close

ప్రధానాంశాలు

ఐపీఎల్‌ : కూతురు చెప్పింది.. నాన్న చేశాడు

హైదరాబాద్‌ : వరుస ఓటములతో వెనకబడ్డట్లు కనిపించిన సన్‌రైజర్స్‌ మళ్లీ పుంజుకుంది. టేబుల్‌ టాపర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఆదిపత్యం చూపించింది. ఆరు వికెట్ల తేడాతో చెన్నైని మట్టికరిపిచింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ చెలరేగి అర్ధశతకం చేశాడు. వార్నర్‌ దూకుడు మామూలే కానీ.. ఇక్కడ ఓ విశేషం ఉంది. స్టాండ్స్‌లో సన్‌ రైజర్స్‌ జెర్సీతో ఉన్న ఓ చిట్టి అభిమాని వార్నర్‌లో ఉత్సాహం నింపింది. ఆ చిన్నారి ఎవరో కాదు. డేవిడ్‌ వార్నర్‌ ముద్దుల కూతురు ఇండి రే. మ్యాచ్‌ కోసం మైదానంలోకి దిగుతున్న వార్నర్‌ తన జట్టు సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో ‘గో డాడీ’ అని ఉన్న బోర్డు చూపిస్తూ.. తండ్రిలో ఉత్సాహం నింపింది. తన కూతుర్ని చూసిన వార్నర్‌ తెగ మురిసిపోయాడు. వెంటనే మైదానం మొత్తం సన్‌ రైజర్స్‌ అభిమానుల అరుపులతో మోత మోగింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఇలాంటి సంఘటనలు ఐపీఎల్‌కే అందాన్ని తీసుకొస్తాయంటూ పేర్కొంది. దానిపై స్పందించిన అభిమానులు.. స్వచ్ఛమైన ప్రేమంటే ఇది.. అని పేర్కొంటున్నారు. మరికొంతమంది ఇంటర్నెట్‌లో అత్యుత్తమ సంఘటన ఇదే అంటున్నారు.
ధోని గైర్హాజరీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో చెన్నై కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో వీరబాదుడు బాదిన వార్నర్‌ కేవలం 25 బంతుల్లోనే ఆర్ధశతకం (10ఫోర్లు) పూర్తి చేశాడు. దీంతో హైదరాబాద్‌ విజయానికి మార్గం సుగమం అయింది. వార్నర్‌కు తోడు మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో(61) రాణించడంతో హైదరాబాద్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net