close

ప్రధానాంశాలు

కూర్పులో మార్పులు లేకే ఓటములు!

మొహాలి: సరైన కూర్పు సాధించకపోవడమే తమ వరుస ఓటములకు కారణమని రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ అన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లనూ అందుకే ఓడిపోతున్నామని వెల్లడించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ చేతిలో ఓటమి తర్వాత అప్టన్‌ మాట్లాడాడు.

‘ప్రస్తుత 11 మందితో మేం తరుచూ గెలవడం లేదు. ప్రతిసారీ అందరూ ఫామ్‌లో ఉండలేరు. కుదురుకొనేందుకు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. చాలా రోజుల్నించి మేం నిలకడగా ఒకే జట్టుతో బరిలోకి దిగుతున్నాం. అయినప్పటికీ కొన్ని విభాగాల్లో రాణించడం లేదు. సరైన కూర్పు కోసం కొన్ని మార్పులు చేయాలి. ప్రతి మ్యాచ్‌లోనూ మేం కొద్ది తేడాతోనే ఓడిపోతున్నాం. కింగ్స్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ ద్వయం అద్భుతంగా బంతులు వేసింది. మా బ్యాట్స్‌మన్‌ దాడి చేసినా వారు బౌండరీలకు అవకాశం ఇవ్వలేదు. అదే వారికి విజయం అందించింది’ అని అప్టన్‌ తెలిపాడు.

‘జోఫ్రా ఆర్చర్‌ ఎంతో నైపుణ్యం ఉన్న బౌలర్‌. ఓవర్‌లో ఆరు బంతుల్నీ వైవిధ్యంగా వేస్తాడు. మా జట్టులో ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్న ఆటగాడు అతనొక్కడే. ప్రపంచకప్‌ సమీపిస్తుండటంతో కొందరు ఆటగాళ్లు మధ్యలోనే జట్టును వీడనున్నారు. జోఫ్రా స్థానంలో ఓషానె థామస్‌ ఉన్నాడు. బట్లర్‌ వెళ్తే లియామ్‌ లివింగస్టన్‌ ఉన్నాడు’ అని ప్యాడీ వెల్లడించాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net