close

ప్రధానాంశాలు

ముంబయిదే ముందడుగు

చెన్నైపై గెలిచి ఐపీఎల్‌-12 ఫైనల్లోకి ప్రవేశం
అదరగొట్టిన సూర్యకుమార్‌, రాహుల్‌ చాహర్‌

చెపాక్‌లో చెన్నైకి చెక్‌. మేటి జట్ల పోరులో ముంబయి ఇండియన్స్‌దే పైచేయి. టోర్నీలో ముచ్చటగా మూడోసారి సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబయి.. ఐపీఎల్‌-12 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ల స్పిన్‌ ఉచ్చులో చెన్నైని బిగించిన ముంబయి.. సూర్యకుమార్‌ యాదవ్‌ అదిరే బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మూడు సార్లు ఛాంపియన్‌ ముంబయి ఫైనల్‌ చేరడం ఇది ఐదోసారి. ఓడిపోయినా.. ఫైనల్‌   చేరేందుకు చెన్నైకి మరో అవకాశముంది. సన్‌రైజర్స్‌, దిల్లీ మధ్య ఎలిమినేటర్‌ విజేతతో ధోని జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

చెన్నై

చెన్నైని చెన్నైలో ఓడించడం చాలా కష్టం. అలాంటిది చెన్నైని దాని సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌లో రెండోసారి మట్టికరిపించింది ముంబయి ఇండియన్స్‌. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌ (2/14), కృనాల్‌ పాండ్య (1/21), జయంత్‌ యాదవ్‌ (1/25) మాయాజాలానికి తడబడిన చెన్నై మొదట 4 వికెట్లకు 131 పరుగులే చేసింది. రాయుడు (42 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 1×6), ధోని (37 నాటౌట్‌; 29 బంతుల్లో 3×6) రాణించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (71 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4) సూపర్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి గెలవడం విశేషం.

మెరిసిన సూర్యకుమార్‌
ఛేదన ఆరంభంలో ముంబయి కూడా తడబడింది. 4 ఓవర్లలో 22 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. చెన్నై బౌలింగ్‌ దాడిని ఆరంభించిన దీపక్‌ చాహర్‌, రెండో బంతికే రోహిత్‌ శర్మ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. నాలుగో ఓవర్లో డికాక్‌ (8)ను హర్భజన్‌ ఔట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదే అయినా.. జడేజా, తాహిర్‌ రూపంలో చెన్నైకి మరో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుందేమో అనిపించింది. కానీ సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబయి ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ (28; 31 బంతుల్లో 1×4, 1×6) అండతో అదరగొట్టాడు. చెన్నై బౌలర్లకు తమపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వలేదు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. హర్భజన్‌ బౌలింగ్‌లో కిషన్‌.. ఓ ఫోర్‌, సిక్స్‌ దంచాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ ధాటిని కొనసాగించగా.. కిషన్‌ స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ అతడికి సహకరించాడు. 14వ ఓవర్లో స్కోరు వంద దాటింది. కానీ అదే ఓవర్లో తాహిర్‌ వరుస బంతుల్లో కిషన్‌, కృనాల్‌ (0)లను ఔట్‌ చేసి మ్యాచ్‌పై కాస్త ఆసక్తి కలిగించాడు. కానీ చాలినన్ని ఓవర్లు ఉండగా.. అప్పటికే లక్ష్యానికి చేరువగా వచ్చిన ముంబయికి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. హార్దిక్‌ పాండ్య (13 నాటౌట్‌)తో కలిసి సూర్యకుమార్‌ అలవోకగా పని పూర్తి చేశాడు.

తడబడిన చెన్నై
చెన్నై ఆరంభం పేలవం. ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై పరుగులు రాబట్టడం చెన్నై బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సూపర్‌కింగ్స్‌ పవర్‌ప్లే ముగిసే సరికి  32 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. మంచి టర్న్‌ లభించిన పిచ్‌పై కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, జయంత్‌ యాదవ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. రాహుల్‌ చాహర్‌.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో డుప్లెసిస్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్ల పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో జయంత్‌కు రైనా (5), కృనాల్‌కు వాట్సన్‌ (10) వికెట్లు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరూ క్యాచ్‌ ఔటయ్యారు. మురళీ విజయ్‌ (26; 26 బంతుల్లో 3×4), రాయుడు వెంటనే వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ పరుగులు మాత్రం కష్టంగా వచ్చాయి. స్కోరు బోర్డు నత్తలా సాగింది. 12 ఓవర్లకు స్కోరు 65 మాత్రమే. 13వ ఓవర్లో విజయ్‌ను రాహుల్‌ చాహర్‌ ఔట్‌ చేశాడు. ధోని రాకతో స్కోరు వేగం పెరిగింది. రాయుడు కూడా కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు. జయంత్‌ బౌలింగ్‌లో ధోని, రాయుడు చెరో సిక్స్‌ కొట్టారు. హార్దిక్‌ బౌలింగ్‌లో రాయుడు ఓ బంతిని బౌండరీ దాటించాడు. పరుగుల రాక కాస్త పెరిగినా.. అవసరమైనంత వేగంగానైతే స్కోరు రాలేదు. బుమ్రా బౌలింగ్‌లో రాయుడు ఓ ఫోర్‌ కొట్టగా.. చెన్నై 18 ఓవర్లకు 107/4తో నిలిచింది. ఐతే మలింగ బౌలింగ్‌లో ధోని వరుసగా రెండు భారీ సిక్స్‌లు కొట్టి చెన్నై అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. ధోని, రాయుడు జోడీ అభేద్యమైన ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించింది. చివరి ఐదు ఓవర్లలో చెన్నైకి 40 పరుగులు వచ్చాయి.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 6; వాట్సన్‌ (సి) జయంత్‌ (బి) కృనాల్‌ 10; రైనా (సి) అండ్‌ (బి) జయంత్‌ 5; మురళీ విజయ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 26; అంబటి రాయుడు నాటౌట్‌ 42; ధోని నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 131; వికెట్ల పతనం:  1-6, 2-12, 3-32, 4-65; బౌలింగ్‌: మలింగ 3-0-26-0; కృనాల్‌ పాండ్య 4-0-21-1; రాహుల్‌ చాహర్‌ 4-0-14-2; జయంత్‌ యాదవ్‌ 3-0-25-1; బుమ్రా 4-0-31-0; హార్దిక్‌ పాండ్య 2-0-13-0

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ ఎల్బీ (బి) దీపక్‌ చాహర్‌ 4; డికాక్‌ (సి) డుప్లెసిస్‌ (బి) హర్భజన్‌ 8; సూర్యకుమార్‌ యాదవ్‌ నాటౌట్‌ 71; ఇషాన్‌ కిషన్‌ (బి) తాహిర్‌ 28; కృనాల్‌ పాండ్య (సి) అండ్‌ (బి) తాహిర్‌ 0; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 132; వికెట్ల పతనం: 1-4, 2-21, 3-101, 4-101; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3.3-0-30-1; హర్భజన్‌ సింగ్‌ 4-0-25-1; జడేజా 4-0-18-0; బ్రావో  3-0-25-0; తాహిర్‌ 4-0-33-2Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net