close

ప్రధానాంశాలు

రసెల్‌ బాదినా.. బెంగళూరే నవ్వింది 

ఆండ్రి, రాణా మెరుపులు వృథా 
కోల్‌కతాపై బెంగళూరు విజయం 
శతకంతో చెలరేగిన కోహ్లి 
అలీ విధ్వంసక ఇన్నింగ్స్‌ 
కోల్‌కతా

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌.. తొలి 10 ఓవర్లలో బెంగళూరు చేసిన పరుగులు 70 మాత్రమే.. కానీ ఆఖరికి ఆ జట్టు 213 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించింది. కారణం  విరాట్‌ కోహ్లి... 214 పరుగుల ఛేదన... 10 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 60/3. కానీ ఇన్నింగ్స్‌ చివరికి 203 పరుగులు చేసింది.. కారణం నితీష్‌ రాణా, ఆండ్రి రసెల్‌..! నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన రసెల్‌, నితీష్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ని హోరెత్తించారు. దాదాపు బెంగళూరును పరాజయం అంచుల దాకా తీసుకెళ్లారు. అయితే ఆఖరి ఓవర్లో తెలివిగా బౌలింగ్‌ చేసిన మొయిన్‌ అలీ బెంగళూరుకు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. 

విరాట్‌ (100; 58 బంతుల్లో 9×4, 4×6) చెలరేగాడు... అతను మెరుపు శతకం చేసి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు మొయిన్‌ అలీ (66; 28 బంతుల్లో 5×4, 6×6) విరుచుకుపడడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌ (1/32), రసెల్‌ (1/17) మాత్రమే పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. నితీష్‌ రాణా (85 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4, 5×6), ఆండ్రి రసెల్‌ (65; 25 బంతుల్లో 2×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడినా బెంగళూరు స్కోరు సమీపంగా మాత్రమే తీసుకొచ్చారు కానీ కోల్‌కతాను గెలిపించలేకపోయారు. 

వాళ్లిద్దరూ భయపెట్టారు: 214 పరుగుల భారీ ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగింది. 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 84 మాత్రమే. ముఖ్యంగా ఉతప్ప (20 బంతుల్లో 9) మరీ జిడ్డుగా ఆడాడు. ఇలాంటి స్థితిలో రసెల్‌, నితీష్‌ రాణాలు అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడారు. బెంగళూరు బౌలర్లను భయపెడుతూ సిక్స్‌లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా రసెల్‌ తన మార్క్‌ సిక్స్‌లతో స్కోరును అమాంతం పెంచాడు. 15వ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదిన ఈ విండీస్‌ వీరుడు.. ఆ తర్వాత స్టాయినిస్‌ బౌలింగ్‌లోనూ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టాడు. రాణా కూడా సిక్స్‌లు, ఫోర్లు దంచడంతో కోల్‌కతా ఒక దశలో లక్ష్యానికి సమీపంగా వచ్చింది. చివరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సి రాగా... మొయిన్‌ అలీ తొలి రెండు బంతులకు ఒకే పరుగు ఇవ్వగా... మూడో బంతిని రసెల్‌ సిక్స్‌ బాదాడు.. ఆ తర్వాత బంతిని అతను కొట్టలేకపోవడంతో బెంగళూరు విజయం ఖాయమైంది. రసెల్‌-రాణాలు 14.75 రన్‌రేట్‌తో ఐదో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. 
కోహ్లి మెరుపుల్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభంలో ధాటిగా ఆడలేకపోయింది. 4 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 26 పరుగులే. దీనికి తోడు పార్థివ్‌ పటేల్‌ (11) వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ స్థితిలో కోహ్లి అడపాదడపా ఫోర్లు కొట్టి బెంగళూరు రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకున్నాడు. ఆదిత్యనాథ్‌ (13)ను ఔట్‌ చేసిన రసెల్‌ బెంగళూరును దెబ్బ కొట్టాడు. 10 ఓవర్లకు బెంగళూరు చేసింది 70 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో మొయిన్‌ అలీ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. కోహ్లి తోడుగా అలీ చెలరేగిపోయాడు. ఆడిన రెండో బంతికే సిక్స్‌ బాదిన అలీ.. ఆ తర్వాత టాప్‌ గేర్‌లోకి వెళ్లిపోయాడు. 24 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన మొయిన్‌.. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగులు జత చేశాడు. అలీ ఎంతగా చెలరేగాడో చెప్పడానికి బెంగళూరు 16వ ఓవర్‌ చూస్తే చాలు.. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఈ ఓవర్లో తొలి బంతిని ఫోర్‌ కొట్టిన అలీ... రెండో బంతిని స్లాగ్‌ స్వీప్‌తో సిక్స్‌ బాదాడు... మూడో బంతి కూడా బౌండరీ చేరింది. నాలుగో బంతి లాంగ్‌ఆన్‌లో సిక్స్‌గా మారింది. ఐదో బంతి వైడ్‌ కాగా... అదనంగా లభించిన బంతిని అలీ లాంగ్‌ఆఫ్‌ మీదుగా మరో భారీ  సిక్స్‌ కొట్టడంతో బెంగళూరు స్కోరు రాకెట్‌ వేగంతో పరుగులెత్తింది. అయితే ఇదే ఓవర్‌ ఆఖరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అలీ.. ప్రసిద్ధ్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 
చివరి ఓవర్‌ ఐదో బంతికి..: అలీ ఔటైనా.. విరాట్‌ మాత్రం ఆగలేదు..గర్నీ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో పాటు బౌలర్‌ తల మీదగా మెరుపు సిక్స్‌ బాదాడు. ఆ తర్వాత   ప్రసిద్ధ్‌కు కూడా కోహ్లి తన బ్యాట్‌ పదును చూపించాడు. ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో వరసగా సిక్స్‌, ఫోర్‌ బాది 90ల్లోకి వెళ్లిన విరాట్‌.. ఆఖరి ఓవర్లో సెంచరీ చేస్తాడా లేదా అనిపించింది. ఎందుకంటే తొలి బంతికి విరాట్‌ సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత రెండు బంతులకు స్టాయినిస్‌ ఫోర్‌, సిక్స్‌ కొట్టడంతో.. కోహ్లికి స్ట్రెకింగ్‌ వస్తుందా అనిపించినా.. నాలుగో బంతికి స్టాయినిస్‌ సింగిల్‌ తీయగా.. ఐదో బంతిని బౌండరీ బాదిన కోహ్లి ఐపీఎల్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. చివరి 5 ఓవర్లలో ఆర్‌సీబీ 91 పరుగులు పిండుకుంది.

