బాదితే ఎలాంటి అహం లేకుండా ఎగిరి గంతులేస్తాడు. ఆటపరంగా విరాట్‌ది ఉక్కు మనస్తత్వం. అతడి ఆత్మవిశ్వాసాన్ని ఏదీ దెబ్బతీయలేదు. నిన్నటి గురించి అతడికి గుర్తుండదు. ఇప్పటి గురించే అతడి ఆరాటం. పోరాటం. సింహం ఆకలేస్తుందని గడ్డి తినదు. అలాగే ఓటములు కోహ్లీని కుంగదీయవు. పైగా విజయం సాధించేందుకు రెచ్చగొడతాయి. ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శనపై ఓటముల ప్రభావం ఎంతమాత్రం ఉండదు.మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net