close

ప్రధానాంశాలు

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌?

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ x చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్సే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గత రికార్డులు, గణంకాలతో పాటు చెన్నై సొంత మైదానంలో ఆడటం కూడా ఆ జట్టుకు కలిసొస్తుంది. ధోనీసేన ఈ పిచ్‌పై ఆడిన గత ఆరు మ్యాచుల్లో విజయం సాధించి జోరుమీద ఉండగా సన్‌రైజర్స్‌ గత రెండు మ్యాచుల్లో ఇక్కడ ఓటమిపాలైంది. 

మరోవైపు సన్‌రైజర్స్‌ జట్టు సూపర్‌ కింగ్స్‌తో ఆడిన గత ఐదు మ్యాచుల్లోనూ నాలుగుసార్లు ఓడిపోయి కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. చెపాక్‌ పిచ్‌ నెమ్మదిగా ఉండటంతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా మారడంతో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ఏమేరకు రాణిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా చెన్నై బౌలర్లు శార్దుల్‌ ఠాకుర్‌, హర్భజన్‌సింగ్‌ తమ బౌలింగ్‌తో హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ని అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

చెపాక్ పిచ్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘ఈ పిచ్‌పై మా జట్టు అనేక మ్యాచులు ఆడింది. పిచ్‌ మందకొడిగా ఉండటంతో నిలకడగా ఆడటం చాలా కష్టం. స్పిన్‌ బౌలింగ్‌కు బాగా సహకరిస్తుంది. దీంతో బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు శ్రమించాల్సి ఉంటుంది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలిస్తే బాగుంటుంది. సరైన ప్రణాళికలు రూపొందించి ఇక్కడ నెగ్గుకురావడంపై మేం దృష్టిపెట్టాం’ అని చెప్పుకొచ్చాడు.



మరిన్ని