close

ప్రధానాంశాలు

తిప్పేసిన చాహర్‌

మెరిసిన హార్దిక్‌
దిల్లీపై ముంబయి విజయం

ముంబయి ఇండియన్స్‌ మురిసింది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటిన ఆ జట్టు ఆరో విజయంతో ఐపీఎల్‌-12 ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. పాండ్య సోదరుల మెరుపులకు యువ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ మాయాజాలం తోడైన వేళ.. ఏకపక్ష మ్యాచ్‌లో ముంబయి జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయుడిగా అమిత్‌ మిశ్రా ఘనత సాధించడం విశేషం.

దిల్లీ

రాహుల్‌ చాహర్‌ (3/19) విజృంభించడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 40 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (32; 15 బంతుల్లో 2×4, 3×6), కృనాల్‌ పాండ్య (37 నాటౌట్‌; 26 బంతుల్లో 5×4), డికాక్‌ (35; 27 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట ముంబయి 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. బంతితో  చాహర్‌తో పాటు బుమ్రా (2/18) రాణించడంతో ఛేదనలో దిల్లీ చేతులెత్తేసింది. 9 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. ధావన్‌ (35; 22 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌.

మాయ చేసిన రాహుల్‌: పృథ్వీ షా (20; 24 బంతుల్లో 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శిఖర్‌ ధావన్‌ ధాటిగా ఆడడంతో ఛేదనలో దిల్లీకి మంచి ప్రారంభమే లభించింది. 6 ఓవర్లలో స్కోరు 48/0. కానీ కుర్ర స్పిన్నర్‌ చాహర్‌ విజృంభించడంతో దిల్లీ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. అతడి ధాటికి 14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఆ జట్టు చిక్కుల్లో పడింది. పరుగుల వేగమూ బాగా తగ్గిపోయింది. ఏడో ఓవర్లో ధావన్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా దిల్లీ పతనాన్ని ఆరంభించిన రాహుల్‌.. తన తర్వాతి ఓవర్లో పృథ్వీని కూడా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో చక్కటి బంతితో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌నూ ఔట్‌ చేశాడు. అంతకుముందు ఓవర్లోనే మన్రో (3)ను కృనాల్‌ బౌల్డ్‌ చేశాడు. 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దిల్లీ.. తిరిగి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. బ్యాట్స్‌మెన్‌పై ముంబయి బౌలర్లు ఒత్తిడి కొనసాగించారు. రిషబ్‌ పంత్‌ కూడా దిల్లీని ఆదుకోలేకపోయాడు. ఉన్నకాసేపు కూడా సాధికారికంగా ఆడలేకపోయాడు. 11 బంతుల్లో ఏడు పరుగులే చేసిన అతడు చివరికి.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. 14వ ఓవర్లో అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 76 పరుగులు మాత్రమే. ఆ తర్వాత దిల్లీ పరాజయం దాదాపుగా లాంఛనమే. అక్షర్‌ (26; 23 బంతుల్లో 1×4, 1×6), మోరిస్‌ (11; 9 బంతుల్లో 1×6) ఆరో వికెట్‌కు 31 పరుగులు జోడించినా ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు.

