close

ప్రధానాంశాలు

పరుగుల వరదలో విదేశీ సాయం

అభిమానులను అలరించిన విదేశీ క్రికెటర్లు

అందరికన్నా ముందున్న సఫారీలు

అప్పటి వరకు వారంతా కత్తులు దూసుకున్నవారే. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డవారే. అవసరమైనప్పుడు కాస్త అతి చేసినవారే! స్లెడ్జింగ్‌ పేరుతో కలహించుకున్నవారే..! హఠాత్తుగా మిత్రులయ్యారు. ఒకే గది పంచుకుంటున్నారు. స్వదేశీ.. విదేశీ తేడా లేకుండా కుటుంబ సభ్యులతో విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. శత్రువులు.. శత్రువులు కలిసి సహచరులనే ఓడిస్తున్నారు. అరె..! నిన్నటి వరకు నాతో ఆడినవాడే అని మరిచిపోయి కవ్వింపులకు దిగుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వల్లే ఇదంతా! భిన్నత్వంలో ఏకత్వాన్ని ఘనంగా చాటిచెప్పింది ఐపీఎల్‌. లీగ్‌ భారత్‌దే అయినా విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యం ఎప్పుడూ చెప్పుకోతగిందే. పన్నెండో సీజన్‌లో అభిమానులను ఎంతో మంది విదేశీ క్రికెటర్లు చక్కగా అలరించారు. కళ్లు చెదిరే సిక్సర్లు.. అబ్బుర పరిచే క్యాచులు.. నిప్పులు చెరిగే బంతులతో వారెవ్వా! అనిపించారు. ప్లేఆఫ్‌లు మొదలయ్యే ముందు ఓ సారి ఈ ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యం గురించి గుర్తుచేసుకుందామా!!

‘వార్నర్‌’ హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ విజేతగా నిలవడంలో విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యం ఎంతైనా ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోనే జట్టు 2016లో విజేతగా ఆవిర్భవించింది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్‌లో అతడు కనీసం 500 పరుగులు చేస్తున్నాడు. ఈ సారీ 85, 69, 100 నాటౌట్‌, 10, 15, 70 నాటౌట్‌, 51, 50, 67, 57, 37 81తో మెరిశాడు. ఇంత నిలకడగా ఏ జట్టులోనూ మరే ఆటగాడు పరుగులు చేయలేదు. ఈ సారీ హైదరాబాద్‌ ప్లేఆఫ్ చేరుతుందంటే అతడి చలవే! 69.02 సగటుతో 692 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో సైతం అదరగొట్టాడు. 10 మ్యాచుల్లో 55.63 సగటుతో 445 పరుగులు చేశాడు. ఓ శతకమూ బాదేశాడు. అఫ్గానిస్థాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ హైదరాబాద్‌కు ప్రధాన బలంగా మారాడు. 12 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్లలో పరుగులూ చేస్తున్నాడు. మహ్మద్‌ నబీ సైతం 5 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి 60 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే సారథి కేన్‌ విలియమ్సన్‌ మాత్రం ఆశించిన మేరకు రాణించలేదు. 6 మ్యాచుల్లో 55 పరుగులే చేశాడు.

చెన్నైలో సఫారీల జోరు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు విజేతగా నిలవడంతో విదేశీ క్రికెటర్ల భాగస్వామ్యం ఎంతో ఉంది. ప్రస్తుత సీజన్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఇమ్రాన్‌ తాహిర్‌, డుప్లెసిస్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్‌ ఆర్డర్‌ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు డుప్లెసిస్‌ జట్టుకు అండగా నిలిచాడు. 7 మ్యాచుల్లో 29.83 సగటుతో 179 పరుగులు చేశాడు. ఇక 40 ఏళ్ల తాహిర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. చెన్నై ప్రతి మ్యాచులో అతడిని ఆడించింది. అందుకు తగ్గట్టే తాహిర్‌ రాణించాడు. 12 మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగు వికెట్ల ఘనతనూ సాధించాడు. తాను చెన్నైకి పరుగులు బాకీ ఉన్నానంటూ షేన్‌ వాట్సన్‌ అదరగొడుతున్నాడు. 12 మ్యాచుల్లో 251 పరుగులు చేశాడు. భారీ లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్‌పై అతడి ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోలేరు.

నయా దిల్లీ సఫారీ అడ్డే

పన్నెండో సీజన్‌ దిల్లీకి కలిసొచ్చొంది. ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు సమష్టిగా అదరగొడుతున్నారు. దక్షిణాఫ్రికా పేసర్‌ కాగిసో రబాడా తన పదునైన యార్కర్లు, వేగంతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. సీజన్‌లో అరాచకంగా ఆడుతున్న ఆండ్రీ రసెల్‌ను అతడు సూపర్‌ ఓవర్‌లో ఔట్‌ చేసిన యార్కర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 12 మ్యాచుల్లో అతడు 25 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరే బౌలర్‌ అతడి సమీపంలో లేకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ సైతం బంతితో రాణించాడు. 8 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. నేపాల్‌ యువ స్పిన్నర్‌ సందీప్‌ లామిచాన్‌ 6 మ్యాచుల్లో 26.25 సగటుతో 8 వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. కొలిన్‌ ఇంగ్రామ్‌ మిడిలార్డర్‌ను పటిష్ఠం చేశాడు. 10 మ్యాచుల్లో 171 పరుగులతో రాణించాడు.

