close

ప్రధానాంశాలు

సిక్సర్లు బాదారని మ్యాచ్‌లో ఏడ్చేసిన బౌలర్‌

ముంబయి: టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్‌ మధ్యలో కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర క్రికెటర్‌ నితీశ్ రాణా అతడిని ఊరడించాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అతడి బౌలింగ్‌ను ఊచకోత కోయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండో సారి తలపడ్డ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్‌ 16వ  ఓవర్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ వేశాడు. ఊపుమీదున్న మొయిన్‌ అలీ ఆ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదేశాడు. చివరి బంతికి ఔటయ్యాడు. ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిన అతడి బౌలింగ్‌ను అలీ చితకబాదడంతో యాదవ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అతడి కన్నుల్లో నీటి చారలు కనిపించాయి. సహచరుడు నితీశ్‌ రాణా అతడిని ఊరడించాడు. డగౌట్‌ నుంచి ఓ ఆటగాడు మంచినీరు ఇచ్చాడు.

పదిహేడో ఓవర్‌ పూర్తైన తర్వాత కుల్‌దీప్‌ కన్నీటి పర్యంతమైన దృశ్యాలు టీవీల్లో ప్రసారం అయ్యాయి. ఉద్వేగానికి గురైన అతడికి మద్దతుగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ‘ఆటలో ఇలాంటివి సాధారణమే ఛాంపియన్‌’ అంటూ సందేశాలు రాస్తున్నారు. వ్యాఖ్యాతలు సైతం అతడికి మద్దతుగా మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ శతకం బాదిన సంగతి తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net