close

ప్రధానాంశాలు

దిల్లీపై బదులు తీర్చుకున్న ముంబయి

40 పరుగులతో దిల్లీపై ఘన విజయం

దిల్లీ: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలుపొందింది. 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దిల్లీపై బదులు తీర్చుకుంది. ముంబయి నిర్దేశించిన 169 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(20), శిఖర్‌ధావన్‌(35) మొదట ధాటిగా ఆడి ఆరు ఓవర్లకు 48 పరుగులు చేశారు. అనంతరం ఏడో ఓవర్‌ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోడంతో దిల్లీ ఏ దశలోనూ విజయంవైపు సాగలేదు. మధ్యలో అక్షర్‌ పటేల్‌(26), క్రిస్‌ మోరిస్‌(11) బ్యాట్‌ ఝుళిపించినా పెద్ద స్కోర్‌ సాధించలేకపోయారు. అప్పటికే దిల్లీ ఓటమి ఖాయమైంది. కాగా ముంబయి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ మూడు వికెట్లు తీయగా, బుమ్రా రెండు, హార్దిక్‌ పాండ్య, మలింగా, కృనాల్‌ పాండ్య తలా ఓ వికెట్‌ తీశారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్య(37, 26 బంతుల్లో 5x4), హార్దిక్‌ పాండ్య(32, 15 బంతుల్లో 2x4, 3x6) మెరుపు బ్యాటింగ్‌ చేసి జట్టుని ఆదుకున్నారు. మొదట రోహిత్‌శర్మ(30), క్వింటన్‌ డికాక్‌(35) దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో రోహిత్‌ ఔటయ్యాక బెన్‌కటింగ్‌(2), డికాక్‌, సూర్యకుమార్‌(26) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. ఆపై కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య 54 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ముంబయి స్కోరును 168 పరుగులకు తీసుకెళ్లారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net