close

ప్రధానాంశాలు

సన్‌ ధనాధన్‌

వార్నర్‌,  బెయిర్‌స్టో దూకుడు
హైదరాబాద్‌ చేతిలో  నైట్‌రైడర్స్‌ చిత్తు చిత్తు
15 ఓవర్లలోనే  160 పరుగుల ఛేదన

హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఆ ఊపులో చెలరేగిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ లాంటి బలమైన జట్టును చిత్తు చిత్తుగా ఓడించి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఇంకో ఐదు ఓవర్లుండగానే సన్‌రైజర్స్‌ ఛేదించడం విశేషం. ముందు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి కోల్‌కతాకు బ్రేకులేయగా.. ఎప్పట్లాగే ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ చెలరేగి ఆడి జట్టుకు ఘనవిజయాన్ని కట్టబెట్టారు.

ఈనాడు - హైదరాబాద్‌

ఓపెనర్లు వార్నర్‌ (67; 38 బంతుల్లో 3×4, 5×6), బెయిర్‌స్టో (80 నాటౌట్‌; 43 బంతుల్లో 7×4, 4×6) చెలరేగిన వేళ.. ఐపీఎల్‌-12లో సన్‌రైజర్స్‌ ఐదో విజయం సాధించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 9 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఖలీల్‌ అహ్మద్‌ (3/33) కీలక వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేశాడు. అనంతరం సన్‌రైజర్స్‌ ఒక వికెట్టే కోల్పోయి  5 ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వార్నర్‌, బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించారు. కోల్‌కతాకు వరుసగా ఇది ఐదో ఓటమి.

160.. ఉఫ్‌!: కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌లో అదరగొట్టింది. పరుగులు రాబట్టడంలో ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో పోటీపడ్డారు. ఫలితంగా 160 పరుగుల లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఆంధ్ర ఎడమచేతి వాటం పేసర్‌ పృథ్వీరాజ్‌ రెండో బంతిని వార్నర్‌ సిక్సర్‌గా మలిచాడు. ఐతే ఐదో బంతికే వికెట్‌ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను డీప్‌ పాయింట్‌లో కరియప్ప జారవిడిచాడు.  పవర్‌ ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 72/0తో తిరుగులేని స్థితికి చేరుకుంది. 52 బంతుల్లోనే సన్‌రైజర్స్‌ 100కు చేరుకుంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో వార్నర్‌- బెయిర్‌స్టో నాలుగు వంద భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. బెయిర్‌స్టో క్యాచ్‌లు మొత్తంగా మూడు నేలపాలు కావడం గమనార్హం. పృథ్వీ బౌలింగ్‌లో వార్నర్‌ బౌల్డయినా.. అప్పటికే సన్‌రైజర్స్‌ విజయానికి చేరువైంది. చావ్లా వేసిన 15వ ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా బౌండరీ, 2 సిక్సర్లతో లాంఛనాన్ని పూర్తి చేశాడు.
రసెల్‌ మెరుపుల్లేవ్‌: తొలి ఓవర్లో 10 పరుగులు.. రెండో ఓవర్లో 28.. మూడో ఓవర్లో 3 బంతులకే 14.. ఇదీ కోల్‌కతా బ్యాటింగ్‌ జోరు. క్రిస్‌ లిన్‌ (41; 47 బంతుల్లో 4×4, 1×6), సునీల్‌ నరైన్‌ (25; 8 బంతుల్లో 3×4, 2×6) ఆరంభం నుంచే బ్యాట్లకు పనిచెప్పడంతో కోల్‌కతా భారీస్కోరు ఖాయమనిపించింది. ఐతే ఖలీల్‌ వేసిన మూడో ఓవర్లో వరుసగా 6, 4, 4తో బాదిన నరైన్‌.. నాలుగో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అక్కడ్నుంచి కథ మారిపోయింది. 23 పరుగుల తేడాలో శుభ్‌మన్‌ గిల్‌ (3), నితీశ్‌ రాణా (11), దినేశ్‌ కార్తీక్‌ (6) పెవిలియన్‌కు చేరుకున్నారు. లిన్‌, రింకూసింగ్‌ (30; 25 బంతుల్లో 1×4, 2×6) ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించినా.. వీరు ఔటయ్యాక కోల్‌కతాకు మళ్లీ కష్టాలే. ప్రమాదకర ఆండ్రి రసెల్‌ (15; 9 బంతుల్లో 2×6)ను త్వరగా పెవిలియన్‌ చేర్చడంతో కోల్‌కతా భారీ స్కోరు ఆశలకు తెరపడింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: లిన్‌ (సి) విలియమ్సన్‌ (బి) ఖలీల్‌ 51; నరైన్‌ (బి) ఖలీల్‌ 25; శుభ్‌మన్‌ (సి) శంకర్‌ (బి) ఖలీల్‌ 3; రాణా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్‌ 11; కార్తీక్‌ రనౌట్‌ 6; రింకూసింగ్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ 30; రసెల్‌ (సి) రషీద్‌ (బి) భువనేశ్వర్‌ 15; చావ్లా (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 4; పృథ్వీరాజ్‌ నాటౌట్‌ 0; కరియప్ప నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-42, 2-50, 3-65, 4-73, 5-124, 6-133, 7-146, 8-150; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-35-2; నదీమ్‌ 4-0-30-0; ఖలీల్‌ 4-0-33-3; సందీప్‌శర్మ 4-0-37-1; రషీద్‌ఖాన్‌ 4-0-23-1

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) పృథ్వీరాజ్‌ 67; బెయిర్‌స్టో నాటౌట్‌ 80; విలియమ్సన్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (15 ఓవర్లలో ఒక వికెట్‌కు) 161; వికెట్‌ పతనం: 1-131; బౌలింగ్‌: గర్నీ 2-0-16-0; పృథ్వీరాజ్‌ 3-0-29-1; చావ్లా 3-0-38-0; నరైన్‌ 4-0-34-0;  కరియప్ప 2-0-34-0; రసెల్‌ 1-0-8-0



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net