close

ప్రధానాంశాలు

 120 కోట్లు కట్టండి లేదా వాంఖడే వీడండి

ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు మహారాష్ట్ర సర్కార్‌ నోటీసులు

ముంబయి: దక్షిణ ముంబయిలోని వాంఖడే స్టేడియానికి సంబంధించిన బకాయిలను చెల్లించాలని మహారాష్ట్ర సర్కార్‌ ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ)కి నోటీసులు జారీ చేసింది. ఆ మైదానానికి సంబంధించి రూ.120 కోట్ల లీజ్‌ రెన్యూవల్‌, బకాయిలు వెంటనే చెల్లించాలని అలా చేయని పరిస్థితుల్లో వాంఖడే పరిసరాలను ఖాళీ చెయ్యాలని ముంబయి నగర కలెక్టర్‌ శివాజీ జోంధాలే  ఏప్రిల్‌ 16న నోటీసులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మే 3న ఎంసీఏ అధికారులు సంబంధిత పత్రాలు తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశించారు.

ఈ విషయంపై ముంబయి కలెక్టర్‌ని మీడియా సంప్రదించగా.. 1975లో నిర్మించిన వాంఖడే స్టేడియాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లపాటు ఎంసీఏకి లీజుకు ఇచ్చిందని చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో ఆ లీజు సమయం ముగిసిపోవడంతో ఎంసీఏ మళ్లీ రిన్యూవల్‌కి దరఖాస్తు చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియానికి సంబంధించిన రూ.120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. గతంలో ఈ విషయంపై నోటీసులు ఇచ్చినా సంబంధిత అధికారులు స్పందించలేదని చెప్పారు. దీంతో మే 3న ఆఖరిసారి ఎంసీఏ అధికారులతో సమావేశమౌతామని, ఆ రోజే తదుపరి చర్యలపై ఆలోచిస్తామని శివాజీ సమాధానమిచ్చారు.

కాగా 33 వేల సామర్థ్యమున్న వాంఖడే స్టేడియం ముంబయి రంజీ జట్టుకు సొంతమైదానంలా ఉంది. అలాగే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కి సొంతమైదానమైంది. అయితే 2011 ప్రపంచకప్‌ ముందు ఈ స్టేడియానికి మరమత్తులు చేసి ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఆ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసి ధోనీసేన రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇదే స్టేడియంలో బీసీసీఐకి సంబంధించిన కార్యాలయం కూడా ఉండటం గమనార్హం.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net