close

ప్రధానాంశాలు

అప్పుడు కుర్రాడు.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌

చెన్నైతో మ్యాచ్‌ అనంతరం కోహ్లీపై డేల్‌ స్టెయిన్‌ వ్యాఖ్యలు 

బెంగళూరు: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్క పరుగుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇద్దరూ గెలుపు సంబరాలు చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2010లోనూ అచ్చం అలాగే గెలుపు సంబరాలు చేసుకున్న ఫొటో ఒకటి బైటకొచ్చింది. ఈ ఫొటోని చూపిస్తూ కోహ్లీ, స్టెయిన్‌ సరదా వ్యాఖ్యలు చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

కోహ్లీ మాట్లాడుతూ ‘సామాజిక మాధ్యమాల్లో ఇటీవల టెన్‌ ఇయర్స్‌ ఛాలెంజ్‌ విస్త్రుతంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి మీ అందరికీ ఒక ఫొటో చూపించాలనుకుంటున్నా. 2010లో ఆర్సీబీ తరఫున ఆడిన సందర్భంగా డేల్‌ స్టెయిన్‌తో కలిసి దిగిన ఫొటో ఇది. ఎడమవైపు స్టెయిన్‌.. కుడివైపు నేను ఉన్నాం. ఇప్పుడు 2019లోనూ ఇలాగే గెలుపు సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉంది. అయితే అప్పటికి ఇప్పటికీ స్టెయిన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆయన అలానే ఉన్నారు. కానీ కుడివైపు ఉన్న వ్యక్తి చాలా మారిపోయాడు. స్టెయిన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినట్టే ఇకపై ఇలాగే ఆడి అన్ని మ్యాచులు గెలుస్తాం’ అని పేర్కొన్నాడు.

ఇదే విషయంపై స్టెయిన్‌ స్పందిస్తూ.. ‘కోహ్లీ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడితో ఆడాను. తనతో ఆడటం నా అదృష్టం. ఈ ఫొటో చూస్తుంటే అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌, టీమిండియా కెప్టెన్‌. కోహ్లీని ఇలా చూస్తుంటే గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా చెన్నైతో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వాట్సన్‌, సురేశ్‌ రైనా వికెట్లు తీసి స్టెయిన్‌ బెంగళూరు జట్టుకి శుభారంభాన్ని ఇచ్చాడు. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net