close

ప్రధానాంశాలు

కసిలేని కోల్‌కతా

చేజారిన ప్లేఆఫ్స్‌ బెర్తు
చివరి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన
ముంబయి చేతిలో చిత్తు

నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేదు. వేరే జట్లతో పోటీనే లేదు. గెలిస్తే ముందంజే. ఏడో విజయంతోనే ప్లేఆఫ్స్‌ బెర్తు సాధించే అవకాశం. ఇలాంటి మ్యాచ్‌లో ఏ జట్టయినా ఎంత కసిగా ఆడుతుంది? ఎంత పట్టుదల ప్రదర్శిస్తుంది? కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం పేలవ ఆటతో ఆశ్చర్యపరిచింది. కనీస ప్రయత్నం లేకుండా, పోరాట పటిమ చూపకుండా ప్రత్యర్థికి తలవంచింది. ఆదివారం ఐపీఎల్‌-12 చివరి లీగ్‌ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైన ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ముంబయి చేతిలో చిత్తయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ముంబయి

బెంగళూరుతో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బాగా ఆడి కూడా ఓడిపోయింది సన్‌రైజర్స్‌. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై జాలిపడిందో ఏమో.. ఆదివారం కోల్‌కతా కనీస ప్రయత్నం చేయకుండా ప్లేఆఫ్‌ బెర్తును సన్‌రైజర్స్‌కు వదిలేసింది. గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే స్థితిలో ఆ జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్య (2/20), మలింగ (3/35), బుమ్రా (2/31)ల ధాటికి కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. వికెట్లు తీయకున్నా మెక్లెనగన్‌ (0/19), కృనాల్‌ పాండ్య (0/14) కూడా చక్కగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థికి కళ్లెం వేశారు. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో క్రిస్‌ లిన్‌ (41; 29 బంతుల్లో 2×4, 4×6) టాప్‌స్కోరర్‌. అనంతరం రోహిత్‌ శర్మ (55 నాటౌట్‌; 48 బంతుల్లో 8×4), సూర్యకుమార్‌ యాదవ్‌ (46 నాటౌట్‌; 27 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో ముంబయి 16.1 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేఆఫ్స్‌ ముంగిట కెప్టెన్‌ రోహిత్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడటం ముంబయికి కలిసొచ్చే అంశం. ఛేదనలో ముంబయికి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. డికాక్‌ (30; 23 బంతుల్లో 1×4, 3×6)తో తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించిన రోహిత్‌.. అభేద్యమైన రెండో వికెట్‌కు సూర్యకుమార్‌తో 88 పరుగులు జోడించి జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.

ఉతప్ప చెత్త బ్యాటింగ్‌: 11వ ఓవర్లో 0.. 12వ ఓవర్లో 4.. 16వ ఓవర్లో 6.. 19వ ఓవర్లో 7.. 20వ ఓవర్లో 3.. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆయా ఓవర్లలో నమోదైన పరుగులివి. ఆ జట్టు బ్యాటింగ్‌ ఎలా సాగిందో చెప్పడానికి ఈ రుజువులు చాలు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరు తరహాలో స్పిన్‌ పిచ్‌కు తాళలేక టపటపా వికెట్లు పడిపోయి తక్కువ స్కోరుకు పరిమితం అయితే ఏదోలే అనుకోవచ్చు. కానీ బ్యాటింగ్‌ మరీ కష్టంగా ఏమీ లేని వాంఖడెలో.. ప్లేఆఫ్‌ చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఆడిన తీరు మాత్రం అనూహ్యమే. రాబిన్‌ ఉతప్ప (40; 47 బంతుల్లో 1×4, 3×6) మరీ జిడ్డుగా ఆడి కోల్‌కతా అవకాశాల్ని దెబ్బ తీశాడు. పైన చెప్పుకున్న అన్ని ఓవర్లలో ప్రధానంగా బ్యాటింగ్‌ చేసింది అతనే. 8 వికెట్లు చేతిలో ఉండగా.. పేసర్‌ మెక్లెనగన్‌ వేసిన 11వ ఓవర్‌ను అతను మెయిడెన్‌ ఆడాడు. మిగతా ఓవర్లలోనూ అతను తీవ్రంగా తడబడ్డాడు. కార్తీక్‌ (3)తో పాటు సీజన్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన రసెల్‌ (0) విఫలం కావడంతో ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో పరుగుల రాక చాలా కష్టమైంది. నితీశ్‌ రాణా (26; 13 బంతుల్లో 3×6) ఉన్నంత సేపు 150 చేసేలా కనిపించిన కోల్‌కతా అతను ఔటయ్యాక ఉతప్ప తడబాటు వల్ల తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఆరంభంలో నైట్‌రైడర్స్‌ 3 ఓవర్లకు 10 పరుగులే చేసినప్పటికీ.. క్రిస్‌ లిన్‌ మెరుపులు మెరిపించి జట్టును మంచి స్థితికే తీసుకెళ్లాడు. కానీ అతను ఔటయ్యాక ఇన్నింగ్స్‌ గాడి తప్పింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ ఎల్బీ (బి) హార్దిక్‌ 9; లిన్‌ (సి) డికాక్‌ (బి) హార్దిక్‌ 41; ఉతప్ప (సి) రోహిత్‌ (బి) బుమ్రా 40; కార్తీక్‌ (సి) కృనాల్‌ (బి) మలింగ 3; రసెల్‌ (సి) డికాక్‌ (బి) మలింగ 0; రాణా (సి) పొలార్డ్‌ (బి) మలింగ 26; రింకూ సింగ్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 4; నరైన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 133; వికెట్ల పతనం: 1-49, 2-56, 3-72, 4-73, 5-120, 6-133, 7-133; బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-19-0; కృనాల్‌ పాండ్య 4-0-14-0; మలింగ 4-0-35-3; బుమ్రా 4-0-31-2; రాహుల్‌ చాహర్‌ 1-0-12-0; హార్దిక్‌ పాండ్య 3-0-20-2

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) కార్తీక్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 30; రోహిత్‌శర్మ నాటౌట్‌ 55; సూర్యకుమార్‌ నాటౌట్‌ 46; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (16.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 134; వికెట్ల పతనం: 1-46; బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 4-0-25-0; గర్నీ 3-0-20-0; రసెల్‌ 2.1-0-34-0; నరైన్‌ 4-0-33-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 3-0-22-1Tags :

మరిన్ని