close

ప్రధానాంశాలు

నిలిచేదెవరో!

విశాఖలో నేడు ఎలిమినేటర్‌
దిల్లీతో సన్‌రైజర్స్‌ ఢీ
రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

రసవత్తర పోరుకు రంగం సిద్ధం.. మరో అవకాశం లేదు, ఓడితే ఇంటికే.. బుధవారమే దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఐపీఎల్‌-12 ఎలిమినేటర్‌ మ్యాచ్‌. విశాఖపట్నం వేదికగా దిల్లీతో అమీతుమీ తేల్చుకునేందుకు హైదరాబాద్‌ సిద్ధమైంది. అదృష్టం తన పక్షాన ఉండడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్‌.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. మరోవైపు రబాడ లాంటి కీలక బౌలర్‌ సేవలను కోల్పోయిన దిల్లీ.. హైదరాబాద్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

విశాఖపట్నం

విశాఖ తీరాన ఐపీఎల్‌-12 ప్లేఆఫ్స్‌కు వేళైంది.. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొనబోతోంది. లీగ్‌ దశ ముఖాముఖిలో తలో మ్యాచ్‌ గెలిచాయి. మరి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. వార్నర్‌, బెయిర్‌స్టో దూరమైనప్పటికీ అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్‌.. స్ఫూర్తిదాయ ప్రదర్శనతో లీగ్‌ దశ దాటిన దిల్లీని ఓడించాలంటే చాలా కష్టపడాల్సిందే. మ్యాచ్‌లో ఫేవరెట్‌ డీసీనే అనడంలో సందేహం లేదు. కానీ టీ20ల్లో ఎలాంటి ఫలితమైనా రావచ్చు కాబట్టి సన్‌రైజర్స్‌ అవకాశాల్ని కొట్టిపారేయలేం. చివరి లీగ్‌ మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌  సన్‌రైజర్స్‌తో పాటు ఫామ్‌లో ఉన్న మనీష్‌ పాండే, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌లపై సన్‌రైజర్స్‌ ఆశలు పెట్టుకుంది. మరోవైపు దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌, బౌల్ట్‌, ఇషాంత్‌లను నమ్ముకుంది.

దిల్లీ.. అదే స్ఫూర్తితో!
ఐపీఎల్‌ పేరెత్తితే దిల్లీ పరాజయాల పరంపరే గుర్తొచ్చేది ఒకప్పుడు. విజయాలకు మొహం వాచిపోయి..పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడే దిల్లీ.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే స్ఫూర్తిదాయ ప్రదర్శనతో ఆ జట్టు విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్‌ చేరింది. బౌలింగ్‌లో రబాడ, బ్యాటింగ్‌లో రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ గొప్పగా రాణించారు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన కాగిసో రబాడ (25 వికెట్లు) ప్లేఆఫ్స్‌కు ముందు దూరం కావడం దిల్లీకి పెద్ద లోటు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారే దిల్లీ ఓడింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించాలని దిల్లీ పట్టుదలతో ఉంది.

అంత వీజీ కాదు..!
దిల్లీలా సన్‌రైజర్స్‌ దర్జాగా ప్లేఆఫ్స్‌కు రాలేదు. టోర్నీలో ఒక దశలో టాప్‌ రెండు జట్లలో ఒకటిగా కొనసాగిన సన్‌రైజర్స్‌ కీలక సమయంలో గాడి తప్పింది. తానాడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్‌ గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ఆఖరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడటంతో.. మెరుగైన రన్‌రేట్‌తో ముందంజ వేసింది. ఐపీఎల్‌ చరిత్రలో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వచ్చిన తొలి జట్టు సన్‌రైజర్సే. లీగ్‌ దశలో సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వార్నర్‌, బెయిర్‌స్టో జట్టును వీడటం సన్‌రైజర్స్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదే. ఈ స్థితిలో విలియమ్సన్‌ జట్టును ముందుండి నడిపించడం కీలకం. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడం.. స్పిన్నర్లు నబి, రషీద్‌ ఖాన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడాన్ని బట్టే సన్‌రైజర్స్‌  విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net