close

ప్రధానాంశాలు

పాంటింగ్‌ చెప్పినట్లే ఆడాం : శ్రేయస్‌

జైపూర్‌ : ఎవరు ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తే వాళ్లకే బ్యాటింగ్‌ చేసేందుకు ఎక్కువ సమయం ఉంటుందని కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పారని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. సోమవారం జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడాడు. ‘కోచ్‌ పాంటింగ్‌ చెప్పినట్లే నేను రెండు మ్యాచుల్లోనూ మ్యాచ్‌ ముగిసే వరకూ క్రీజులోనే ఉన్నాను. ఈ మ్యాచ్‌లో శిఖర్‌ భయ్య ఆ పని పూర్తి చేశాడు. ఏ పిచ్‌ ఎలా స్పందిస్తుందో మా ఆటగాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే మా బ్యాట్స్‌మెన్‌ అన్ని పిచ్‌లపైనా రాణిస్తున్నారు. శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ విభాగంలో మంచి ప్రారంభం ఇస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టులో సానుకూల వాతావరణం ఉండటం వల్లే అన్ని విభాగాల్లో సమతూకంగా రాణిస్తున్నాం. ప్రణాళిక ప్రకారం ఆడి విజయాలు సాధిస్తున్నాం’ అని శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.

రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా బాగా బ్యాటింగ్‌ చేశారని శ్రేయస్‌ అన్నాడు. రహానె సెంచరీ చేయడంతో లక్ష్యం 200లకు పైకి చేరుకుంటుందనుకున్నాం. కానీ, బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడంలో మా బౌలర్లు బాగా దాదాపు సఫలమయ్యారని దిల్లీ కెప్టెన్‌ పేర్కొన్నాడు. ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంకో మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలున్నాయి.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net