‘కింగ్స్‌’లో యూనివర్స్‌ బాస్‌

ప్లేఆఫ్ ముందు నిరాశపడ్డ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లో యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌దే హవా. ఓపెనర్‌గా అతడు జట్టుకు మంచి విజయాలే అందించాడు. 11 మ్యాచుల్లో 44.80 సగటుతో 448 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఒక మ్యాచ్‌లో 99 పరుగులతో అజేయంగా నిలవడం గమనార్హం. నాలుగు అర్ధశతకాలు బాదేశాడు. డేవిడ్‌ మిల్లర్‌ మెరవలేదు కానీ 10 మ్యాచుల్లో 213 పరుగులు చేశాడు. అతడు తనశైలిలో ఆడుంటే పంజాబ్‌ ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండేవి. కొత్త కుర్రాడు శామ్‌ కరణ్‌ హ్యాట్రిక్‌ అబ్బురపరిచింది. అతడు 7 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆరు మ్యాచులాడిన విల్‌జోన్‌ సైతం 6 వికెట్లు తీశాడు.

కోల్‌కతాలో ‘డి రస్‌’ ఊచకోత 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఆండ్రీ రసెల్‌ విధ్వంసాలే! అతడికి బంతులు వేయాలంటేనే బౌలర్లు వణికిపోతున్నారు. 12 మ్యాచుల్లో 69.43 సగటుతో 486 పరుగులు చేశాడు డి రస్‌. ముంబయి ఇండియన్స్‌పై 40 బంతుల్లోనే 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ సీజన్‌లో 50 సిక్సర్లు బాదింది అతనొక్కడే కావడం గమనార్హం. 4 అర్ధశతకాలూ అతడి ఖాతాలో ఉన్నాయి. బంతితోనూ రాణించి 10 వికెట్లు తీశాడు. ఆసీస్‌ ఆటగాడు క్రిస్‌లిన్‌ సైతం 11 మ్యాచుల్లో 28.91 సగటుతో 318 పరుగులు చేశాడు కానీ అతడి నుంచి ఆశించింది ఇది కాదు. సునిల్‌ నరైన్‌ 10 మ్యాచుల్లో 143 పరుగులు, 10 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.

ముంబయిలో ‘ముగ్గురు’

మూడు సార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌లో ఈ సారి ఆకట్టుకున్న విదేశీ ఆటగాడు దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌. సారథి రోహిత్‌ శర్మతో కలిసి జట్టుకు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. 12 మ్యాచుల్లో 32.75 సగటుతో 393 పరుగులు చేశాడు. పరుగుల వీరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అత్యధిక స్కోరు 81. మూడు అర్ధశతకాలు అందుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు వచ్చింది శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగకే. 8 మ్యాచుల్లో అతడు 12 వికెట్లు తీశాడు. ముంబయికి అత్యంత నమ్మకస్తుడు పొలార్డ్‌ 12 మ్యాచుల్లో 228 పరుగులు చేశాడు. మెక్లెనగన్‌, ఎవిన్‌ లూయిస్‌, బెరెన్‌డార్ఫ్‌ పరిమితుల మేరకు రాణించారు.

ఆంగ్లేయుల గులాబీ దళం

ఈ సీజన్‌లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌ పేపర్‌ మీదున్నంత బలంగా మైదానంలో కనిపించలేదు. విదేశీ ఆటగాళ్లలో కొందరు రాణించగా మరికొందరు విఫలమయ్యారు. ఆ జట్టు ఓపెనర్‌గా వచ్చిన జోస్‌ బట్లర్‌ 8 మ్యాచుల్లో 38.88 సగటుతో 311 పరుగులు చేశాడు. భార్య ప్రసవించడంతో మధ్యలోనే వెళ్లిపోయాడు. అతనుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ అత్యంత నిలకడగా రాణించాడు. 11 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. అద్భుతంగా బంతులు వేశాడు. అవసరమైనప్పుడు బ్యాటుతోనూ సాయం చేశాడు. 33.50 సగటుతో 67 పరుగులు సాధించాడు. జోఫ్రా ఒక్కడే జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్నాడని ఆ జట్టు  కోచ్‌ సైతం ప్రశంసించాడు. సారథి స్టీవ్‌స్మిత్‌ 11 మ్యాచుల్లో 39.88 సగటుతో 319 పరుగులు చేశాడు. 3 అర్ధశతకాలు సాధించాడు.

‘మిస్టర్‌ 360’కి తోడుగా అలీ

విరాట్‌ కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును స్వదేశీ కన్నా విదేశీ ఆటగాళ్లే ఎక్కువ ఆదుకున్నారు. సీనియర్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 11 మ్యాచుల్లో 53.88 సగటుతో 431 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 5 అర్ధశతకాలు ఉన్నాయి. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై అతడి విధ్వంసం మరోసారి వింటేజ్‌ ‘మిస్టర్‌ 360’ని గుర్తుకు తెచ్చింది. ఇంగ్లాండ్‌ ఆటగాడు మొయిన్‌ అలీ తుది జట్టులోకి వచ్చిన తర్వాతే సమతూకం పెరిగింది. 11 మ్యాచుల్లో అతడు 220 పరుగులు చేశాడు. 6 వికెట్లు సైతం తీశాడు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ స్టాయినిస్‌ సైతం బెంగళూరు విజయాల్లో కీలకం అయ్యాడు. 9 మ్యాచుల్లో 211 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌ సగటు 70.33 కావడం గమనార్హం.
 మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net