close

ప్రధానాంశాలు

ప్రపంచకప్‌లో ధోనీయే కీలకం: కిరణ్‌మోరే

ముంబయి: రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టులో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలకంగా మారతాడని అన్నారు టీమిండియా మాజీ సెలెక్టర్‌, వికెట్‌ కీపర్‌ కిరణ్‌మోరే. రాయల్‌ ఛాలెంజర్స్‌తో చెన్నై మ్యాచ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధోనీ ఆటతీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మోరే మాట్లాడుతూ ప్రపంచకప్‌లో టీమిండియాలో ధోనీ తప్పకుండా కీలక ఆటగాడిగా ఉంటాడని చెప్పారు. కొద్దిరోజులుగా ధోనీ ఫామ్‌పై వస్తోన్న విమర్శలను ఆయన కొట్టిపారేశాడు. అంతర్జాతీయ ఆటగాళ్లకు వయసుతో సంబంధం లేదని ఫిట్‌నెస్‌ ఉంటే చాలని అన్నారు. 

రాయల్‌ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌పై స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్‌లో ధోనీ అద్భుతంగా ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు వయసుతో సంబంధం లేదని, అది కేవలం సంఖ్యేనని నిరూపించాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 48 బంతుల్లో 84 పరుగులు చేసి అమాంతం చెన్నైను గెలిపించినంత పని చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ చూస్తే ధోనీ కెరీర్‌ ఆరంభ రోజులు గుర్తొచ్చాయి’ అని మోరే పేర్కొన్నారు.

అలాగే సచిన్‌ తెందుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కూడా తమ కెరీర్‌ చివరి రోజుల్లో బాగా రాణించారని మోరే గుర్తుచేసుకున్నారు. కాగా ఇప్పటికే మూడుసార్లు చెన్నైని ఐపీఎల్‌ విజేతగా నిలిపిన ధోనీ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 104.66 సగటుతో మొత్తం 314 పరుగులు చేశాడు. మరోవైపు ధోనీ ఈ సీజన్‌లో ఇంకో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200 సిక్సులు కొట్టిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 203 సిక్సులు బాది దూసుకుపోతున్నాడు. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net