close

ప్రధానాంశాలు

రైనా, కోహ్లీకి చేరువలో రోహిత్‌శర్మ

 

ముంబయి: దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అయితే ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఈ మ్యాచ్‌లో మరో 12 పరుగులు చేస్తే భారత్‌ తరఫున టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతనికన్నా ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైస్‌కెప్టెన్‌ సురేశ్‌ రైనా, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఉన్నారు. సురేశ్‌రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చెయ్యగా కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు. కాగా రోహిత్‌ 293 ఇన్నింగ్స్‌లో 7998 పరుగులు చేశాడు. 

మొత్తంగా చూస్తే వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ 12670 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజీలాండ్‌ ఆటగాడు బెండన్‌ మెక్‌కలం 9922, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ 9922 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా భారత ఆటగాళ్లు రైనా, కోహ్లీ, రోహిత్‌ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఈ సీజన్‌లో రోహిత్‌శర్మ ఏడు ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేశాడు. కాగా అందులో ఒక్కటి కూడా అర్ధశతకం చేయకపోవడం గమనార్హం. దీంతో గురువారం దిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగే మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.

 

ఇది వరకు ఈ రెండు జట్లూ తలపడిన మ్యాచ్‌లో దిల్లీ 37 పరుగులతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ముంబయి ఎలాగైనా గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా పైనే ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ భారీ అంచనాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తోడో వేచి చూడాలి. 

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లపై బుమ్రా గత రికార్డు చూస్తే పేలవంగా ఉంది. దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌కి గతంలో 46 బంతులేసిన బుమ్రా 69 పరుగులిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ధావన్‌ 150 స్ట్రైక్‌రేట్‌ సాధించడంతో పాటు ఒక్కసారి కూడా ఔట్‌ కాలేదు. అలాగే పృథ్వీషా గతేడాది ఐపీఎల్‌లో 3 బంతులే ఎదుర్కొని 5 పరుగులు చేశాడు. చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే.. ముంబయి బౌలర్లలో బుమ్రా ఒక్కడే ఇప్పటివరకూ దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్‌ తీయలేదు. అతడి బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొని 186.6 స్ట్రైక్‌రేట్‌తో 28 పరుగులు చేశాడు అయ్యర్‌. 

అయితే ఈ రోజు దిల్లీ ఓపెనర్లపై మంచి ప్రదర్శన చేయాలని అతడు భావిస్తుండగా ఈ సీజన్‌లో మాత్రం చెప్పుకొదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో బుమ్రా తీసింది ఎనిమిది వికెట్లే. మరోవైపు ముంబయి బౌలర్లలో ఏ ఒక్కరూ అత్యధిక వికెట్లు తీసినవారిలో లేరు. దీంతో పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముంబయి బౌలర్లు పోటీపడటం లేదని అర్ధమవుతోంది. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net