close

ప్రధానాంశాలు

అంపైర్‌కు కోపమొచ్చింది.. తలుపు పగిలింది

బెంగళూరు: హోరాహోరీగా సాగే ఐపీఎల్‌ మ్యాచ్‌లో భావోద్వేగాలు  ఆపుకోవడం ఆటగాళ్లకు కష్టంగానే ఉంటుంది. ఈ సీజన్‌లో కొంతమంది క్రికెటర్లు హద్దుమీరి ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. కానీ మైదానంలో ఉంటూ మ్యాచ్‌ను నియంత్రించే అంపైర్‌కు కోపం వస్తే..? అతను ఆగ్రహంతో స్టేడియంలోని ఓ తలుపును పగలగొడితే? గత శనివారం బెంగళూరు, హైదరాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా అదే జరిగిందట. అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ స్టేడియంలోని ఓ గది తలుపు పగలకొట్టాడట. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఉమేశ్‌ వేసిన ఓ బంతిని నిగెల్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో అది నోబాల్‌ కాదని తేలింది. దాంతో నిగెల్‌తో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి, ఉమేశ్‌ వాగ్వాదానికి దిగారు. ఆ చిరాకుతో ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత విరామ సమయంలో నిగెల్‌ అంపైర్‌ గది తలుపును ధ్వంసం చేశాడట. అయితే ఈ ఘటన పట్ల బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు కర్ణాటక క్రికెట్‌ సంఘం అధికారి ఒకరు తెలిపారు. తలుపు ధ్వంసం చేసినందుకు నిగెల్‌ రూ.5 వేలు చెల్లించాడట. నిగెల్‌ మంగళవారం క్వాలిఫయర్‌లో అంపైరింగ్‌ చేశాడు. ఫైనల్లోనూ అతను బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.

వికెట్‌ తీస్తే.. అలా చేస్తావా: సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఖలీల్‌ను కోహ్లి అనుకరిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లి వికెట్‌ను తీసిన ఆనందంలో ఖలీల్‌ సంబరాలు చేస్తూ చేతులతో విచిత్రమైన సైగలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతున్నపుడు కోహ్లి, ఖలీల్‌ పక్కపక్కనే ఉన్నారు. అప్పుడు కోహ్లి.. ఖలీల్‌ సైగలను అనుకరించి చూపించాడు. దాంతో అక్కడున్న వాళ్లంతో నవ్వుల్లో మునిగిపోయారు.



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net