close

ప్రధానాంశాలు

నడిపించాడు.. గెలిపించాడు

మెరిసిన స్మిత్‌
ముంబయిపై రాజస్థాన్‌ విజయం

రాజస్థాన్‌ రాయల్స్‌కు స్ఫూర్తిదాయక విజయం.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టీవ్‌ స్మిత్‌ ముందుండి నడిపించిన వేళ ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టిగా ఆడిన రాయల్స్‌ 5 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. ఆ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా... ముంబయిపైనే రెండుసార్లు గెలవడం విశేషం. ముంబయికి 10 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో ఓటమి.

జైపుర్‌

సొంతగడ్డపై రాజస్థాన్‌ సత్తా చాటింది. స్టీవ్‌ స్మిత్‌ (59 నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 1×6) తొలిసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన వేళ రాయల్స్‌ శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసింది. డికాక్‌ (65; 47 బంతుల్లో 6×4, 2×6) టాప్‌ స్కోరర్‌. స్మిత్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (43; 29 బంతుల్లో 5×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడడంతో రాయల్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అతనే ముందుండి..: పేలవ ఫామ్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌కు గత మ్యాచ్‌లో జట్టులో స్థానం కూడా దక్కలేదు. అలాంటిది ముంబయితో మ్యాచ్‌లో రహానెను పక్కనపెట్టి అతనికి కెప్టెన్సీ అప్పగించింది రాజస్థాన్‌.. అయితే నమ్మకాన్ని నిలబెడుతూ స్మిత్‌.. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా విజయవంతం అయ్యాడు. 162 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌కు ఆరంభంలో దెబ్బ   తగిలింది. రహానె (12) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ స్థితిలో స్మిత్‌... సంజు శాంసన్‌ (35; 19 బంతుల్లో 6×4, 1×6) తోడుగా ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. సంజు మెరుపు షాట్లు ఆడగా.. స్మిత్‌ ఆచితూచి ఆడాడు. అయితే రాహుల్‌ చాహర్‌ (3/29) విజృంభించడంతో ఒక దశలో రాజస్థాన్‌ 77/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో పరాగ్‌ (43; 29 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి స్మిత్‌ రాజస్థాన్‌ను విజయానికి చేరువ చేశాడు. కానీ పరాగ్‌ రనౌట్‌ కావడం.. 12 బంతుల్లో 9 పరుగులు అవసరమైన స్థితిలో టర్నర్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్‌ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో ప్రశాంతంగా ఆడిన స్మిత్‌.. బిన్నీ (7 నాటౌట్‌)తో కలిసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

మెరిసిన డికాక్‌: ముంబయి ఇన్నింగ్స్‌లో డికాక్‌ ఆటే హైలైట్‌. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ (5) వికెట్‌ కోల్పోయినా.. సూర్యకుమార్‌ (34; 33 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఐతే మూడు ఓవర్లకు ముంబయి స్కోరు 13 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో ధవళ్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో డికాక్‌.. వరుసగా మూడు ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో ముంబయి స్కోరు జోరందుకుంది. కానీ రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబయికి పరుగుల చేయడం అంత సులభం కాలేదు. డికాక్‌, సూర్యకుమార్‌ అడపాదడపా బౌండరీలు కొట్టి రన్‌రేట్‌ మరీ పడిపోకుండా చూసుకున్నారు. ఐతే సూర్యకుమార్‌, డికాక్‌, పొలార్డ్‌ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో ముంబయికి ఎదురు దెబ్బ తగిలింది. 18 ఓవర్లకు ముంబయి స్కోరు 133 పరుగులే. ఈ స్థితిలో హార్దిక్‌ పాండ్య (23; 15 బంతుల్లో 2×4, 1×6), కటింగ్‌ (13 నాటౌట్‌; 9 బంతుల్లో 1×4, 1×6) మెరుపు షాట్లు ఆడడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. రాజస్థాన్‌ ఫీల్డర్‌ ఆర్చర్‌ మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా ముంబయికి కలిసొచ్చింది. శ్రేయస్‌ గోపాల్‌ (2/21), స్టువర్ట్‌ బిన్నీ (1/19), ఆర్చర్‌ (1/22) ప్రత్యర్థిని కట్డడి చేశాడు.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) స్టోక్స్‌ (బి) గోపాల్‌ 65; రోహిత్‌శర్మ (సి) అండ్‌ (బి) గోపాల్‌ 5; సూర్యకుమార్‌ (సి) ధవళ్‌ (బి) బిన్నీ 34; హార్దిక్‌ ఎల్బీ (బి) ఆర్చర్‌ 23; పొలార్డ్‌ (బి) ఉనద్కత్‌ 10; కటింగ్‌ నాటౌట్‌ 13; కృనాల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 161; వికెట్ల పతనం: 1-11, 2-108, 3-111, 4-124, 5-152; బౌలింగ్‌: బిన్నీ 3-0-19-1; ధవళ్‌ కులకర్ణి 3-0-31-0; గోపాల్‌ 4-0-21-2; ఆర్చర్‌ 4-0-22-1; ఉనద్కత్‌ 4-0-46-1; పరాగ్‌  2-0-17-0
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె (సి) సూర్యకుమార్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 12; శాంసన్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 35; స్మిత్‌ నాటౌట్‌ 59; స్టోక్స్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 0; పరాగ్‌ రనౌట్‌ 43; టర్నర్‌ ఎల్బీ (బి) బుమ్రా 0; బిన్నీ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 162; వికెట్ల పతనం: 1-39, 2-76, 3-77, 4-147, 5-153; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్య 4-0-31-0; కృనాల్‌ పాండ్య 2-0-24-0; మలింగ    3.1-0-27-0; రాహుల్‌ చాహర్‌  4-0-29-3; బుమ్రా 4-0-21-1; మార్కండే 2-0-24-0



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net