close

ప్రధానాంశాలు

ఆఖర్లో చేతులెత్తేశాం : స్టీవ్‌ స్మిత్‌

జైపూర్‌ : ఇన్నింగ్స్‌ ఆఖర్లో ఆశించిన మేర బ్యాటింగ్‌ చేయలేకపోయామని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమిపై ఆ జట్టు సారథి స్మిత్‌ స్పందించాడు. ‘మధ్య ఓవర్లలో మా జట్టు స్కోరు చూసి కచ్చితంగా 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశిస్తామనుకున్నాం. కానీ, దిల్లీ బౌలర్లు మా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా రబాడా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. దీంతో అనుకున్న దానికంటే తక్కువ లక్ష్యంతోనే పోరాడాల్సి వచ్చింది. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ కూడా బాగా రాణించారు. శిఖర్‌ ధావన్‌, పంత్‌ ఇద్దరూ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వాళ్ల ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ను మానుంచి దూరం చేసింది. అయితే, శ్రేయస్‌ గోపాల్‌ను పవర్‌ ప్లేలో బౌలింగ్‌ వేయించాలని అనుకోలేదు. కానీ, తప్పని పరిస్థితుల్లో గోపాల్‌కు బౌలింగ్‌ ఇచ్చాం. మధ్య ఓవర్లలో శ్రేయస్‌ గోపాల్‌ మంచి ప్రదర్శన ఇచ్చాడు. మంచు పడుతున్న సమయంలో బౌలర్లకు బంతి మీద పట్టు తప్పుతుంది. ఈ వికెట్‌ మ్యాచ్‌ మొత్తం ఒకేలా స్పందించింది. ఇలాంటి పిచ్‌పై కీలకం అనుకున్న బౌలర్లను డెత్‌ ఓవర్లలో వేయించడం సరైంది. దిల్లీ అదే చేసి సఫలమైంది’ అని స్మిత్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్‌ ఖాతాలో ఏడో ఓటమి చేరింది. పాయింట్ల పట్టికలో బెంగళూరుతో పాటు ఆరు పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్‌ ఆశలు రాజస్థాన్‌కు కూడా దాదాపు దూరమైనట్లే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net