మెరిసిన హార్దిక్‌: అంతకుముందు ముంబయి మెరుగైన స్కోరు చేసిందంటే కారణం ఆఖర్లో హార్దిక్‌ పాండ్య విధ్వంసమే. అతడి సోదరుడు కృనాల్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయికి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (30; 22 బంతుల్లో 3×4, 1×6), డికాక్‌ ధాటిగా ఆడడంతో 6 ఓవర్లలో 57/0తో నిలిచింది. పవర్‌ప్లే ముగిశాక ఆట స్వభావం మారిపోయింది. చకచకా వికెట్లు తీసిన దిల్లీ బౌలర్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. ఆరో ఓవరో ్లరోహిత్‌ను మిశ్రా బౌల్డ్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో కటింగ్‌ (2)ను అక్షర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అక్షర్‌, మిశ్రా ముంబయి బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (26; 27 బంతుల్లో 2×4) ఎక్కువ సమయమే క్రీజులో గడిపినా ధాటిగా ఆడలేకపోయాడు. పదో ఓవర్లో డికాక్‌ రనౌట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్య కూడా బ్యాటు ఝళిపించలేకపోయాడు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య ముంబయి కేవలం 47 పరుగులే రాబట్టగలిగింది. రబాడ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి సూర్యకుమార్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 104 పరుగులే. కానీ కృనాల్‌కు హార్దిక్‌ పాండ్య జత కలిశాక ముంబయి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కృనాల్‌ కూడా వేగాన్ని అందుకున్నాడు. రబాడ, మోరిస్‌ బౌలింగ్‌లో ఒక్కో ఫోర్‌ బాదాడు. కీమో పాల్‌ వేసిన 18వ ఓవర్లో కృనాల్‌ ఓ ఫోర్‌ కొట్టగా.. హార్దిక్‌ వరుసగా 4, 6 దంచాడు. తర్వాత మోరిస్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ మరింత రెచ్చిపోయాడు. వరుసగా 6, 6, 4 బాదడంతో ముంబయి స్కోరు 150కి చేరుకుంది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రబాడ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కొట్టాక హార్దిక్‌ ఔటైనా.. కృనాల్‌ రెండు ఫోర్లు దంచడంతో స్కోరు 168కి చేరుకుంది. పాండ్య   సోదరులు ఐదో వికెట్‌కు 26 బంతుల్లో 54 పరుగులు జోడించారు.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) మిశ్రా 30; డికాక్‌ రనౌట్‌ 35; కటింగ్‌ ఎల్బీ (బి) అక్షర్‌ పటేల్‌ 2; సూర్యకుమార్‌ (సి) పంత్‌ (బి) రబాడ 26; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 37; హార్దిక్‌ పాండ్య (సి) పంత్‌ (బి) రబాడ 32; పొలార్డ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 168; వికెట్ల పతనం: 1-57, 2-62, 3-74, 4-104, 5-158; బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 3-0-17-0; రబాడ 4-0-38-2; మోరిస్‌ 3-0-39-0; కీమో పాల్‌ 3-0-37-0; అమిత్‌ మిశ్రా 3-0-18-1; అక్షర్‌ పటేల్‌ 4-0-17-1
దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) హార్దిక్‌ పాండ్య (బి) రాహుల్‌ చాహర్‌ 20; ధావన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 35; మన్రో (బి) కృనాల్‌ పాండ్య 3; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 3; రిషబ్‌ పంత్‌ (బి) బుమ్రా 7; అక్షర్‌ పటేల్‌ (బి) బుమ్రా 26; మోరిస్‌ (సి) హార్దిక్‌ పాండ్య (బి) మలింగ 11; కీమో పాల్‌ రనౌట్‌ 0; రబాడ (సి) పొలార్డ్‌ (బి) హార్దిక్‌ పాండ్య 9; అమిత్‌ మిశ్రా నాటౌట్‌ 6; ఇషాంత్‌ శర్మ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 128; వికెట్ల పతనం: 1-49, 2-59, 3-61, 4-63, 5-76, 6-107, 7-107, 8-107, 9-125; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్య 2-0-17-1; రాహుల్‌ చాహర్‌ 4-0-19-3; మలింగ 4-0-37-1; జయంత్‌ యాదవ్‌ 4-0-25-0; బుమ్రా 4-0-18-2; కృనాల్‌ పాండ్య 2-0-7-1

మిశ్రా @ 150

ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారతీయుడిగా దిల్లీ క్యాపిటల్స్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా నిలిచాడు. గురువారం మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఔట్‌ చేసినప్పుడు అతడు ఈ ఘనత అందుకున్నాడు. అతడికిది 140వ మ్యాచ్‌. మొత్తంగా ఐపీఎల్‌లో 150 వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్‌ మిశ్రా. మలింగ (ముంబయి ఇండియన్స్‌) 115 మ్యాచ్‌ల్లో 161 వికెట్లతో ఐపీఎల్‌ వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 152 మ్యాచ్‌ల్లో 146 వికెట్లతో పియూష్‌ చావ్లా (కోల్‌కతా)  మూడో స్థానంలో ఉన్నాడు. 


Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net