close

ప్రధానాంశాలు

పాండ్య హెలికాప్టర్‌ షాట్‌పై ధోనీ ఏమన్నాడు?

దిల్లీ: తాను ఆడిన హెలికాప్టర్‌ షాట్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీకి నచ్చిందని ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య చెప్పాడు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న పాండ్య తొమ్మిది మ్యాచ్‌ల్లో 194.64 స్ట్రైక్‌రేట్‌తో 218 పరుగులు చేశాడు. కాగా, గురువారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 15 బంతుల్లో 32 పరుగులు చేయగా అందులో రెండు ఫోర్లు, మూడు భారీ సిక్సులు ఉన్నాయి. అయితే 20వ ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో పాండ్య కొట్టిన హెలికాప్టర్‌ షాట్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇదిలా ఉండగా ఇదివరకే వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ ముందే పాండ్య హెలికాప్టర్‌ షాట్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి 37 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. గురువారం మ్యాచ్‌ అనంతరం పాండ్య మీడియాతో మాట్లాడుతూ.. తాను క్రికెట్‌లో ఎప్పుడూ హెలికాప్టర్‌ షాట్‌ ఆడతాననుకోలేదని, అది కేవలం నెట్స్‌లోనే సాధన చేస్తున్నానని చెప్పాడు. అయితే తాను ధోనీ రూమ్‌కి వెళ్లి హెలికాప్టర్‌ షాట్‌ ఎలా ఆడానో అడిగానని.. అందుకు ధోనీ బదులిస్తూ ‘చాలా బాగా ఆడావ్‌’ అని చెప్పినట్లు పేర్కొన్నాడు. 

అలాగే తాను గతంలో ఇంత బలంగా ఎప్పుడూ ఆడలేదని తనకి తానే చెప్పుకున్నట్లు పాండ్య అన్నాడు. నెట్స్‌లో బాగా సాధన చేస్తున్నందువల్లే ఇలా ఆడగలుగుతున్నానని వివరించాడు. ఈ సీజన్‌లో బాగా ఆలోచించి వికెట్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నానని, అందుకే మంచి ప్రదర్శన చేస్తున్నానని తెలిపాడు. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net