కోల్‌కతాలో విజయం సాధించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ విజయం మాకు ఎంతో కీలకం. ఆఖరి ఓవర్లలో బౌలర్‌కు స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. స్టాయినిస్‌ 19వ ఓవర్‌ను బాగా వేశాడు. ఆ ఓవర్లో తొలి మూడు బంతులకు అతడు పరుగులు ఇవ్వకపోవడం కలిసొచ్చింది. ఆఖరి ఓవర్‌ను మొయీన్‌ తెలివిగా వేశాడు. మొదట 175 చేస్తే చాలనుకున్నాం. 200కు పైగా పరుగులు చేస్తామని అస్సలు అనుకోలేదు. ‘నీ కోసం సెంచరీ సాధిస్తా అని డివిలియర్స్‌కు ముందే చెప్పాను’. అతడు చాలా సంతోషించివుంటాడు. ఆండ్రి రసెల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 

- విరాట్‌ కోహ్లి

మేం మరింత మెరుగ్గా బౌలింగ్‌ చేయాల్సింది. 20-25 పరుగులు ఎక్కువే ఇచ్చాం. కోహ్లి ఆడితే అంతే. అతడు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. రాణా, రసెల్‌ ధాటిగా ఆడటంతో ఆఖరికి గెలుస్తామనే అనుకున్నాం. కానీ.. సాధ్యం కాలేదు. 

- దినేశ్‌ కార్తీక్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పార్థివ్‌ (సి) రాణా (బి) నరైన్‌ 11; కోహ్లి (సి) శుభ్‌మన్‌ గిల్‌ (బి) గర్నీ 100; అక్షదీప్‌ నాథ్‌ (సి) ఉతప్ప (బి) రసెల్‌ 13; మొయిన్‌ అలీ (సి) ప్రసిద్ధ్‌ కృష్ణ (బి) కుల్‌దీప్‌ 66; స్టాయినిస్‌ నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 6; 
మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213 
వికెట్ల పతనం: 1-18, 2-59, 3-149, 4-213 
బౌలింగ్‌: గర్నీ 4-0-42-1; నరైన్‌ 4-0-32-1; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-52-0; రసెల్‌ 3-0-17-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-59-1; చావ్లా 1-0-10-0 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: లిన్‌ (సి) కోహ్లి (బి) స్టెయిన్‌ 1; నరైన్‌ (సి) పార్థివ్‌ (బి) సైని 18; శుభ్‌మన్‌ (సి) కోహ్లి (బి) స్టెయిన్‌ 9; ఉతప్ప (సి) నేగి (బి) స్టాయినిస్‌ 9; నితీష్‌ రాణా నాటౌట్‌ 85; రసెల్‌ రనౌట్‌ 65; కార్తీక్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 16; 
మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203 
వికెట్ల పతనం: 1-6, 2-24, 3-33, 4-79, 5-197 
బౌలింగ్‌: స్టెయిన్‌ 4-0-40-2; సైని 4-0-31-1; సిరాజ్‌ 4-0-38-0; స్టాయినిస్‌ 4-0-32-1; చాహల్‌ 3-0-45-0; అలీ 1-0-13-0‌



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net