close

ప్రధానాంశాలు

ఆ వివాదం తర్వాతే హార్దిక్‌ మెరుగయ్యాడు


ముంబయి: ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఆటకు దూరమయ్యాక మరింత మెరుగయ్యాడని అన్నారు ఆయన సోదరుడు కృనాల్‌ పాండ్య. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడి ఆటతీరుపై స్పందించాడు. హార్దిక్‌ పాండ్య వెన్నునొప్పి, టీవీ షో వివాదం తర్వాత ఆటకు దూరమైనప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడని చెప్పాడు. అలాగే తామిద్దరం ఒకేసారి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టామని అతడికి అన్నింటికన్నా క్రికెట్‌ అంటేనే చాలా ఇష్టమని అన్నాడు. కృనాల్‌ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఆట మీద పాండ్యకు ఉన్న శ్రద్ధ అతికొద్ది మంది ఆటగాళ్లకే ఉంటుంది. రోజురోజుకీ మరింత మెరుగవ్వడమే అతడి లక్ష్యం. అలా చేస్తేనే స్థిరంగా ఆడతామని భావిస్తాడు. ఇంతకు ముందు స్పిన్‌ బౌలర్లపైనే చెలరేగేవాడు. ఇప్పుడు మాత్రం పేస్‌ బౌలర్లపైనా విజృంభిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.

ఇంకా మాట్లాడుతూ.. హార్దిక్‌పాండ్య రాజీపడని మనస్తత్వమే తనకు చాలా నచ్చుతుందని, అందువల్లే ఏటా ఆటకు సంబంధించి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాడని తెలిపాడు. ఇంకా చెప్పాలంటే హార్దిక్‌ నుంచి తాను చాలా నేర్చుకున్నానని కృనాల్‌ చెప్పాడు. అనంతరం దిల్లీతో మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ మొదట తాము 145 పరుగులు చేస్తే చాలనుకున్నామని, ఈ వికెట్‌పై అంతకన్నా ఎక్కువ పరుగులు చేయలేమని భావించినట్టు చెప్పాడు. తన సోదరుడు బౌండరీలతో చెలరేగడంతో అదనపు పరుగులు లభించాయని వివరించాడు. 

అలాగే బౌలింగ్‌ చేసేటప్పుడు వికెట్‌ ఎలా మారుతుందో తాము ముందే గ్రహించామని అందుకు తగ్గట్టే బౌలింగ్‌ చేశామని చెప్పాడు. ప్రస్తుతం ఆట జరుగుతున్న తీరు చూస్తే ఏదో ఒక కొత్త విషయంపై దృష్టిపెట్టాలని అలాగైతేనే వికెట్లు దక్కుతాయని అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన కృనాల్‌ ఏడు పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసిన విషయం తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net