close

ప్రధానాంశాలు

టాస్‌ గెలిస్తే ధోనీ ఏం చేస్తాడు?

ఐఐటీ మద్రాస్‌ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్న ఇది..

చెన్నై : ఐపీఎల్‌ 12వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సాయంత్రం 5గంటలైతే టీవీల ముందుకు చేరిపోతున్నారు. ఈ ఐపీఎల్‌ ఫీవర్‌ ఇప్పుడు విద్యా సంస్థలకూ పాకింది. ఎంతగానంటే ప్రముఖ ఐఐటీ  ప్రశ్నాపత్రంలో ఐపీఎల్‌ గురించి ప్రశ్నలు వచ్చేంతా.

దేశంలో పేరెన్నికగల ఐఐటీ మద్రాస్‌.. చెన్నై జట్టు కెప్టెన్‌ అయిన ధోనికి టాస్‌ విషయంలో సహాయం చేయాలని భావించింది. ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని టాస్‌ గెలిస్తే ఎం చేస్తాడు? అనే ప్రశ్నను ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ విగ్నేష్‌ ముత్తు విజయన్‌ తన విద్యార్థులకు సంధించాడు. ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు అంటే మే 6న జరిగిన  ‘మెటీరియల్‌ అండ్‌ ఎనర్జీ బ్యాలెన్స్‌’ పరీక్షలో ఈ ప్రశ్నను పొందుపరిచాడు. చెన్నైలో ఉండే వాతావరణ పరిస్థితులు, మైదానంలో పిచ్‌పై ఉండే తేమ గురించి వివరిస్తూ.. ఈ పరిస్థితుల్లో ధోనీ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవాలా? లేదా బౌలింగ్‌ ఎంచుకోవాలా? అనేది ఆ ప్రశ్న సారాంశం. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి కూడా దీన్ని షేర్‌ చేసింది.

చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో  మూడు సార్లు టాస్‌ గెలిచిన ధోని ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో మాత్రం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీ సేన ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై ఓడిపోయింది. అయితే ఫైనల్‌ చేరడానికి చెన్నైకి మరో అవకాశం ఉంది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net