close

ప్రధానాంశాలు

అయ్యో! రహానె సారథ్యానికి ఉద్వాసన

జయపుర: ఊహించిందే జరిగింది! అజింక్య రహానెపై వేటు పడింది. రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం అతడిని సారథ్యం నుంచి తొలగించింది. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌కు సగ్గాలు అప్పగించింది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌ నుంచి అతడే జట్టును నడిపించనున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ప్రకటించింది.

ప్రస్తుత సీజన్లో ఆడిన 8 మ్యాచుల్లో రాజస్థాన్‌ కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచింది. 6 మ్యాచుల్లో ఓటమి పాలైంది. విజయానికి చేరువలో ఉన్న మ్యాచ్‌లనూ చేజార్చుకుంది. జట్టును సరైన దారిలో నడిపించడం లేదన్న ఉద్దేశంతో రహానెకు ఉద్వాసన పలికారు. కనీసం స్మిత్‌ అయినా తమ తలరాత మారుస్తాడేమో అన్న ఆశతో ఉంది. 

‘ఐపీఎల్‌లో తర్వాతి జరిగే మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహిస్తాడు. గతేడాది జట్టు ప్లేఆఫ్‌కు చేరేందుకు అంజింక్య రహానె ముందుండి నడిపించాడు. 2019 ప్రయాణం తిరిగి గాడిన పడేందుకు కొత్త ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్నాం. రాజస్థాన్‌ రాయల్స్‌ నాయకత్వ బృందంలో స్టీవ్‌స్మిత్‌ ఎప్పుడూ భాగమే. రహానె ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తాడు. అవసరమైన ఫలితాలతో పాయింట్ల పట్టికలో రాయల్స్‌ పైకెళ్లేందుకు చిన్న మార్పు చేశాం’ అని రాజస్థాన్‌ యాజమాన్యం ప్రకటించింది.

ప్రపంచకప్‌నకు ఎంపికైన స్టీవ్‌ స్మిత్‌ మే 1 వరకే అందుబాటులో ఉంటాడు. మరి ఆ తర్వాత ఎవరిని సారథిగా చేస్తారో చూడాలి. బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌ సైతం అందుబాటులో ఉండరు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net